BCCI: ఇప్పటికే భారీగా చెల్లిస్తున్నాం, పెంచే ప్రసక్తే లేదు .. ఆటగాళ్లపై బీసీసీఐ సీరియస్!

BCCI: ఐపీఎల్లో విదేశీ ఆటగాళ్ల అందుబాటు అంశంపై ఫ్రాంచైజీలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

Rishvik
Published on: 13 Jun 2026 6:11 PM IST
BCCI
X

BCCI: ఇప్పటికే భారీగా చెల్లిస్తున్నాం, పెంచే ప్రసక్తే లేదు .. ఆటగాళ్లపై బీసీసీఐ సీరియస్!

BCCI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో విదేశీ ఆటగాళ్ల అందుబాటు అంశంపై ఫ్రాంచైజీలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. భారీ మొత్తం అందుకున్న విదేశీ ప్లేయర్స్ చాలా మంది ఐపీఎల్ 2026లో ఆడలేదు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక వ్యాఖ్యలు చేసింది. విదేశీ ఆటగాళ్లు టోర్నీ మధ్యలో వైదొలిగే అంశంలో ఫ్రాంచైజీలు, ఆటగాళ్ల మధ్య మధ్యవర్తిత్వం చేయబోమని స్పష్టం చేసింది. ఆటగాళ్ల లభ్యతకు సంబంధించిన సమస్యలను ఆయా ఫ్రాంచైజీలు, ఆటగాళ్లే పరస్పరం పరిష్కరించుకోవాలని బీసీసీఐ తేల్చి చెప్పింది.

ఐపీఎల్ వేలంలో ఎంపికైన తర్వాత సరైన కారణం లేకుండా టోర్నీ నుంచి తప్పుకునే విదేశీ ఆటగాళ్లపై ఇప్పటికే బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంటోంది. సదరు ఆటగాళ్లపై రెండేళ్ల నిషేదంను అమలు చేస్తోంది. అయినప్పటికీ టోర్నీ మొత్తం ఆటగాళ్లు అందుబాటులో ఉండటం ఇప్పటికీ పెద్ద సవాలుగానే మారింది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆస్ట్రేలియా స్టార్ పేసర్లు జోష్ హేజిల్‌వుడ్, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ గాయాల కారణంగా తొలి దశ మ్యాచ్‌లకు దూరమయ్యారు. ముఖ్యంగా స్టార్క్ అందుబాటులో లేకపోవడం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై ప్రభావం చూపింది.

రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ కుమార సంగక్కర కూడా ఈ అంశంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరమైనట్లు చెప్పిన ఇంగ్లాండ్ ఆటగాడు సామ్ కరన్.. అనంతరం ఇంగ్లాండ్‌లో టీ20 క్రికెట్ ఆడటంపై ఆయన ప్రశ్నలు లేవనెత్తాడు. పంజాబ్ కింగ్స్ సహ యజమాని మోహిత్ బర్మన్ కూడా విదేశీ ఆటగాళ్ల లభ్యత విషయంలో బీసీసీఐ, ఇతర దేశాల క్రికెట్ బోర్డులు మెరుగైన సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు.

దాంతో ఈ విషయంలో బీసీసీఐ స్పందిస్తూ.. తన వైఖరిని స్పష్టంగా వెల్లడించింది. 'ఆటగాళ్లకు ఫ్రాంచైజీలే బాధ్యత వహించాలి. ఎవరు ఐపీఎల్‌కు ప్రాధాన్యం ఇస్తారు, ఎవరు జాతీయ జట్టుకు ప్రాధాన్యం ఇస్తారు అనేది వారి నిర్ణయం. గాయం మినహా మిగతా సందర్భాల్లో మా నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి' అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. జోఫ్రా ఆర్చర్ ఉదాహరణను ప్రస్తావిస్తూ.. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు పనిభారం నియంత్రించాలని భావించినప్పటికీ అతడు పూర్తి సీజన్‌కు అందుబాటులో ఉన్నాడని పేర్కొన్నాయి.

మరోవైపు ఐపీఎల్ వేలం బడ్జెట్ పెంపుపై కూడా బీసీసీఐ స్పందించింది. ప్రస్తుతం ఒక్కో ఫ్రాంచైజీకి రూ.125 కోట్ల పర్స్ ఉందని, దానిని భారీగా పెంచే ఆలోచన లేదని తెలిపింది. ఆటగాళ్లు ఇప్పటికే భారీ మొత్తాలు అందుకుంటున్నారని పేర్కొంది. మ్యాచ్ ఫీజులు, స్పాన్సర్‌షిప్‌ల ద్వారా అదనపు ఆదాయం కూడా పొందుతున్నారని చెప్పింది. అందువల్ల పర్స్ పరిమితిని దశలవారీగా మాత్రమే పెంచే అవకాశాలు ఉన్నాయని బీసీసీఐ తెలిపింది.

2028 నుంచి ఐపీఎల్ మ్యాచ్‌ల సంఖ్యను 74 నుంచి 94కు పెంచాలని బీసీసీఐ యోచిస్తోంది. ఈ నేపథ్యంలో టోర్నీ షెడ్యూల్‌లో మార్పులు అవసరమవుతాయని భావిస్తోంది. మార్చి తొలి వారం నుంచి మే మధ్య వరకు ఐపీఎల్ నిర్వహించడం ఉత్తమ మార్గమని బోర్డు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వర్షాకాలం ప్రారంభమయ్యే ముందు టోర్నీని పూర్తి చేయాలంటే ఇదే సరైన సమయమని పేర్కొన్నాయి.

అంతేకాకుండా భవిష్యత్తులో ద్వైపాక్షిక సిరీస్‌ల ప్రాముఖ్యతపై కూడా బీసీసీఐ చర్చలు జరుపుతోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తమ స్వంత టీ20 లీగ్‌లను నిర్వహిస్తున్న నేపథ్యంలో క్రికెట్ కూడా ఫుట్‌బాల్ తరహాలో మారే అవకాశాలు ఉన్నాయని భావిస్తోంది. అయితే అభిమానుల్లో విసుగు రాకుండా టోర్నీల సంఖ్య, షెడ్యూల్‌ల విషయంలో సమతుల్యత అవసరమని బీసీసీఐ అభిప్రాయపడుతోంది. ప్రస్తుతం ప్రతి ఏడాది ఐసీసీ టోర్నీలు జరగడం కూడా క్రికెట్ క్యాలెండర్‌పై ప్రభావం చూపుతోందని పేర్కొంది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story