Champions League T20: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 14 జట్లతో మరో మెగా టోర్నీ!
Champions League T20 2026 Set for Return. చాంపియన్స్ లీగ్ టీ20 మళ్లీ ప్రారంభం అవుతుందా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి.
Champions League T20: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 14 జట్లతో మరో మెగా టోర్నీ!
Champions League T20: ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చాంపియన్స్ లీగ్ టీ20 (CLT20) మళ్లీ ప్రారంభం అవుతుందా?.. అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. 2026 సెప్టెంబర్‌లో ఈ ప్రతిష్టాత్మక ఫ్రాంచైజీ టోర్నీని తిరిగి ప్రారంభించేందుకు క్రికెట్ బోర్డులు, వివిధ టీ20 లీగ్‌ల నిర్వాహకులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారిక ప్రకటన ఇంకా వెలువడకపోయినా.. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంతర్జాతీయ క్రికెట్ వర్గాలు అంటున్నాయి.
2014 తర్వాత నిలిచిపోయిన చాంపియన్స్ లీగ్:
ఒకప్పుడు ప్రపంచంలోని అగ్రశ్రేణి ఫ్రాంచైజీ జట్లను ఒకే వేదికపైకి తీసుకొచ్చిన చాంపియన్స్ లీగ్ టీ20 టోర్నీ.. 2014 తర్వాత నిలిచిపోయింది. అయితే గత కొన్ని సంవత్సరాల్లో ప్రపంచ వ్యాప్తంగా టీ20 లీగ్‌ల ప్రాచుర్యం విపరీతంగా పెరగడంతో.. ఈ టోర్నీని మరింత విస్తృత స్థాయిలో పునరుద్ధరించాలనే ఆలోచనకు బలం చేకూరింది. ఈసారి పలు దేశాల లీగ్‌ల నుంచి అగ్ర స్థానంలో జట్లతో భారీ స్థాయిలో టోర్నీ నిర్వహించేందుకు టీ20 లీగ్‌ల నిర్వాహకులుసన్నాహాలు చేస్తున్నారట.
14 జట్లతో మెగా టోర్నీ?:
చాంపియన్స్ లీగ్ టీ20 టోర్నీలో మొత్తం 14 జట్లు పాల్గొనే అవకాశం ఉంది. వివిధ దేశాల ప్రముఖ ఫ్రాంచైజీ లీగ్‌ల నుంచి అగ్ర జట్లకు అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది.భారత్ నుంచి ఐపీఎల్ 2026 ఆడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లకు అవకాశం దక్కనుంది. బిగ్ బాష్ లీగ్ నుంచి పెర్త్ స్కోర్చర్స్, సిడ్నీ సిక్సర్స్.. పాకిస్థాన్ సూపర్ లీగ్ నుంచి పెషావర్ జల్మీ, హైదరాబాద్ కింగ్స్‌మెన్.. ఎస్‌ఏ20 నుంచి సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్, ప్రిటోరియా క్యాపిటల్స్ జట్లకు చోటు దక్కనుంది.
ప్రపంచ ఫ్రాంచైజీ క్రికెట్‌కు కొత్త ఊపు:
చాంపియన్స్ లీగ్ టీ20 తిరిగి ప్రారంభమైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్ క్రికెటర్లు ఒకే వేదికపై తలపడే అవకాశం ఉంటుంది. ఐపీఎల్, బిగ్ బాష్, పీఎస్‌ఎల్, ఎస్‌ఏ20, ది హండ్రెడ్, ఎంఎల్‌సీ, ఐఎల్‌టీ20 వంటి ప్రముఖ లీగ్‌ల ఛాంపియన్ జట్లు పరస్పరం పోటీపడడం అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. ముఖ్యంగా వేర్వేరు దేశాల ఫ్రాంచైజీలు ఒకే ట్రోఫీ కోసం పోటీ పడడంతో ఈ టోర్నీకి ప్రపంచవ్యాప్తంగా భారీ ఆదరణ లభించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఈ టోర్నీపై అధికారిక ప్రకటన వెలువడలేదు. ఫార్మాట్, వేదికలు, షెడ్యూల్, జట్ల అర్హత వంటి అంశాలపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
14 టీమ్స్ ఇవే:
ఐపీఎల్ (భారత్):
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)
గుజరాత్ టైటాన్స్ (GT)
బిగ్ బాష్ లీగ్ (ఆస్ట్రేలియా):
పెర్త్ స్కోర్చర్స్
సిడ్నీ సిక్సర్స్
పాకిస్థాన్ సూపర్ లీగ్ (పాకిస్తాన్):
పెషావర్ జల్మీ
హైదరాబాద్ కింగ్స్‌మెన్
ఎస్‌ఏ20 (దక్షిణాఫ్రికా):
సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్
ప్రిటోరియా క్యాపిటల్స్
ది హండ్రెడ్ (ఇంగ్లండ్):
ఓవల్ ఇన్విన్సిబుల్స్
ట్రెంట్ రాకెట్స్
మేజర్ లీగ్ క్రికెట్ (అమెరికా):
ఎంఐ న్యూయార్క్
వాషింగ్టన్ ఫ్రీడమ్
ఐఎల్‌టీ20 (యూఏఈ):
డెజర్ట్ వైపర్స్
ఎంఐ ఎమిరేట్స్




