CSK: చెన్నై సూపర్ కింగ్స్‌కు బిగ్ షాక్.. టాప్ స్కోరర్ అవుట్, మరిన్ని కష్టాలు తప్పవా?
CSK: ఐపీఎల్ 2026లో వెనకపడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ కు బిగ్ షాక్ తగిలింది. యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే గాయంతో సీఎస్‌కే జట్టుకు దూరం కానున్నట్టు తెలుస్తోంది.
CSK: చెన్నై సూపర్ కింగ్స్‌కు బిగ్ షాక్.. టాప్ స్కోరర్ అవుట్, మరిన్ని కష్టాలు తప్పవా?
CSK: ఐపీఎల్ 2026లో వెనకపడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)కు బిగ్ షాక్ తగిలింది. యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే గాయంతో సీఎస్‌కే జట్టుకు దూరం కానున్నట్టు తెలుస్తోంది. ఎడమ కాలి హామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా దాదాపు మూడు వారాలు జట్టుకు దూరమయ్యే అవకాశముందని సమాచారం. ఈ విషయంపై సీఎస్‌కే మేనేజ్‌మెంట్ నుంచి అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. శనివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచులో ఆయుష్ గాయంతో ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్‌తో మ్యాచులో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన ఆయుష్ మాత్రే కేవలం 12 బంతుల్లో 30 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. డబుల్ కోసం పరిగెత్తే సమయంలో అసౌకర్యానికి గురయ్యాడు. వెంటనే ఫిజియో మైదానంలోకి వచ్చి చికిత్స అందించారు. గాయం తీవ్రత స్పష్టంగా కనిపించినప్పటికీ.. మాత్రే బ్యాటింగ్ కొనసాగించడం గమనార్హం. అయితే తర్వాతి బంతికే అతడు ఔటై పెవిలియన్ చేరాడు.
అంతకుముందే మాత్రే కాలుకు పట్టీ వేసుకుని ఉన్నాడు. అయినా కూడా బ్యాటింగ్‌కు దిగాడు. ప్రస్తుతం చెన్నైలో ఫామ్‌లో ఉన్న బ్యాటర్ మాత్రేనే. ఇప్పటికే చెన్నై నాలుగు ఓటములతో పట్టికలో వెనకంజలో ఉన్నాడు. ఇప్పుడు మాత్రే కూడా దూరమవుతుండడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రిపోర్టుల ప్రకారం.. 18 ఏళ్ల ఆయుష్ మాత్రే మూడు వారాలు దూరంగా ఉండే అవకాశం ఉంది. అయితే గాయం మొదట అనుకున్నంత తీవ్రంగా లేదని తెలుస్తోంది. చెన్నై జట్టు సోమవారం ముంబై చేరుకోనుండగా.. అక్కడ అతడికి స్కాన్లు నిర్వహించనున్నారు. ఆ పరీక్షల అనంతరం గాయం తీవ్రత స్థాయి పూర్తిగా వెల్లడవుతుంది. ప్రస్తుతం అతడు నొప్పి లేకుండా నడవగలుగుతున్నాడని సమాచారం. టోర్నమెంట్ చివరి దశలో తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెన్నై వర్గాలు అంటున్నాయి.
మ్యాచ్ అనంతరం సీఎస్‌కే బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ స్పందిస్తూ.. ఆయుష్ మాత్రేకు హామ్‌స్ట్రింగ్ టియర్ అయ్యిందని ధృవీకరించాడు. గాయం ఎంత తీవ్రంగా ఉందో స్కాన్ల తర్వాతే తెలుస్తుందని తెలిపాడు. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న గాయపడటం జట్టుకు పెద్ద లోటు అని హస్సీ అభిప్రాయపడ్డాడు. ఇక సీఎస్‌కే తదుపరి మ్యాచ్‌లో ముంబైని ఎదుర్కొననుంది. చెన్నై ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచుల్లో 2 గెలిచి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది.




