IPL 2026 : ఆకాశమే హద్దుగా సెంచరీతో చెలరేగిన సంజూ శాంసన్.. ఢిల్లీపై సిఎస్‌కె ఘనవిజయం
IPL 2026 : ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ మొదటి విజయం సాధించింది. సంజు శామ్సన్ అద్భుత సెంచరీతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 23 పరుగుల తేడాతో గెలిచింది. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో ఎట్టకేలకు బోణీ కొట్టింది.
IPL 2026
IPL 2026 : ఐపీఎల్ 2026లో ఎట్టకేలకు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానుల నిరీక్షణ ఫలించింది. వరుస ఓటములతో సతమతమవుతున్న చెన్నై, ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘనవిజయం సాధించి ఈ సీజన్‌లో బోణీ కొట్టింది. చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఈ ఉత్కంఠ పోరులో ఢిల్లీని 23 పరుగుల తేడాతో చిత్తు చేసి, పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది. కెప్టెన్‌గా వరుసగా 7 ఓటముల తర్వాత రుతురాజ్ గైక్వాడ్ అందుకున్న ఈ విజయం అతనికి ఎంతో ఊరటనిచ్చింది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 212 పరుగుల భారీ స్కోరు సాధించింది. చెన్నై ఇన్నింగ్స్‌లో ప్రధాన ఆకర్షణ సంజు శాంసన్. ఢిల్లీ బౌలర్లను చీల్చిచెండాడుతూ 115 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో నమోదైన మొట్టమొదటి సెంచరీ ఇదే కావడం విశేషం. యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే (59) అతనికి మంచి సహకారం అందించాడు. అయితే ఆయుష్‌ను రిటైర్డ్ అవుట్‌గా వెనక్కి పిలిపించి శివమ్ దూబే (20)ను పంపడం అందరినీ ఆశ్చర్యపరిచింది. చివరికి చెన్నై భారీ లక్ష్యాన్ని ఢిల్లీ ముందు ఉంచింది.
213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆరంభంలో ఊపు చూపించింది. ఓపెనర్లు పతుమ్ నిస్సాంక (41), కెఎల్ రాహుల్ కలిసి కేవలం 5 ఓవర్లలోనే 61 పరుగులు జోడించి చెన్నైని ఒత్తిడిలోకి నెట్టారు. నిస్సాంక కేవలం 24 బంతుల్లోనే విధ్వంసం సృష్టించాడు. ఒక దశలో ఢిల్లీ విజయం సులభం అనిపించింది. కానీ, చెన్నై ఫాస్ట్ బౌలర్లు ఒక్కసారిగా విజృంభించడంతో ఢిల్లీ కథ అడ్డం తిరిగింది. కేవలం 15 పరుగుల వ్యవధిలోనే ఢిల్లీ 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
మధ్యలో ట్రిస్టన్ స్టబ్స్ (60) తన అద్భుత హాఫ్ సెంచరీతో ఢిల్లీ ఆశలను సజీవంగా ఉంచాడు. 38 బంతుల్లో అతను చేసిన పోరాటం చెన్నై క్యాంప్‌లో గుబులు పుట్టించింది. అయితే కీలక సమయంలో జేమీ ఓవర్టన్ బౌలింగ్‌లో స్టబ్స్ అవుట్ కావడంతో ఢిల్లీ ఆశలు ఆవిరయ్యాయి. డేవిడ్ మిల్లర్ (17), అశుతోష్ శర్మ (19) విఫలం కావడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 189 పరుగులకు పరిమితమైంది. దీంతో చెన్నై 23 పరుగుల తేడాతో విజేతగా నిలిచింది.
చెన్నై బౌలర్లలో జేమీ ఓవర్టన్ 4 వికెట్లతో అదరగొట్టగా, అన్షుల్ కంబోజ్ 3 వికెట్లు పడగొట్టి ఢిల్లీ నడ్డి విరిచారు. వరుసగా ఏడు మ్యాచ్‌ల ఓటమి తర్వాత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు ఇది తీపి జ్ఞాపకం. ఈ సీజన్‌లో వరుసగా రాజస్థాన్, పంజాబ్, బెంగళూరు చేతుల్లో ఓడిపోయిన చెన్నైకి, ఈ రెండు పాయింట్లు పట్టికలో ఎంతో కీలకం కానున్నాయి. ఈ విజయంతో చెన్నై మళ్ళీ ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపిస్తోంది.




