Imran Khan: పాకిస్థాన్ ఆటగాడి కోసం ఇండియన్ క్రికెటర్ల లేఖ!

Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం క్షీణిస్తుండటంతో సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ సహా 21 మంది అంతర్జాతీయ క్రికెట్ కెప్టెన్లు పాక్ ప్రధానికి లేఖ రాశారు.

Gagan kumar
Published on: 24 Aug 2026 10:11 AM IST
Imran Khan
X

Imran Khan: పాకిస్థాన్ ఆటగాడి కోసం ఇండియన్ క్రికెటర్ల లేఖ!

Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని, 1992 ప్రపంచ కప్ విజేత కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ (73) జైలులో ఎదుర్కొంటున్న ఆరోగ్య పరిస్థితులపై ప్రపంచ క్రికెట్ దిగ్గజాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్‌కు మానవతా కోణంలో సరైన వైద్య సదుపాయాలు, మెరుగైన చికిత్స అందించాలని కోరుతూ 9 దేశాలకు చెందిన 21 మంది మాజీ అంతర్జాతీయ క్రికెట్ కెప్టెన్లు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు తాజాగా ఒక బహిరంగ లేఖ రాశారు.

ఈ విజ్ఞప్తి లేఖపై సంతకం చేసిన వారిలో భారత క్రికెట్ దిగ్గజాలు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, దిలీప్ వెంగ్‌సర్కార్‌లతో పాటు స్టీవ్ వా, గ్రెగ్ ఛాపెల్, అలెన్ బోర్డర్, అలెస్టైర్ కుక్, నాజర్ హుస్సేన్ వంటి ప్రముఖ క్రికెట్ దిగ్గజాలు ఉన్నారు. ఆరు నెలల క్రితం లేఖ: ఆరు నెలల క్రితం 14 మంది కెప్టెన్లు ఇమ్రాన్ ఆరోగ్యంపై మొదటిసారి లేఖ రాశారు. పరిస్థితిలో మార్పు రాకపోవడం, ఆయన కుడికంటి చూపు దాదాపు 85 శాతం మందగించిందన్న నివేదికల నేపథ్యంలో మరో ఏడుగురు దిగ్గజాలు జతకలవడంతో సంతకం చేసిన వారి సంఖ్య 21కి చేరింది.

తాము ఎటువంటి రాజకీయ కోణంలో ఈ లేఖ రాయలేదని, మైదానంలో కలిసి ఆడిన పాత సహచరుడిగా మానవతా దృక్పథంతో స్పందిస్తున్నామని మాజీ కెప్టెన్లు స్పష్టం చేశారు. పాక్ సుప్రీంకోర్టు ఆదేశించిన ప్రకారం క్రింది చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఇమ్రాన్ సొంత వైద్యులు, ఆయన సోదరి డాక్టర్ ఉజ్మా ఖాన్‌లతో కూడిన ప్రత్యేక మెడికల్ బోర్డు ద్వారా సంపూర్ణ వైద్య పరీక్షలు నిర్వహించాలి. ఎటువంటి ఆటంకాలు, పరిపాలనా జాప్యం లేకుండా ప్రతీ వారం కుటుంబ సభ్యులు ఆయనను కలిసేందుకు అనుమతించాలి. మెడికల్ బోర్డు సిఫార్సు చేసిన చికిత్సను వెంటనే అందించాలి.

కోర్టు ఆదేశించిన ప్రకారం పూర్తి స్థాయి హాస్పిటల్ పరీక్షలు జరగకుండానే కొన్ని గంటల్లోనే ఆయనను తిరిగి జైలుకు తరలించడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. క్రికెట్ చరిత్రలోనే ఒక దిగ్గజానికి అగ్రగామి ఆటగాళ్లంతా మద్దతుగా నిలవడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.



Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story