IPL 2026 CSK: సీఎస్‌కేకు బిగ్ షాక్.. ఐపీఎల్ 2026 నుంచి మ్యాచ్ విన్నర్ అవుట్!

IPL 2026 CSK: ఐపీఎల్‌ 2026 సీజన్‌లో ప్లే ఆఫ్స్ కోసం పోరాడుతున్న సీఎస్‌కేకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ ఆయుష్ మాత్రే గాయంతో మిగిలిన టోర్నీకి దూరమయ్యాడు.

Rishvik
Published on: 21 April 2026 6:19 PM IST
IPL 2026 CSK
X

IPL 2026 CSK: సీఎస్‌కేకు బిగ్ షాక్.. ఐపీఎల్ 2026 నుంచి మ్యాచ్ విన్నర్ అవుట్!

IPL 2026 CSK: ఐపీఎల్‌ 2026 సీజన్‌లో ప్లే ఆఫ్స్ కోసం పోరాడుతున్న చెన్నై సూపర్ కింగ్స్‌ (సీఎస్‌కే)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ ఆయుష్ మాత్రే గాయంతో మిగిలిన టోర్నీకి దూరమయ్యాడు.

ఈ విషయాన్ని సీఎస్‌కే మేనేజ్‌మెంట్ ఎక్స్ వేదికగా అధికారికంగా ప్రకటించింది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మాత్రేకు 6 నుంచి 12 వారాల పాటు విశ్రాంతి అవసరమని, దీంతో ఈ సీజన్ మొత్తం అతడు ఆడలేడని స్పష్టం చేసింది. మాత్రే త్వరగా కోలుకోవాలని సీఎస్‌కే మేనేజ్‌మెంట్ ఆకాంక్షించింది.

ఏప్రిల్ 18న సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తూ ఆయుష్ మాత్రే గాయానికి గురయ్యాడు. రెండో సింగిల్‌ తీసే క్రమంలో అతడి ఎడమ కాలి కండరాలు పట్టేశాయి. సీఎస్‌కే ఫిజియో వచ్చి చికిత్స చేశాక బ్యాటింగ్ కొనసాగించాడు. అయితే తర్వాత బంతికే క్యాచ్ అవుట్ అయి పెవిలియన్ చేరాడు.

మాత్రే స్థానంలో మరో యువ ఆటగాడు ఉర్విల్ పటేల్ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. యువ ఆటగాడైన ఉర్విల్ పటేల్‌కు ఇది మంచి అవకాశం అనే చెప్పాలి. ఉర్విల్ దూకుడైన బ్యాటింగ్‌కు ప్రసిద్ధి చెందాడు. కేవలం 28 బంతుల్లో శతకం సాధించిన భారత ఆటగాడిగా రికార్డు కూడా కలిగి ఉన్నాడు.

18 ఏళ్ల యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే ఈ సీజన్‌లో సీఎస్‌కేకు కీలక ఆటగాడిగా నిలిచాడు. గత ఏడాది రీప్లేస్‌మెంట్ ప్లేయర్‌గా వచ్చిన మాత్రే.. ఈ ఏడాది అంచనాలకు మించి రాణించాడు. ఐపీఎల్‌ 2026లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన మాత్రే 201 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్‌రేట్ 177.88గా ఉండటం విశేషం. రెండు హాఫ్ సెంచరీలు సాధించిన అతడు సీఎస్‌కేకు మంచి ఆరంభాలు అందించాడు.

ప్రస్తుతం సీజన్‌లో టాప్ రన్ స్కోరర్లలో కూడా అతడు ఒకరిగా నిలిచాడు. అంతేకాకుండా ఈ ఏడాది జరిగిన అండర్-19 వరల్డ్ కప్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. మాత్రే గాయం సీఎస్‌కేకు పెద్ద దెబ్బే. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే జట్టు త్వరగా సరైన ప్రత్యామ్నాయం కనుగొని తిరిగి విజయాల బాట పట్టాల్సిన అవసరం ఉంది.

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో సీఎస్‌కే పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన చెన్నై.. రెండు విజయాలు మాత్రమే అందుకుంది. పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉన్న సీఎస్‌కే ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంటోంది.

ఇప్పటికే లీగ్ దశలో సగం మ్యాచ్‌లు పూర్తయిన నేపథ్యంలో ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఇకపై ప్రతి మ్యాచ్ గెలవాల్సిందే. మరో 2 మ్యాచులు ఓడితే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకోవాల్సిందే. ఏప్రిల్ 23న వాంఖడేలో ముంబై ఇండియన్స్, చెన్నై తలపడనున్నాయి. ఈ మ్యాచుల్లో గెలవడం సీఎస్‌కేకు తప్పనిసరి.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story