సీఎస్‌కే కోచ్ రేసులో ఆ భారత మాజీ క్రికెటర్.. అప్పుడు జట్టులో నో ప్లేస్, ఇప్పుడు ఏకంగా హెడ్ కోచ్!
Hemang Badani Likely to replace Stephen Fleming. భారత మాజీ క్రికెటర్ హేమంగ్ బదానీ పేరు సీఎస్‌కే కొత్త హెడ్ కోచ్ రేసులో వినిపిస్తోంది.
సీఎస్‌కే కోచ్ రేసులో ఆ భారత మాజీ క్రికెటర్.. అప్పుడు జట్టులో నో ప్లేస్, ఇప్పుడు ఏకంగా హెడ్ కోచ్!
Hemang Badani: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) హెడ్ కోచ్ పదవి నుంచి న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ వైదొలిగిన విషయం తెలిసిందే. పరస్పర అంగీకారంతోనే తాము విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు సీఎస్‌కే ఫ్రాంచైజీ ఈరోజు అధికారికంగా తెలిపింది. ఫ్లెమింగ్ వైదొలగడంతో ఐపీఎల్ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. సీఎస్‌కే కొత్త హెడ్ కోచ్‌గా ఎవరిని నియమిస్తారనే ఆసక్తి అబినయుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, ప్రస్తుత ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ హేమంగ్ బదానీ పేరు బలంగా వినిపిస్తోంది.
సీఎస్‌కే యాజమాన్యం అమెరికాలోని డల్లాస్‌లో సమావేశమై గత మూడు సీజన్ల ప్రదర్శనపై సమీక్ష నిర్వహిస్తున్నట్లు ఓ జాతీయ మీడియా తన కథనంలో పేర్కొంది. వరుసగా మూడు సీజన్లుగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోవడంతో జట్టు భవిష్యత్ ప్రణాళికలపై లోతుగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. స్టీఫెన్ ఫ్లెమింగ్ స్థానంలో కొత్త కోచ్ ఎంపికతో పాటు మొత్తం కోచింగ్ స్టాఫ్‌లోనూ మార్పులు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ కీలక నిర్ణయాల్లో సీఎస్‌కే క్రికెట్ లిమిటెడ్ డైరెక్టర్ రూపా గురునాథ్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. జట్టు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కొత్త కోచింగ్ వ్యవస్థను రూపొందించే దిశగా యాజమాన్యం ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
హేమంగ్ బదాని 2000 నుంచి 2004 మధ్య కాలంలో టీమిండియా తరఫున ఆడాడు. 4 టెస్టులు, 40 వన్డేలలో 961 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు హెడ్ కోచ్‌గా పనిచేశాడు. సుదీర్ఘకాలం సీఎస్‌కేకు కోచ్‌గా ఉన్న స్టీఫెన్ ఫ్లెమింగ్ ఆ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో.. బదాని ఆ జట్టుకు హెడ్ కోచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బదానీకి చెన్నై జట్టు కొత్తేమీ కాదు. 2010 సీజన్ సమయంలో బదానీని సీఎస్‌కే ఆటగాడిగా తీసుకుంది. అయితే ఆ సీజన్‌లో ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం రాలేదు. అయితే అదృష్టం కలిసొచ్చి ఇప్పుడు అదే జట్టుకు ఏకంగా హెడ్ కోచ్ అయ్యే సువర్ణావకాశం బదాని తలుపు తట్టింది.
స్టీఫెన్ ఫ్లెమింగ్ తన వీడ్కోలు సందర్భంగా భావోద్వేగంగా స్పందించాడు. 'క్రీడల్లో 18 ఏళ్లు అంటే ఒక జీవితకాలం లాంటిది. సీఎస్‌కేతో గడిపిన సమయం నా కోచింగ్ కెరీర్‌లో అత్యంత గొప్ప అనుభవం. ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించా. ఆ జ్ఞాపకాలు జీవితాంతం నాతో ఉంటాయి. సీఎస్‌కే ఎప్పటికీ నా హృదయానికి దగ్గరగానే ఉంటుంది. ఇకపై కూడా అభిమానిగా జట్టుకు మద్దతు ఇస్తూనే ఉంటాను' అని ఫ్లెమింగ్ పేర్కొన్నాడు. 2008లో ఐపీఎల్ తొలి సీజన్‌లో ఆటగాడిగా సీఎస్‌కేలో చేరిన ఫ్లెమింగ్.. 2009 నుంచి హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టాడు. ఎంఎస్ ధోనీతో కలిసి ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కోచ్-కెప్టెన్ జోడీగా గుర్తింపు పొందాడు. అతడి కోచింగ్‌లో చెన్నై ఐదు ఐపీఎల్ టైటిళ్లు, రెండు ఛాంపియన్స్ లీగ్ టీ20 ట్రోఫీలు గెలుచుకుంది. అలాగే రికార్డు స్థాయిలో 12 సార్లు ప్లేఆఫ్స్‌కు, 10 సార్లు ఫైనల్స్‌కు చేరుకుంది.




