CSK Playoffs Scenarios: ప్లేఆఫ్స్ రేసు రసవత్తరం.. సీఎస్‌కేకు ఇంకా ఛాన్సెస్, సమీకరణాలు ఇవే!
CSK Playoff Chances in IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. చెన్నై సూపర్ కింగ్స్ కూడా ప్లేఆఫ్స్ పోరులో నిలిచింది.
CSK Playoffs Scenarios: ప్లేఆఫ్స్ రేసు రసవత్తరం.. సీఎస్‌కేకు ఇంకా ఛాన్సెస్, సమీకరణాలు ఇవే!
CSK Playoffs Scenarios: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. 10 జట్ల గెలుపు, ఓటములతో ప్లేఆఫ్స్ రేసు రోజు రోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) కూడా ప్లేఆఫ్స్ పోరులో నిలిచింది. ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన సీఎస్‌కే.. ఐదు విజయాలు, ఐదు ఓటములతో 10 పాయింట్లు సాధించి పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఓ దశలో ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నట్లే అనిపించినా.. హ్యాట్రిక్ విజయాలతో సీఎస్‌కే రేసులోకి వచ్చింది. సీఎస్‌కేకు ప్లేఆఫ్స్ ఛాన్సెస్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
లీగ్ దశలో ఇక మిగిలిన నాలుగు మ్యాచ్‌లు చెన్నైకి అత్యంత కీలకంగా మారాయి. ఈ నాలుగు మ్యాచ్‌ల ఫలితాలపైనే సీఎస్‌కే ప్లేఆఫ్స్ భవితవ్యము ఆధారపడి ఉంది. ముఖ్యంగా టాప్-4లో నిలవాలంటే ప్రతి మ్యాచ్ కూడా కీలకంగా మారనుంది. చెన్నై తమ మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధిస్తే.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. 18 పాయింట్లతో నేరుగా ప్లేఆఫ్స్ చేరడమే కాకుండా.. టాప్-2లో నిలిచే అవకాశాలు కూడా ఉంటాయి. టాప్-2లో నిలిస్తే క్వాలిఫయర్-1 ఆడే అవకాశం దక్కుతుంది. అక్కడ గెలిస్తే నేరుగా ఫైనల్‌కు వెళ్లొచ్చు. ఒకవేళ ఓడినా క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం ఉండటంతో.. టాప్-2 స్థానానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది.
సీఎస్‌కే మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు మాత్రమే గెలిస్తే పరిస్థితి క్లిష్టంగా మారుతుంది. అప్పుడు చెన్నై పట్టికను 16 పాయింట్లతో ముగించే అవకాశం ఉంది. ఈ పరిస్థితిలో నెట్ రన్‌రేట్ కీలకంగా మారనుంది. అందుకే మిగిలిన మ్యాచ్‌ల్లో భారీ విజయాలు నమోదు చేయడం సీఎస్‌కేకు చాలా అవసరం. మరోవైపు నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం రెండు విజయాలు మాత్రమే సాధిస్తే.. సీఎస్‌కే ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు ముగిసినట్టే. 14 పాయింట్లతో ప్లేఆఫ్స్ చేరడం ఈసారి చాలా కష్టం. ఇతర జట్ల ఫలితాలు పూర్తిగా అనుకూలించినా అవకాశాలు తక్కువ.నాలుగు లేదా మూడు విజయాలు సీఎస్‌కేకు తప్పనిసరి.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 14 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స్ 13 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. 12 పాయింట్లతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు కూడా ప్లేఆఫ్స్ రేసులో గట్టిగానే పోటీపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సీఎస్‌కేకు ప్రతి మ్యాచ్ ‘డూ ఆర్ డై’గా మారింది. అభిమానులు మాత్రం ఎంఎస్ ధోనీ జట్టు మళ్లీ పుంజుకుని ప్లేఆఫ్స్ చేరుతుందని ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు. చూడాలి మరి మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో సీఎస్‌కే ఎలా ఆడుతుందో.




