Cooper Connolly: కూపర్ కనోలీ అరుదైన రికార్డు.. 18 ఏళ్ల తర్వాత క్రికెట్ దిగ్గజం రికార్డు బద్దలు!
Cooper Connolly created IPL history. ఐపీఎల్‌లో ఆస్ట్రేలియా యువ ఆటగాడు కూపర్ కనోలీ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు.
Cooper Connolly: కూపర్ కనోలీ అరుదైన రికార్డు.. 18 ఏళ్ల తర్వాత క్రికెట్ దిగ్గజం రికార్డు బద్దలు!
Cooper Connolly: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ బ్యాటర్ల విధ్వంసానికి పెట్టింది పేరుగా నిలుస్తోంది. ఈ సీజన్‌లో యువ ఆటగాళ్లు బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. భారీ సిక్సర్లతో అభిమానులను అలరిస్తున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా యువ ఆటగాడు కూపర్ కనోలీ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో తొలి సీజన్ ఆడుతూ.. అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ 2026లో కనోలీ పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే. ఈరోజు రాయల్ ఛాలెెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరిగిన మ్యాచ్‌లో 22 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 37 రన్స్ బాదాడు. 3 సిక్సులు బాదడంతో ఈ రికార్డు అతడి ఖాతాలో చేరింది.
ఐపీఎల్ 2026లో ఇప్పటివరకు కూపర్ కనోలీ మొత్తం 32 సిక్సర్లు బాదాడు. దీంతో 2008లో క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్య నెలకొల్పిన 31 సిక్సర్ల రికార్డును బద్దలు కొట్టాడు. జయసూర్య తొలి ఐపీఎల్ సీజన్‌లోనే ముంబై ఇండియన్స్ తరఫున విధ్వంసకర బ్యాటింగ్‌తో 31 సిక్సర్లు బాది అప్పట్లో సంచలనం సృష్టించాడు. దాదాపు 18 ఏళ్ల పాటు ఆ రికార్డు చెక్కుచెదరకుండా నిలిచింది. ఇప్పుడు కనోలీ దాన్ని అధిగమించాడు. ఈ జాబితాలో జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ మూడో స్థానంలో ఉన్నాడు. అతడు ఐపీఎల్ 2024లో 28 సిక్సర్లు బాదాడు. ఇక ఫిన్ అలెన్ 2026 సీజన్‌లో ఇప్పటివరకు 27 సిక్సర్లు కొట్టి నాలుగో స్థానంలో ఉన్నాడు. షాన్ మార్ష్ 2008లో 26 సిక్సర్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఐపీఎల్ 2026లో బ్యాటర్లు చూపిస్తున్న దూకుడు అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. చిన్న గ్రౌండ్లు, బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌లు, పవర్ హిట్టింగ్ పెరగడం వల్ల భారీ సిక్సర్లు సాధారణమయ్యాయి. ముఖ్యంగా యువ ఆటగాళ్లు ఎలాంటి భయం లేకుండా ఆడుతూ బౌలర్లపై పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తున్నారు. వైభవ్ సూర్యవంశీ, ప్రియాంష్ ఆర్య, అభిషేక్ శర్మ లాంటి యువ ప్లేయర్స్ ఈజీగా సిక్సులు బాదుతున్నారు. ఇంకా సీజన్‌లో కొన్ని కీలక మ్యాచ్‌లు మిగిలి ఉండటంతో.. కూపర్ కనోలీ తన రికార్డును మరింత మెరుగుపరుచుకునే అవకాశం ఉంది. అదే సమయంలో ఫిన్ అలెన్ కూడా ఈ జాబితాలో పైకి చేరే అవకాశాలు ఉన్నాయి.
తొలి ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు:
32 - 2026లో కూపర్ కానలీ
31 - 2008లో సనత్ జయసూర్య
28 - 2024లో జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్
27 - 2026లో ఫిన్ అలెన్
26 - 2008లో షాన్ మార్ష్




