ఇంగ్లండ్‌కు మళ్లీ ఆడను.. ఆ జట్టుకు కోచ్ కావాలన్నదే నా టార్గెట్.. స్టోక్స్ సంచలన వ్యాఖ్యలు!
Ben Stokes: Ben Stokes confirms he will not return to international cricket. ఇంగ్లండ్ మాజీ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ తన రిటైర్మెంట్‌పై మరోసారి క్లారిటీ ఇచ్చాడు.
ఇంగ్లండ్‌కు మళ్లీ ఆడను.. ఆ జట్టుకు కోచ్ కావాలన్నదే నా టార్గెట్.. స్టోక్స్ సంచలన వ్యాఖ్యలు!
Ben Stokes: ఇంగ్లండ్ మాజీ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ తన రిటైర్మెంట్‌పై మరోసారి క్లారిటీ ఇచ్చాడు. 2027 యాషెస్ సిరీస్ కోసం మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి వచ్చే అవకాశమే లేదని తేల్చి చెప్పాడు. అదే సమయంలో తన భవిష్యత్ ప్రణాళికలను కూడా బహిరంగంగా వెల్లడించాడు. భవిష్యత్తులో ఇంగ్లండ్ జట్టుకు కోచ్‌గా పని చేయడమే తన టార్గెట్ అని వెల్లడించాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్ అనంతరం స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇంగ్లండ్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన స్టోక్స్.. తన కెరీర్‌కు ముగింపు పలికిన తర్వాత భవిష్యత్తులో కోచింగ్ వైపు అడుగులు వేయాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం తాను లెవల్-3 కోచింగ్ కోర్సు చేస్తున్నానని స్టోక్స్ వెల్లడించాడు.
బెన్ స్టోక్స్ తాజాగా 'ఫర్ ది లవ్ ఆఫ్ క్రికెట్' పోడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ పలు విషయాలపై స్పందించాడు. 'నేను రిటైర్మెంట్ ఇచ్చాను. ఆటకు దూరమైనా క్రికెట్‌లోనే కొనసాగాలని అనుకుంటున్నాను. అందుకే ఇప్పుడే కోచింగ్ కోర్సు పూర్తి చేస్తున్నాను. భవిష్యత్తులో ఇంగ్లండ్ జట్టుకు కోచ్‌గా పనిచేసే అవకాశం వస్తే.. అది నాకు ఎంతో గౌరవంగా భావిస్తాను. ఇంగ్లండ్‌కు కోచ్ కావాలన్నదే నా టార్గెట్. ఆటగాడిగా కాకుండా నాయకత్వ బాధ్యతల్లో ఉండాలనే ఆలోచన నాకు చాలా ఇష్టం' అని స్టోక్స్ తెలిపాడు.
ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ ఎంపికపై కూడా బెన్ స్టోక్స్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. 'నా తర్వాత హ్యారీ బ్రూక్ కెప్టెన్ అవుతాడని భావించా. కానీ జో రూట్‌ను కెప్టెన్‌గా నియమించడం నన్ను ఆశ్చర్యం కలిగించింది. వైస్ కెప్టెన్‌గా ఉన్న బ్రూక్‌కు బాధ్యతలు ఇవ్వకపోవడం సరైన నిర్ణయం కాదని నేను అనుకుంటున్నా. అయితే జో రూట్‌పై నాకు పూర్తి నమ్మకం ఉంది. రూట్‌కు నా శుభాకాంక్షలు. అతడు కెప్టెన్‌గా గొప్ప విజయాలు సాధిస్తాడని నమ్ముతున్నాను. కొత్త టెస్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌తో కలిసి మంచి ఫలితాలు సాధిస్తాడు' అని తెలిపాడు.
2022 నుంచి నాలుగేళ్ల పాటు టెస్టు కెప్టెన్‌గా వ్యవహరించిన బెన్ స్టోక్స్.. హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్‌తో కలిసి 'బాజ్‌బాల్' శైలికి రూపకల్పన చేశాడు. దూకుడైన బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ క్రికెట్‌లో కొత్త శకాన్ని ప్రారంభించిన వీరికి మంచి గుర్తింపు లభించింది. అయితే ఇటీవల జట్టు వరుస పరాజయాలతో మెకల్లమ్ టెస్టు కోచ్ పదవి నుంచి తప్పుకోగా.. అతని స్థానంలో స్టీఫెన్ ఫ్లెమింగ్ బాధ్యతలు చేపట్టాడు. మెకల్లమ్‌తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్న స్టోక్స్.. 'నా రిటైర్మెంట్ నిర్ణయం చెప్పిన కొద్ది రోజులకే మెకల్లమ్ కూడా టెస్టు కోచ్ పదవిని వీడాల్సి వచ్చింది. నేను రిటైర్ కాకపోయి ఉంటే అతడే ఇంకా కోచ్‌గా కొనసాగేవాడేమో అని సరదాగా అనిపించింది. అయినప్పటికీ అతడు వైట్‌బాల్ జట్టుతో కొనసాగుతున్నందుకు సంతోషంగా ఉన్నాడు' అని చెప్పుకొచ్చాడు.
2027 యాషెస్ సిరీస్ కోసం తిరిగి వస్తారా? అనే ప్రశ్నకు బెన్ స్టోక్స్ క్లారిటీ ఇచ్చాడు. 'నా రిటైర్మెంట్ నిర్ణయం పూర్తిగా ఆలోచించి తీసుకున్నదే. కేవలం ఆటగాడిగా తిరిగి రావాలనే ఆలోచన ఎప్పుడూ లేదు. నేను 35 ఏళ్ల వయసులో ఉన్నాను. ఇంగ్లండ్ తరఫున ఆడాల్సి వస్తే అది కెప్టెన్‌గా మాత్రమే ఉండాలని అనుకున్నాను. ఇప్పుడు మాత్రం నా రిటైర్మెంట్‌తో పూర్తిగా సంతృప్తిగా ఉన్నాను. మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చే ఆలోచన లేదు' అని స్టోక్స్ స్పష్టం చేశాడు.




