Bhuvneshwar Kumar: బీసీసీఐ సెలెక్టర్లను నేను బ్రతిమిలాడను.. అసలు విషయాన్ని ముక్కుసూటిగా చెప్పేసిన భువనేశ్వర్!
Bhuvneshwar Kumar says he is ready to return to Team India. భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ మరోసారి వార్తల్లో నిలిచాడు.
Bhuvneshwar Kumar: బీసీసీఐ సెలెక్టర్లను నేను బ్రతిమిలాడను.. అసలు విషయాన్ని ముక్కుసూటిగా చెప్పేసిన భువనేశ్వర్!
Bhuvneshwar Kumar: భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ మరోసారి వార్తల్లో నిలిచాడు. 2027 వన్డే ప్రపంచ కప్‌కు టీమిండియా జట్టులో భువీకి చోటు కల్పించాలని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో.. తాజాగా ఈ అంశంపై భువనేశ్వర్ స్పందించాడు. సెలెక్టర్లు భారత జట్టులోకి పిలిస్తే తాను రావడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశాడు. తాను ఎంతవరకు సిద్ధంగా ఉన్నానో నేను బీసీసీఐ సెలెక్టర్లకు చెప్పలేను అని, తన పని క్రికెట్ ఆడటమే అని పేర్కొన్నాడు. తన ఆటతోనే నిరూపించుకుంటా అని, మిగతాది సెలెక్టర్ల చేతుల్లో ఉంటుందని భువీ చెప్పుకొచ్చాడు.
2026 ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా రాణించాడు. ఏకంగా 28 వికెట్లు పడగొట్టి ఆర్సీబీ వరుసగా రెండో టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు టీమిండియా పేస్ విభాగంలో వరుసగా గాయాలు చోటుచేసుకోవడంతో సీనియర్ పేసర్ భువీని తిరిగి జాతీయ జట్టులోకి తీసుకురావాలనే డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో 2027 ప్రపంచ కప్ గురించి ప్రశ్నించగా.. భువి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'బీసీసీఐ సెలెక్టర్ల నుంచి పిలుపు వస్తే నేను ఎందుకు వద్దంటాను?. కచ్చితంగా సిద్ధంగా ఉంటాను. అయితే నేను ఎంతవరకు సిద్ధంగా ఉన్నానో నేను చెప్పలేను. నా పని క్రికెట్ ఆడటమే. అందుకే ఇక్కడ యూపీ టీ20 లీగ్ ఆడేందుకు వచ్చాను' అని భువనేశ్వర్ పేర్కొన్నాడు.
తాను మరో స్థాయికి వెళ్లాలనే ఉద్దేశంతో యూపీ టీ20 లీగ్‌లో ఆడటం లేదని కూడా భువనేశ్వర్ కుమార్ స్పష్టం చేశాడు. 'ఐపీఎల్‌లో కూడా ఆర్సీబీ కోసం మంచి ప్రదర్శన ఇచ్చి మ్యాచ్‌లు గెలిపించాలనే ఉద్దేశంతోనే ఆడాను. అదే విధంగా ప్రస్తుతం కూడా నా దృష్టి క్రికెట్‌పైనే ఉంది. నేను ఎంత సిద్ధంగా ఉన్నానో నిర్ణయించేది సెలెక్టర్లే. నేను ఎంత సిద్ధంగా ఉన్నానో చెప్పడం నా పని కాదు. మిగతాది సెలెక్టర్ల నిర్ణయం' అని భువీ చెప్పుకొచ్చాడు. టీమిండియాకు తిరిగి రావాలనే ఆత్రుత కంటే.. ప్రస్తుతం తన చేతిలో ఉన్న క్రికెట్‌పై దృష్టి పెట్టడం ముఖ్యమని భువనేశ్వర్ మాటలు స్పష్టం చేస్తున్నాయి.
ప్రస్తుతం భువనేశ్వర్ కుమార్ యూపీ టీ20 లీగ్ నాలుగో సీజన్‌లో లక్నో ఫాల్కన్స్‌కు నాయకత్వం వహించనున్నాడు. ఆగస్టు 14 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది. యువ క్రికెటర్లకు తన అనుభవాన్ని పంచుకుంటూనే.. మైదానంలో తన సత్తాను మరోసారి నిరూపించుకునే అవకాశం భువీకి లభించనుంది. యూపీ టీ20 లీగ్ నాలుగో సీజన్ 24 రోజుల పాటు జరగనుంది. మొత్తం 34 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. తొలిసారిగా ఈ టోర్నీ రెండు నగరాల్లో జరగనుంది. లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకానా క్రికెట్ స్టేడియంలో 22 మ్యాచ్‌లు జరగనుండగా.. మిగిలిన 12 మ్యాచ్‌లకు కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.




