Devdutt Padikkal Record: స్వాతంత్ర్య దినోత్సవం రోజున అరుదైన రికార్డు.. తొలి బ్యాటర్‌గా చరిత్రకెక్కిన దేవదత్ పడిక్కల్!
Devdutt Padikkal Record: గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అద్భుత సెంచరీతో మెరిశాడు.
Devdutt Padikkal Record: స్వాతంత్ర్య దినోత్సవం రోజున అరుదైన రికార్డు.. తొలి బ్యాటర్‌గా చరిత్రకెక్కిన దేవదత్ పడిక్కల్!
Devdutt Padikkal Record: గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అద్భుత సెంచరీతో మెరిశాడు. 134 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఈ శతకంతో పడిక్కల్ తన టెస్టు కెరీర్లో తొలి శతకాన్ని నమోదు చేయడంతో పాటు.. భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నాడు. స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15) రోజున టెస్టుల్లో సెంచరీ సాధించిన తొలి భారత బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. దీంతో ఆగస్టు 15 భారత క్రికెట్ చరిత్రలో మరో ప్రత్యేక రోజుగా నిలిచింది. తొలి టెస్టు శతకాన్నే ఇంతటి అరుదైన రికార్డుతో సాధించడం పడిక్కల్ కెరీర్లో చిరస్మరణీయ ఘట్టంగా మారింది.
స్వాతంత్ర్య దినోత్సవం రోజున సెంచరీ సాధించిన తొలి భారత బ్యాటర్‌గా టీమిండియా మాజీ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. 2019లో వెస్టిండీస్‌తో పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరిగిన వన్డేలో కింగ్ 114 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆ మ్యాచ్ స్థానిక కాలమానం ప్రకారం ఆగస్టు 14న ప్రారంభమైనప్పటికీ.. భారత కాలమానం ప్రకారం ఆగస్టు 15న పూర్తైంది. వన్డేల్లో విరాట్ సెంచరీ చేస్తే.. టెస్టులో దేవదత్ పడిక్కల్ శతకం బాదాడు. దాంతో ఈ అరుదైన జాబితాలో కోహ్లీ తర్వాత పడిక్కల్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించాడు.
గణతంత్ర దినోత్సవం (జనవరి 26) రోజున టెస్టుల్లో తొలి సెంచరీ చేసిన రికార్డు కూడా విరాట్ కోహ్లీ పేరిటే ఉంది. 2012లో ఆస్ట్రేలియాపై కింగ్ ఈ ఘనత అందుకున్నాడు. ఇక టెస్టుల్లో దేవదత్ పడిక్కల్‌కు ఇది తొలి శతకం. 21వ శతాబ్దంలో భారత్ తరఫున మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ టెస్ట్ సెంచరీ సాధించిన రెండో లెప్ట్ హ్యాండ్ బ్యాటర్‌గా పడిక్కల్ మరో రికార్డు అందుకున్నాడు.
టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ 2002లో జింబాబ్వేపై సెంచరీ చేశాడు. సాయి సుదర్శన్ గాయం కారణంగా టెస్ట్ సిరీస్ నుంచి తప్పుకోవడంతో.. పడిక్కల్‌కు అవకాశం దక్కింది. అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని అతడు రెండు చేతులా అందిపుచుకున్నాడు. రెండో రోజు డబుల్ సెంచరీ చేస్తే.. మరిన్ని రికార్డులు అతడి ఖాతాలో చేరనున్నాయి.
గాలే టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆరంభంలోనే యశస్వి జైస్వాల్ రనౌట్‌గా వెనుదిరగడంతో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన దేవదత్ పడిక్కల్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.
వన్‌డౌన్‌లో వచ్చిన పడిక్కల్ ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా శ్రీలంక బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. మరో ఎండ్‌లో కేఎల్ రాహుల్‌తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత స్కోరును ముందుకు నడిపించాడు. అనంతరం తన తొలి టెస్టు సెంచరీని పూర్తి చేసి భారత జట్టుకు బలమైన స్థితిలో నిలిపాడు.
తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 73 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్ 178 బంతుల్లో 131 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మరోవైపు రిషభ్ పంత్ 27 పరుగులతో అతడికి తోడుగా క్రీజులో ఉన్నాడు. భారత్ తరఫున ఓపెనర్ కేఎల్ రాహుల్ 77 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. అంతకుముందు యశస్వి జైస్వాల్ 32 పరుగుల వద్ద అనూహ్యంగా రనౌట్ కాగా.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 16 పరుగులకే పెవిలియన్ చేరాడు.
పడిక్కల్ సెంచరీ, రాహుల్ కీలక ఇన్నింగ్స్‌తో భారత్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. రెండో రోజు ఆటలో భారత్ భారీ స్కోరు సాధించి శ్రీలంకపై ఒత్తిడి పెంచాలని చూస్తోంది. పడిక్కల్ ఎన్ని పరుగులు చేసాడన్నది ఆసక్తికరంగా మారింది. తొలి టెస్టు సెంచరీతోనే చారిత్రక రికార్డు సాధించిన పడిక్కల్.. ఈ ఇన్నింగ్స్‌ను డబుల్ సెంచరీ దిశగా తీసుకెళ్తాడా అన్నది ఇప్పుడు అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది.




