CWG 2026 : కామన్వెల్త్ గేమ్స్‎లో దుమ్మురేపుతున్న భారత్.. ఒకేరోజు 6 మెడల్స్, ఫైనల్ కు ఏకంగా 10 మంది బాక్సర్లు

CWG 2026 : కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ అదరగొడుతోంది. 9వ రోజున జూడో, అథ్లెటిక్స్ విభాగాల్లో 6 పతకాలు సాధించి మెడల్స్ సంఖ్యను 23కు చేర్చింది.

CR Reddy
Published on: 1 Aug 2026 8:26 AM IST
CWG 2026
X

CWG 2026

CWG 2026 : గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. పతకాల వేటలో జోరు పెంచుతూ ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నారు. టోర్నీలో శుక్రవారం (జూలై 31) భారతదేశానికి అత్యంత సక్సెస్ ఫుల్ రోజుగా నిలిచింది. ఒకేరోజు భారత ఖాతాలో ఏకంగా 2 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్య పతకాలతో కలిపి మొత్తం 6 మెడల్స్ వచ్చి చేరాయి. జూడో, ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెటిక్స్ విభాగాల్లో మన క్రీడాకారులు అద్భుత ప్రదర్శన కనబరిచారు. దీంతో ప్రస్తుతం భారత్ సాధించిన మొత్తం పతకాల సంఖ్య 23కు చేరింది. ఇందులో 5 స్వర్ణాలు, 12 రజతాలు, 6 కాంస్య పతకాలు ఉన్నాయి. ప్రస్తుతం భారత్ ఓవరాల్ పాయింట్ల పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతోంది.

నీరజ్ చోప్రా నిరాశ.. ఆశ్చర్యపరిచిన యశ్‌వీర్ సింగ్

భారత స్టార్ అథ్లెట్, గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా ఈసారి కామన్వెల్త్ గేమ్స్‌లో అభిమానులను కాస్త నిరాశపరిచాడు. మెన్స్ జావెలిన్ త్రో ఈవెంట్‌లో కచ్చితంగా స్వర్ణం సాధిస్తాడని అందరూ ఆశించినప్పటికీ, 85.83 మీటర్ల దూరంతో అతను రజత పతకానికే పరిమితమయ్యాడు. అయితే అదే జావెలిన్ త్రో ఈవెంట్‌లో యశ్‌వీర్ సింగ్ 85.41 మీటర్ల మేర బల్లాన్ని విసిరి కాంస్య పతకం గెలుచుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇది యశ్‌వీర్ కెరీర్‌లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ కావడం విశేషం. మరోవైపు డెకాథ్లాన్ విభాగంలో తేజస్విన్ శంకర్ చారిత్రాత్మక కాంస్య పతకం సాధించాడు. డెకాథ్లాన్‌లో మెడల్ గెలిచిన తొలి భారతీయుడిగా తేజస్విన్ రికార్డు సృష్టించాడు.

జూడోలో అస్మితా డే స్వర్ణం

తొమ్మిదో రోజు పతకాల వేటలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది జూడో. మహిళల 48 కిలోల విభాగంలో అస్మితా డే అద్భుత ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకం గెలుచుకుంది. కామన్వెల్త్ గేమ్స్ జూడో ఈవెంట్‌లో భారతదేశానికి ఇదే తొలి స్వర్ణ పతకం కావడం విశేషం. అదేవిధంగా పురుషుల 60 కిలోల విభాగంలో హర్ష్ సింగ్ 10-0 తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసి గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నాడు. మహిళల 57 కిలోల విభాగంలో యామినీ మౌర్య రజత పతకంతో సత్తా చాటింది. ఈ విధంగా జూడో విభాగంలో భారతీయులు ఒక రేంజ్‌లో మెరిశారు.

బాక్సింగ్‌లో దబైదిబాంగ్.. 10 మంది ఫైనల్‌కు

ఒకవైపు అథ్లెటిక్స్, జూడోలో పతకాలు సాధిస్తున్న భారత్‌కు బాక్సింగ్ రింగ్ నుంచి అదిరిపోయే శుభవార్త అందింది. బాక్సింగ్ విభాగంలో ఏకంగా 10 మంది భారత సెమీఫైనలిస్టులు తమ తమ బౌట్‌లలో అద్భుత విజయాలు సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లారు. దీంతో భారత్‌కు బాక్సింగ్ లోనే కనీసం 10 రజత పతకాలు ఖాయమయ్యాయి. ఫైనల్స్ లో వీరు కూడా మెరిస్తే భారత్ ఖాతాలో మరిన్ని స్వర్ణ పతకాలు చేరడం పక్కా. రాబోయే రోజుల్లో పాయింట్ల పట్టికలో భారత్ తన ర్యాంక్‌ను మరింత మెరుగుపరుచుకునే అవకాశం ఉంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story