MS Dhoni: సీఎస్‌కే అభిమానులకు షాక్.. ఎంఎస్ ధోనీ చివరి ఐపీఎల్ మ్యాచ్?

MS Dhoni: ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్‌పై మరోసారి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.

Rishvik
Published on: 16 May 2026 7:38 PM IST
MS Dhoni
X

MS Dhoni: సీఎస్‌కే అభిమానులకు షాక్.. ఎంఎస్ ధోనీ చివరి ఐపీఎల్ మ్యాచ్?

MS Dhoni: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్) చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడైన ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్‌పై మరోసారి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) దిగ్గజ కెప్టెన్ ధోనీ ఐపీఎల్ 2026 సీజన్ అనంతరం క్రికెట్‌కు పూర్తిగా గుడ్‌బై చెప్పే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. చెన్నై అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన చెపాక్ స్టేడియంలోనే తన చివరి మ్యాచ్ ఆడాలని ధోనీ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఐపీఎల్ 2026 సీజన్‌లో ఇప్పటివరకు ఎంఎస్ ధోనీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. గత సీజన్‌లో ఎదురైన మోకాలి గాయం నుంచి పూర్తిగా కోలుకుని ఫిట్‌గా ఉన్నప్పటికీ.. మహీ ఇంకా బరిలోకి దిగకపోవడం అభిమానుల్లో అనేక సందేహాలకు కారణమైంది. మే 15న లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ ఆడతాడని అభిమానులు ఆశించారు. కానీ వరుసగా మూడు విజయాలతో ప్లేఆఫ్స్ రేసులో నిలిచిన జట్టు కూర్పును మార్చకూడదనే ఆలోచనతో ధోనీ మైదానంలోకి దిగలేదని తెలుస్తోంది. లక్నోపై చెన్నై దారుణ ఓటమిని మూటగట్టుకుని ప్లేఆఫ్స్ రేసులో వెనకపడిపోయింది.

ఇప్పుడు అందరి చూపు మే 18న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌పైనే ఉంది. సొంత అభిమానుల సమక్షంలో ఎంఎస్ ధోనీ తన చివరి మ్యాచ్ ఆడేలా సీఎస్‌కే మేనేజ్‌మెంట్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. మ్యాచ్ అనంతరం మహీ అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశముందని సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. మహీ రిటైర్మెంట్‌పై ఇప్పటివరకు సీఎస్‌కే లేదా ధోనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయినప్పటికీ చెపాక్‌లో అభిమానులకు ఎమోషనల్ ఫేర్‌వెల్ ఇచ్చేందుకు సీఎస్‌కే సిద్ధమవుతోందనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో ఎంత నిజముంది తెలియాలంటే రెండు రోజులు ఆగాల్సిందే.

చెన్నై సూపర్ కింగ్స్‌తో కలిసి ఎంఎస్ ధోనీ సృష్టించిన చరిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐదు ఐపీఎల్ టైటిల్స్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఎన్నో అద్భుత విజయాలు, చెపాక్‌లో అభిమానులతో ఏర్పడిన ప్రత్యేక అనుబంధం ధోనీని సీఎస్‌కేకు ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిపాయి. ‘తల’గా అభిమానులు ప్రేమగా పిలుచుకునే ధోనీ చివరి మ్యాచ్ నిజంగానే చెపాక్‌లో జరిగితే.. అది ఐపీఎల్ చరిత్రలో అత్యంత భావోద్వేగ క్షణాల్లో ఒకటిగా నిలిచిపోతుంది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story