Jasprit Bumrah: గాయాన్ని దాచిపెట్టి ఆడిన బుమ్రా.. ముంబై కోచ్ సంచలన వ్యాఖ్యలు!
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా టీ20 వరల్డ్ కప్‌ను గాయంతోనే ఆడాడని ముంబై హెడ్ కోచ్ మహేళ జయవర్ధనే వెల్లడించాడు.
Jasprit Bumrah: గాయాన్ని దాచిపెట్టి ఆడిన బుమ్రా.. ముంబై కోచ్ సంచలన వ్యాఖ్యలు!
Jasprit Bumrah: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ ఏడాది జరిగిన టీ20 వరల్డ్ కప్‌ను చిన్న గాయంతోనే ఆడాడని ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేళ జయవర్ధనే వెల్లడించాడు. అదే గాయం ప్రభావం ఐపీఎల్ 2026లో కూడా కొనసాగిందని, అందుకే బుమ్రా తన సహజ రిథమ్‌ను కోల్పోయాడని పేర్కొన్నాడు. ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ చివరి మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన జయవర్ధనే.. బుమ్రా పరిస్థితిపై కీలక విషయాలు వెల్లడించాడు.
'టీ20 వరల్డ్ కప్ నుంచి వచ్చిన తర్వాత జస్ప్రీత్ బుమ్రాకు చిన్న నిగుల్ ఉంది. గాయంతోనే అతడు వరల్డ్ కప్ మొత్తం ఆడాడు. అందుకే తిరిగి కోలుకునేందుకు మేము అతడికి తగిన విశ్రాంతి ఇచ్చాం' అని తెలిపాడు. ఈ సీజన్‌లో బుమ్రా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాడు. 13 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే తీశాడు. దీనిపై స్పందించిన జయవర్ధనే.. 'మొదటి నాలుగు నుంచి ఐదు మ్యాచ్‌ల వరకు అతడికి ఇది ఒక గ్రాడ్యువల్ బిల్డ్-అప్ దశ. గాయం నుంచి పూర్తిగా బయటపడేందుకు సమయం పట్టింది. అందుకే అతడి బౌలింగ్ వేగం కూడా తగ్గింది' అని వివరించాడు.
టీ20 వరల్డ్ కప్ తర్వాత ముంబై ఇండియన్స్ తమ భారత స్టార్ ఆటగాళ్లైన హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ
సహా బుమ్రాకు కూడా తగిన విశ్రాంతి ఇచ్చిందని జయవర్ధనే తెలిపాడు. ఐపీఎల్ ప్రారంభానికి కేవలం ఐదు రోజుల ముందే వారు ప్రీ-సీజన్ క్యాంప్‌లో చేరారని గుర్తు చేశాడు. 'గాయం ఉన్నప్పుడు బౌలర్ తన బౌలింగ్లో కొంత పదును కోల్పోతాడు. కానీ ఇప్పుడు బుమ్రా పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడు. చివరి నాలుగు నుంచి ఐదు మ్యాచ్‌ల్లో అతడు మళ్లీ తన పాత లయలోకి వచ్చాడు. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తూ యార్కర్లు అద్భుతంగా వేస్తున్నాడు' అని జయవర్ధనే చెప్పాడు.
బుమ్రా ఈ సీజన్‌లో ఎదుర్కొన్న మరో సమస్య నో-బాల్స్ అని కూడా జయవర్ధనే వెల్లడించాడు. 'రన్-అప్‌లో కొంత ఇబ్బంది ఉండటం వల్ల కొన్ని నో-బాల్స్ వేశాడు. అయితే విరామ సమయంలో దానిపై కష్టపడ్డాడు' అని వివరించాడు. ఇక ప్రత్యర్థి జట్లు కూడా బుమ్రాపై ఎక్కువగా రిస్క్ తీసుకోలేదని జయవర్ధనే అభిప్రాయపడ్డాడు. 'మా ఇతర బౌలర్లు అవసరమైన ఒత్తిడి సృష్టించలేకపోవడంతో బుమ్రాను జట్లు జాగ్రత్తగా ఆడాయి. అయినప్పటికీ అతడు తన శక్తి మేరకు శ్రమించాడు' అని తెలిపాడు. చివరగా బుమ్రా పనితీరుపై పూర్తి నమ్మకం వ్యక్తం చేసిన జయవర్ధనే.. బుమ్రా మానసికంగా చాలా బలంగా ఉన్నాడన్నాడు. ఇలాంటి సీజన్ల నుంచి ఆటగాళ్లు చాలా నేర్చుకుంటారని, అతడు త్వరలోనే మరింత బలంగా తిరిగి వస్తాడని ధీమా వ్యక్తం చేశాడు.




