BCCI Review: వరుస పరాజయాలతో బీసీసీఐ అలర్ట్.. గంభీర్, ప్లేయర్స్ పనితీరుపై సమీక్ష!

BCCI Review: BCCI Review Meeting on Gautam Gambhir. రెండు టీ20 సిరీస్‌ల్లో పరాజయాలు ఎదురుకావడంతో జట్టు ప్రదర్శనపై సమగ్ర సమీక్ష నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Rishvik
Published on: 10 July 2026 6:15 PM IST
BCCI Review
X

BCCI Review: వరుస పరాజయాలతో బీసీసీఐ అలర్ట్.. గంభీర్, ప్లేయర్స్ పనితీరుపై సమీక్ష!

BCCI to Review Gautam Gambhir: ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ ఉండగానే భారత్ 3-0తో కోల్పోయింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో దారుణ ప్రదర్శనతో టీమిండియా మూల్యం చెల్లించుకుంది. వరుస పరాజయాల తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. వరుసగా రెండు టీ20 సిరీస్‌ల్లో (ఐర్లాండ్, ఇంగ్లండ్) పరాజయాలు ఎదురుకావడంతో జట్టు ప్రదర్శనపై సమగ్ర సమీక్ష నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆటగాళ్లతో పాటు కోచింగ్ సిబ్బంది పనితీరుపై కూడా ఈ సమీక్షలో మాట్లాడనున్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.

టీ20 ప్రపంచకప్ 2026 విజయం తర్వాత బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ స్థానంలో సర్పంచ్ సాబ్ శ్రేయస్ అయ్యర్‌ను టీ20 కెప్టెన్‌గా నియమించింది. అయితే శ్రేయాస్ నాయకత్వంలో భారత్ ఇప్పటివరకు ఒక్క విజయం అందుకోలేదు. వరుస సిరీస్ పరాజయాలతో కెప్టెన్సీ, జట్టు ఎంపిక, వ్యూహాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ నిర్వహించనున్న సమీక్షలో పలు కీలక నిర్ణయాలు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీసీసీఐతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఒప్పందం 2027 వరకు ఉంది. టీ20 ప్రపంచకప్, ఆసియా కప్ గెలిపించినప్పటికీ.. ఇటీవలి పేలవ ప్రదర్శన నేపథ్యంలో గౌతీ పనితీరు పైనా బీసీసీఐ సమీక్షలో చర్చ జరగనుందని సమాచారం. మరి బీసీసీఐ ఏమైనా కీలక నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ నిరాశపరిచింది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో టీ20లో నాలుగు వికెట్ల తేడాతో టీమిండియా ఓడింది. మూడో మ్యాచ్‌లో 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేవలం 76 పరుగులకే ఆలౌట్ అయి.. 125 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది. బ్రిస్టల్ వేదికగా జరిగిన నాలుగో టీ20లో తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయి.. సిరీస్‌ను 3-0తో చేజార్చుకుంది. ఇప్పుడు టీమిండియా ‘వైట్‌వాష్’ ముప్పును ఎదుర్కొంటోంది. చివరి మ్యాచ్ లో అయినా గెలిచి పరువు కాపాడుకోవాలని భారత్ చూస్తోంది.

టీ20 ప్రపంచకప్ 2026 విజేత అయిన భారత్‌కు ఇది వరుసగా రెండో టీ20 సిరీస్ పరాజయం. ఇంగ్లండ్ పర్యటనకు ముందు ఐర్లాండ్ చేతిలో 2-0తో భారత్ సిరీస్ కోల్పోయింది. పసికూన ఐర్లాండ్ పై తొలిసారి ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో ఓటమిని చవిచూసింది. ఇది భారత క్రికెట్ చరిత్రలోనే చెత్త ఓటమిగా నిలిచింది. ఇంగ్లండ్ కూడా భారత్‌పై రెండు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లతో కూడిన ద్వైపాక్షిక టీ20 సిరీస్‌ను తొలిసారి గెలిచి చరిత్ర సృష్టించింది. చివరి టీ20లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భారత్ భావిస్తుండగా.. ఇంగ్లండ్ మాత్రం సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story