CWG 2026: ఆరోగ్యం సహకరించలేదు.. లేదంటే స్వర్ణం సాధించేవాడినే.. భారత స్టార్ అథ్లెట్ భావోద్వేగం!

CWG 2026: Selva Prabhu Says Food Poisoning Cost Him Commonwealth Games Gold. తనకు గోల్డ్ మెడల్ దక్కకుండా ఫుడ్ పాయిజనింగ్ అడ్డుపడిందని ట్రిపుల్ జంపర్ సెల్వ ప్రభు ఆవేదన వ్యక్తం చేశాడు.

Rishvik
Published on: 3 Aug 2026 7:44 PM IST
CWG 2026
X

CWG 2026: ఆరోగ్యం సహకరించలేదు.. లేదంటే స్వర్ణం సాధించేవాడినే.. భారత స్టార్ అథ్లెట్ భావోద్వేగం!

CWG 2026: గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌ 2026 ట్రిపుల్ జంప్‌లో భారత్‌కు రెండు పతకాలు వచ్చాయి. తమిళనాడు అథ్లెట్లు ప్రవీణ్‌ చిత్రావెల్ రజతం సాధించగా.. సెల్వ ప్రభు కాంస్యం సొంతం చేసుకున్నారు. ప్రవీణ్‌తో పోలిస్తే.. ప్రభు పతకం సాధించడం వెనుకున్న స్టోరీ చాలా భిన్నమైంది. కామన్వెల్త్ గేమ్స్‌కు వారం రోజుల ముందే ప్రభును ఫుడ్ పాయిజనింగ్‌, డయేరియా ఇబ్బంది పెట్టింది. అయినా పోడియంపై పతకం అందుకోవడం కోసం ఎంతో శ్రమించాడు. పురుషుల ట్రిపుల్ జంప్ ఫైనల్లో 16.52 మీటర్ల దూరం దూకి మూడో స్థానంలో నిలిచిన సెల్వ.. స్వల్ప తేడాతో స్వర్ణ పతకాన్ని చేజార్చుకున్నాడు. భారత అథ్లెట్ ప్రవీణ్ (16.58 మీటర్లు) రజత పతకం సాధించగా.. స్కాట్లాండ్‌కు చెందిన జోర్డాన్ స్కాట్ (16.72 మీటర్లు) స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.

తనకు గోల్డ్ మెడల్ దక్కకుండా ఫుడ్ పాయిజనింగ్ అడ్డుపడిందని ట్రిపుల్ జంపర్ సెల్వ ప్రభు ఆవేదన వ్యక్తం చేశాడు. స్వదేశానికి తిరిగి వచ్చిన అనంతరం ప్రభు మీడియాతో మాట్లాడుతూ.. 'పోటీ ప్రారంభానికి ముందే ఫుడ్ పాయిజనింగ్‌కు గురవడంతో నా ప్రదర్శనపై తీవ్ర ప్రభావం పడింది. నాకు గోల్డ్ మెడల్ గెలవాలనే బలమైన కోరిక ఉంది. కానీ పోటీకి ముందే అనారోగ్యం, ఫుడ్ పాయిజనింగ్ రావడంతో పరిస్థితి మారిపోయింది. అయినప్పటికీ మానసికంగా ధైర్యంగా ఉండి చివరి వరకు పోరాడాలని నిర్ణయించుకున్నాను. ఎంత కష్టమైనా నా శక్తిమేర ప్రయత్నించాను' అని భావోద్వేగం చెందాడు.

సెల్వ ప్రభు వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన 17.05 మీటర్లు. ఆరోగ్యంగా ఉంటే ఆ స్థాయికి దగ్గరగా దూకి ఉంటే స్వర్ణ పతకం సులభంగా గెలిచేవాడినని సెల్వ ప్రభు పేర్కొన్నాడు. 'నేను ఆరోగ్యంగా ఉండి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. కానీ జీవితంలో మరో అవకాశం తప్పకుండా వస్తుంది. నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను. నా స్థిరమైన ప్రదర్శనపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇకపై నా అప్రోచ్‌పై మరింత దృష్టి పెట్టి మెరుగుపడతాను' అని తెలిపాడు. రాబోయే ఆసియా క్రీడలపై స్పందించిన ప్రభు.. ప్రస్తుతం తన దృష్టి ముందుగా అర్హత సాధించడంపైనే ఉందని చెప్పాడు. 'నేను ఒక్కో రోజును ఒక్కో సవాలుగా చూస్తాను. ముందుగానే గోల్డ్ గురించే ఆలోచించను. ముందుగా ఆసియా క్రీడలకు అర్హత సాధించాలి. ఆ తర్వాతే తదుపరి లక్ష్యాల గురించి ఆలోచిస్తాను' అని వివరించాడు.

ఇటీవల జరిగిన జాతీయ ఇంటర్-స్టేట్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో సెల్వ ప్రభు 16.79 మీటర్ల జంప్‌తో మూడో స్థానంలో నిలిచాడు. ఆసియా క్రీడల అర్హత ప్రమాణమైన 16.28 మీటర్ల మార్క్‌ను అధిగమించినప్పటికీ.. ప్రతి ఈవెంట్‌లో భారత్ నుంచి ఇద్దరు అథ్లెట్లకు మాత్రమే అవకాశం ఉంటుంది. దాంతో అతని ఎంపికపై ఇంకా స్పష్టత రాలేదు. జపాన్‌లో జరిగే ఆసియా క్రీడల కోసం భారత జట్టును అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇంకా ప్రకటించాల్సి ఉంది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story