Brydon Carse: ఇంగ్లండ్ జట్టుకు మరో షాక్.. నైట్‌క్లబ్ వివాదంలో స్టార్ ప్లేయర్.. చర్యలు తప్పవా?

Brydon Carse: ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మరో వివాదంలో చిక్కుకుంది. ఆ జట్టు స్టార్ పేసర్ బ్రైడన్ కార్స్ నైట్‌క్లబ్ ఘటనలో చిక్కుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Rishvik
Published on: 23 Aug 2026 10:43 PM IST
Brydon Carse
X

Brydon Carse: ఇంగ్లండ్ జట్టుకు మరో షాక్.. నైట్‌క్లబ్ వివాదంలో స్టార్ ప్లేయర్.. చర్యలు తప్పవా?

Brydon Carse: ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మరో వివాదంలో చిక్కుకుంది. ఆ జట్టు స్టార్ పేసర్ బ్రైడన్ కార్స్ నైట్‌క్లబ్ ఘటనలో చిక్కుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. శనివారం డెర్బీలో జరిగిన ఓ ఘటనకు సంబంధించి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్న దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ వ్యవహారంపై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) స్పందిస్తూ.. బ్రైడన్ కార్స్ నైట్‌క్లబ్ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించింది.

ఈ ఘటనపై ఈసీబీ ఓ ప్రకటన విడుదల చేసింది. 'డెర్బీలో శనివారం రాత్రి జరిగినట్లు వస్తున్న వార్తలపై మాకు సమాచారం ఉంది. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తు పూర్తయిన తర్వాత తదుపరి వివరాలను వెల్లడిస్తాము' అని బోర్డు పేర్కొంది. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, కార్స్‌పై ఎలాంటి ఆరోపణలు ఉన్నాయనే విషయాన్ని మాత్రం ఈసీబీ తన ప్రకటనలో ఇప్పటివరకు వెల్లడించలేదు. బ్రైడన్ కార్స్ ప్రస్తుతం పాకిస్థాన్‌తో జరగనున్న రెండో టెస్టు కోసం ఇంగ్లండ్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఈ వారం లార్డ్స్ వేదికగా రెండో టెస్టు జరగనుంది. అయితే నైట్‌క్లబ్ ఘటనపై దర్యాప్తు నేపథ్యంలో కార్స్‌ను జట్టు నుంచి తప్పిస్తారా? లేదా సస్పెండ్ చేస్తారా? అనే అన్నది చూడాలి. ఈ ఘటన తీవ్రతను బట్టి ఈసీబీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఇటీవలే ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్‌గా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన జో రూట్.. ఇంగ్లండ్ ఆటగాళ్లు మంచి రోల్ మోడల్స్‌గా, మంచి వ్యక్తులుగా ఉండాలని సూచించాడు. ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది రోజులకే కార్స్‌కు సంబంధించిన ఈ ఘటన వెలుగులోకి రావడం ఇంగ్లండ్ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. డెర్బీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో బ్రైడన్ కార్స్‌ను పోలీసులు హ్యాండ్‌ కఫ్స్‌తో అదుపులోకి తీసుకున్నట్లు ఉంది. అతడి చుట్టూ కొంతమంది పోలీసులు ఉన్నారు. ఇంగ్లండ్ ఆటగాళ్లు బెన్ స్టోక్స్, మాథ్యూ పాట్స్ కూడా అక్కడ ఉన్నట్లు సమాచారం. అయితే ఇంతకీ ఏం జరిగింది, కార్స్‌పై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అనే అంశాలపై అధికారిక వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది.

బ్రైడన్ కార్స్ ఇటీవలే కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో డర్హామ్ జట్టు తరఫున ఆడాడు. పాకిస్థాన్‌తో తొలి టెస్టు నుంచి అతడికి విశ్రాంతి ఇచ్చి కౌంటీ మ్యాచ్‌లో ఆడించారు. ఆ మ్యాచ్‌లో అతడు రెండు వికెట్లు పడగొట్టాడు. డర్హామ్ మాజీ కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా ఆ మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు. స్టోక్స్ 5/17 గణాంకాలతో చెలరేగడంతో.. డెర్బీషైర్ కేవలం 84 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక ఇంగ్లండ్ క్రికెటర్లకు నైట్‌క్లబ్ ఘటనలు కొత్తేమీ కాదు. గతంలోనూ ఇలాంటి వ్యవహారాల్లో పలువురు ఆటగాళ్లు చిక్కుకున్నారు. కొన్ని నెలల క్రితం ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, పేసర్ గస్ అట్కిన్సన్ ఓ నైట్‌క్లబ్ వద్ద మాజీ రగ్బీ ఆటగాడితో ఘర్షణకు దిగిన ఘటన వివాదాస్పదమైంది.

న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో విజయం అనంతరం జరిగిన ఆ ఘటనలో బెన్ స్టోక్స్, అట్కిన్సన్ కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు వచ్చాయి. అనంతరం ఈసీబీ వారిద్దరిపై చర్యలు తీసుకుని.. రెండో టెస్టు నుంచి తప్పించింది. అయితే మూడో టెస్టులో వారిద్దరు తిరిగి జట్టులోకి వచ్చారు. ఇప్పుడు బ్రైడన్ కార్స్ ఘటనపై ఈసీబీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ వ్యవహారం దర్యాప్తులో ఉన్నందున.. వాస్తవాలు బయటకు కొన్ని రోజుల సమయం పట్టొచ్చు. ఈ నేపథ్యంలో రెండో టెస్టుకు అతడు అందుబాటులో ఉంటాడా లేదా అనేది ఈసీబీ విచారణ అనంతరం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story