MS Dhoni: సీఎస్‌కే అభిమానులకు శుభవార్త.. ధోనీ రిటైర్మెంట్ లేనట్టేనా?
MS Dhoni: క్రికెట్ దిగ్గజం, సీఎస్‌కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ ఈ ఏడాది కూడా లేనట్టే.
MS Dhoni: సీఎస్‌కే అభిమానులకు శుభవార్త.. ధోనీ రిటైర్మెంట్ లేనట్టేనా?
MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) అభిమానులకు శుభవార్త. క్రికెట్ దిగ్గజం, సీఎస్‌కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ ఈ ఏడాది కూడా లేనట్టే. ఇందుకు కారణం ఐపీఎల్ 2026లో చెన్నై తమ సొంత మైదానం అయిన ఎంఏ చిదంబరం స్టేడియంలో చివరి లీగ్ మ్యాచ్ ఆడుతున్నా.. మహీ బరిలోకి దిగడం లేదు. తన చివరి టీ20 మ్యాచ్ చెన్నైలో ఆడాలని గతంలో ధోనీ చెప్పాడు. ఈ సీజన్లో ఇదే చివరి మ్యాచ్ కావడంతో.. మహీ ఐపీఎల్‌కు ఈ ఏడాది కూడా వీడ్కోలు పలికే అవకాశాలు లేవు. చూడాలి మరి ధోనీ ఏమైనా షాక్ ఇస్తాడేమో.
ఐపీఎల్ 2026లో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సీఎస్‌కే సారథి రుతురాజ్ గైక్వాడ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టాస్ సందర్భంగా రుతురాజ్ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీ ఆడడం లేదని స్పష్టం చేశాడు. 'ఎంఎస్ ధోనీ జట్టుతో పాటే ఉన్నాడు. కానీ ఈ మ్యాచ్ ఆడేంత ఫిట్‌నెస్‌తో లేడు. ఈ మ్యాచ్ గెలుస్తామని ఆశిస్తున్నాం. అప్పుడు చివరి మ్యాచ్‌లో మహీని చూడొచ్చు' అని రుతురాజ్ తెలిపాడు. క్రికెట్ దిగ్గజం ధోనీ ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. చెపాక్‌లో అయినా ధోనిని చూడాలని అభిమానులు ఆశగా ఎదురుచూశారు. అయితే అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి.
సీఎస్‌కే తమ మిగిలిన రెండు మ్యాచుల్లోనూ గెలిస్తేనే ప్లేఆఫ్స్‌కు చేరుకునే అవకాశముంది. దీంతో జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ‘తలా’ ధోనీ హైదరాబాద్ మ్యాచ్‌లో ఆడకపోవచ్చని మాజీలు సునీల్ గావస్కర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ చోప్రాలు అభిప్రాయపడ్డారు. చివరకు వారి మాటే నిజమైంది. 'నా కెరీర్‌ను ప్లాన్ చేసుకుంటూ వచ్చాను. చివరి వన్డే రాంచీలో ఆడాను. నా చివరి టీ20 మ్యాచ్ చెన్నైలో ఆడాలని కోరుకుంటున్నా. అది వచ్చే ఏడాదైనా కావొచ్చు.. ఐదేళ్ల తర్వాతైనా కావొచ్చు’ అని ధోనీ గతంలో చెప్పిన విషయం తెలిసిందే. తాను చెన్నైలోనే చివరి మ్యాచ్ ఆడుతానని మహీ చెప్పాడు. ధోనీ సారథ్యంలో సీఎస్‌కే ఐదుసార్లు టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే.
చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు"
సంజు శాంసన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఉర్విల్ పటేల్, కార్తిక్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబె, ప్రశాంత్ వీర్, అకేల్ హొసేన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, స్పెన్సర్ జాన్సన్.
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్లు:
ముకేశ్ చౌదరి, మ్యాథ్యూ షార్ట్, సర్ఫరాజ్ ఖాన్, అమన్ ఖాన్, గుర్జన్‌ప్రీత్ సింగ్.




