CSK Playoffs: సీఎస్‌కేకు ఇంకా ప్లేఆఫ్స్‌ ఛాన్స్‌లు.. సమీకరణాలు ఇవే!

CSK Playoffs: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే మూడు టీమ్స్ ప్లేఆఫ్స్‌ చేరగా.. రెండు జట్లు ఇంటిబాట పట్టాయి.

Rishvik
Published on: 19 May 2026 7:19 PM IST
CSK Playoffs
X

CSK Playoffs: సీఎస్‌కేకు ఇంకా ప్లేఆఫ్స్‌ ఛాన్స్‌లు.. సమీకరణాలు ఇవే!

CSK Playoffs: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే మూడు టీమ్స్ ప్లేఆఫ్స్‌ చేరగా.. రెండు జట్లు ఇంటిబాట పట్టాయి. నిన్నటివరకు ప్లేఆఫ్స్‌ రేసులో ముందంజలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే).. సోమవారం చెపాక్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌)పై ఓటమి అనంతరం పరిస్థితి పూర్తిగా మారింది.

విజయం మాత్రమే కాకుండా.. సీఎస్‌కే ప్లేఆఫ్స్ అవకాశాలు పూర్తిగా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడ్డాయి. ప్రస్తుతం చెన్నై 13 మ్యాచ్‌ల్లో 12 పాయింట్లతో ఉంది. ఇంకా ఒకే ఒక్క లీగ్ మ్యాచ్ మిగిలి ఉండటంతో గరిష్టంగా 14 పాయింట్ల వరకు మాత్రమే చేరుకునే అవకాశం ఉంది. అయితే 14 పాయింట్లు సాధించినా కూడా సీఎస్‌కే ప్లేఆఫ్స్‌కు చేరుతుందనే గ్యారంటీ లేదు.

సీఎస్‌కే ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే.. ముందుగా తమ చివరి లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై భారీ విజయం సాధించాల్సిందే. మే 21న నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో ఓడిపోతే చెన్నై అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. గెలిస్తే 14 పాయింట్లతో నిలిచి.. ఇతర జట్ల ఫలితాల కోసం ఎదురుచూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా నెట్ రన్‌రేట్ కీలకంగా మారే అవకాశం ఉంది. అందుకే సీఎస్‌కే గుజరాత్‌పై ఎంత భారీ తేడాతో గెలిస్తే అంత ప్లస్ అవుతుంది.

చెన్నై ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే పంజాబ్ కింగ్స్ తప్పక ఓడిపోవాలి. ప్రస్తుతం పంజాబ్ 13 పాయింట్లతో ఉంది. మే 23న లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే తమ చివరి మ్యాచ్‌లో పంజాబ్ ఓడిపోతే.. 13 పాయింట్లకే పరిమితమవుతుంది. ఆ ఓటమి సీఎస్‌కేకు భారీ ఊరట అవుతుంది. అదే పంజాబ్ గెలిస్తే 15 పాయింట్లకు చేరుకుంటుంది. అప్పుడు చెన్నై ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. ఇక రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఫలితాలు కూడా సీఎస్‌కే భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.

ప్రస్తుతం రాజస్థాన్ 12 పాయింట్లతో ఉండగా.. ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. రెండు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచినా 14 పాయింట్లకు చేరుతుంది. రెండు గెలిస్తే 16 పాయింట్లతో నేరుగా ప్లేఆఫ్స్‌కు వెళ్తుంది. కోల్‌కతా ప్రస్తుతం 11 పాయింట్లతో ఉంది. ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. కేకేఆర్ 15 పాయింట్లకు చేరుకుంటే.. సీఎస్‌కేకు తలుపులు మూసుకుపోతాయి. ఒకవేళ పలు జట్లు 14 పాయింట్లతో సమానంగా నిలిస్తే.. నెట్ రన్‌రేట్ ఆధారంగా ప్లేఆఫ్స్ బెర్త్ నిర్ణయించబడుతుంది.

లక్నో, హైదరాబాద్ చేతిలో వరుస ఓటముల కారణంగా సీఎస్‌కే నెట్ రన్‌రేట్ దెబ్బతింది. కాబట్టి గుజరాత్‌పై భారీ విజయం సాధించడమే కాకుండా.. పోటీ జట్లు భారీ తేడాలతో ఓడిపోవాలని కూడా చెన్నై అభిమానులు కోరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ప్లేఆఫ్స్ రేసులో సీఎస్‌కేకు అవకాశం ఉన్నప్పటికీ.. అది పూర్తిగా ఇతర జట్ల ఫలితాలపైనే ఆధారపడి ఉంది. బెంగళూరు, గుజరాత్, హైదరాబాద్ ప్లేఆఫ్స్ చేరుకున్న విషయం తెలిసిందే.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story