IPL 2027: హార్దిక్ పాండ్యా ట్రేడింగ్‌పై సీఎస్కే సంచలన నిర్ణయం.. అదేంటంటే?
IPL 2027 Trades: ఐపీఎల్ 2026 సీజన్ ముగిసినప్పటి నుంచి ఆటగాళ్ల బదిలీల (ట్రేడింగ్) గురించిన చర్చలు ఊపందుకున్నాయి.
IPL 2027: హార్దిక్ పాండ్యా ట్రేడింగ్‌పై సీఎస్కే సంచలన నిర్ణయం.. అదేంటంటే?
Hardik Pandya CSK Trade: ఐపీఎల్ తదుపరి సీజన్ ముంగిట క్రికెట్ ప్రపంచంలో ట్రేడింగ్ రూమర్లు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా పసుపు జెండా పట్టుకోబోతున్నాడంటూ వస్తున్న వార్తలపై చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఎట్టకేలకు మౌనం వీడింది. ఈ మెగా ట్రేడ్‌పై చెన్నై యాజమాన్యం తీసుకున్న తుది నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ రూమర్స్.. అసలు ఏం జరుగుతోంది?
ఐపీఎల్ 2026 సీజన్ ముగిసినప్పటి నుంచి ఆటగాళ్ల బదిలీల (ట్రేడింగ్) గురించిన చర్చలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌ను వీడనున్నాడనే వార్త క్రికెట్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. మహేంద్ర సింగ్ ధోనీ వ్యూహాలతో హార్దిక్ చెన్నై సూపర్ కింగ్స్ గూటికి చేరుకుంటాడని, ఇరు జట్ల మధ్య భారీ డీల్ కుదిరిందనే ఊహాగానాలు జోరుగా సాగావు. అయితే, తాజా పరిణామాల ప్రకారం ఈ కథనాల్లో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది.
క్లారిటీ ఇచ్చిన సీఎస్కే యాజమాన్యం.. మాకు ఆ ఆలోచనే లేదు!
ఈ ట్రేడింగ్ వివాదంపై చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీకి చెందిన ఒక కీలక ప్రతినిధి క్రిక్‌బజ్ ప్రతినిధితో మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు. హార్దిక్ పాండ్యాను జట్టులోకి తీసుకోవడానికి తాము ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని స్పష్టం చేశారు. "మాకు ఇతర ఫ్రాంచైజీల నుంచి కొన్ని ట్రేడింగ్ ప్రతిపాదనలు వచ్చిన మాట వాస్తవమే, కానీ అందులో హార్దిక్ పాండ్యాకు సంబంధించిన ప్రస్తావన ఎక్కడా లేదు. ప్రస్తుతానికైతే మా జట్టులోని ఏ ఒక్క ఆటగాడిని వేరే జట్టుకు వదులుకోవడానికి సీఎస్కే సిద్ధంగా లేదు" అని ఆయన కుండబద్దలు కొట్టారు. దీంతో హార్దిక్-సీఎస్కే బంధానికి పూర్తిగా తెరపడినట్లయింది.
రాజస్థాన్ రాయల్స్ రేసులోకి వచ్చిందా? జైస్వాల్‌తో మార్పిడి?
చెన్నై తప్పుకోవడంతో ఇప్పుడు ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య సరికొత్త సమీకరణాలు తెరపైకి వచ్చాయి. రాజస్థాన్ రాయల్స్ తమ స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను ముంబైకి ఇచ్చి, బదులుగా హార్దిక్ పాండ్యాను జట్టులోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోందనే ప్రచారం ఊపందుకుంది. పింక్ వర్సెస్ బ్లూ జట్ల మధ్య ఈ భారీ ట్రేడ్ నిజంగానే జరిగితే రాబోయే సీజన్‌లో ఐపీఎల్ సమీకరణాలు పూర్తిగా మారిపోవడం ఖాయం.
ఖలీల్ అహ్మద్, డేవిడ్ మిల్లర్ ట్రేడ్‌పైనా ఫ్రాంచైజీల స్పష్టత..
హార్దిక్ పాండ్యా విషయమే కాకుండా, ఢిల్లీ క్యాపిటల్స్ ఫినిషర్ డేవిడ్ మిల్లర్, చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ ఖలీల్ అహ్మద్‌ల మధ్య కూడా ఆటగాళ్ల మార్పిడి జరగనుందనే వార్తలు వచ్చాయి. గత రెండు సీజన్లలో సీఎస్కే తరఫున 17 వికెట్లతో రాణించిన ఖలీల్ అహ్మద్‌ను వదులుకోవడానికి చెన్నై ఏమాత్రం ఇష్టపడటం లేదు. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ సైతం తమ 'కిల్లర్ మిల్లర్'ను వదులుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. దీంతో ఈ రెండు ఫ్రాంచైజీలు కూడా ట్రేడింగ్ వార్తలను పూర్తిగా ఖండించాయి.
సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఐపీఎల్ ట్రేడింగ్ మార్కెట్‌లో రూమర్లు రావడం సహజమే అయినా, సీఎస్కే ఇచ్చిన అధికారిక స్పష్టతతో అభిమానులకు ఒక క్లారిటీ వచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్టార్ల వెంట పడకుండా, 2026 సీజన్ నాటి తమ కోర్ టీమ్‌ను నమ్ముకుని యువ ఆటగాళ్లతోనే ఐపీఎల్ 2027 బరిలోకి దిగాలని నిశ్చయించుకుంది. మరి రాబోయే రోజుల్లో ముంబై, రాజస్థాన్ జట్ల మధ్య ఎలాంటి డ్రామా నడుస్తుందో చూడాలి.




