David Miller: ఐపీఎల్ 2026లో ఫిక్సింగ్?.. డేవిడ్ మిల్లర్ ఇన్నింగ్స్‌పై అనుమానాలు!
David Miller’s innings sparks controversy. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో డేవిడ్ మిల్లర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడినా.. అతడిపై ఫిక్సింగ్ అనుమానాలు ఉన్నాయని నెటిజెన్స్ అంటున్నారు
David Miller
David Miller: బుధవారం రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగింది. ఈ ఉత్కంఠ పోరులో ఒక్క పరుగు తేడాతో ఢిల్లీ ఓటమిపాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ 4 వికెట్లకు 210 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ (70), జోస్ బట్లర్ (52), వాషింగ్టన్ సుందర్ (55) హాఫ్ సెంచరీలు బాదారు. 211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 8 వికెట్లకు 209 పరుగులే చేసింది. కేఎల్ రాహుల్ (92), డేవిడ్ మిల్లర్ (41 నాటౌట్), నిశాంక (41) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. అయితే మిల్లర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడినా.. అతడిపై ఫిక్సింగ్ అనుమానాలు ఉన్నాయని నెటిజెన్స్ అంటున్నారు.
మ్యాచ్ ముగిసిన తర్వాత కొన్ని కీలక సంఘటనలు అభిమానుల్లో అనుమానాలకు తావిస్తున్నాయి. ముఖ్యంగా డేవిడ్ మిల్లర్ ఇన్నింగ్స్‌లో చోటుచేసుకున్న ఘటనలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. అంపైరింగ్ నిర్ణయాలు, రీప్లేలు లేకపోవడం, కొన్ని కీలక నిర్ణయాలపై స్పష్టత లేకపోవడం వంటి అంశాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. మొదటి వివాదం మిల్లర్ ఆడిన షాట్ గురించే. లాంగ్ ఆఫ్ వైపు ఆడిన బంతి బౌండరీ దగ్గర పడింది. అది ఫోరా? సిక్సా? అన్నది స్పష్టంగా తెలియకపోయినా.. ఎలాంటి రీప్లే చూపించకుండా అంపైర్ వెంటనే ఫోర్‌గా ప్రకటించడం అనుమానాలకు తావిస్తోంది. సాధారణంగా ఇలాంటి కీలక సందర్భాల్లో థర్డ్ అంపైర్ సహాయం తీసుకుంటారు. కానీ ఈ మ్యాచ్‌లో అలాంటిది జరగలేదు.
రెండో వివాదం ఏంటంటే.. ఇన్నింగ్స్ 19.5 బంతికి డేవిడ్ మిల్లర్ రన్ తీయకపోవడం. ఢిల్లీ విజయానికి చివరి రెండు బంతుల్లో 2 పరుగులు అవసరం అయ్యాయి. అయిదో బంతికి సింగిల్ తీసే అవకాశమున్నా.. మిల్లర్ నిరాకరించాడు. ఇది అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. చివరి బంతికి షాట్ ఆడలేకపోయిన మిల్లర్.. బై కోసం ప్రయత్నించాడు. అయితే స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న కుల్దీప్ యాదవ్ రనౌటైపోయాడు. దాంతో ఢిల్లీ ఓటమిపాలైంది. దీంతో సోషల్ మీడియాలో 'ఎందుకు రన్ తీసుకోలేదు?' అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
మూడో వివాదం ఏంటంటే.. చివరి బంతి. కుల్దీప్ యాదవ్ డైవ్ చేయగా రనౌట్ అయ్యాడు. దీనిపై ఎలాంటి స్పష్టత లేకపోయినా.. సరైన రీప్లేలు లేకుండానే అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. ఈ నిర్ణయం మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసింది. చివరకు గుజరాత్ విజయం సాధించగా.. ఈ సంఘటనలపై పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది. మొత్తంగా చూస్తే.. ఈ మ్యాచ్‌లో జరిగిన ఈ మూడు కీలక ఘటనలు ఐపీఎల్‌లో పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అయితే ఇవి కేవలం అనుమానాలే తప్ప ఎలాంటి అధికారిక నిర్ధారణ లేదని గుర్తుంచుకోవాలి. అయినప్పటికీ అభిమానులు మాత్రం క్లారిటీ కోరుతున్నారు.


