Dhurv Jurel: ఏమయ్యా జురెల్.. సెంచరీకి మరి ఇన్ని బంతులా?.. ద్రవిడ్ కూడా ఇన్ని బాల్స్ ఆడలేదు!

Dhurv Jurel: టెస్టుల్లో 99 నుంచి 100 పరుగులకు చేరుకునేందుకు అత్యధిక బంతులు ఆడిన భారత బ్యాటర్ల జాబితాలో జురెల్ మూడో స్థానంలో నిలిచాడు.

Rishvik
Published on: 24 Aug 2026 6:57 PM IST
Dhurv Jurel
X

Dhurv Jurel: ఏమయ్యా జురెల్.. సెంచరీకి మరి ఇన్ని బంతులా?.. ద్రవిడ్ కూడా ఇన్ని బాల్స్ ఆడలేదు!

Dhurv Jurel: శ్రీలంకతో కొలంబోలో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ అద్భుతమైన శతకంతో ఆకట్టుకున్నాడు. 177 బంతులు ఎదుర్కొన్న జురెల్.. 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో అజేయంగా 115 పరుగులు చేశాడు. లంక స్పిన్నర్లు, పేసర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ కీలక సమయంలో శతకం బాదాడు. జురెల్ ఇన్నింగ్స్‌లో మరో ఆసక్తికరమైన గణాంకం ఉంది. 99 పరుగుల నుంచి 100 పరుగులకు చేరుకునేందుకు జురెల్ ఏకంగా 13 బంతులు ఎదుర్కొన్నాడు.

2007 తర్వాత టెస్టుల్లో 99 నుంచి 100 పరుగులకు చేరుకునేందుకు అత్యధిక బంతులు ఆడిన భారత బ్యాటర్ల జాబితాలో ధ్రువ్ జురెల్ మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానంలో ఉన్నాడు. 2016లో వెస్టిండీస్‌తో గ్రాస్ ఐలెట్‌లో జరిగిన టెస్టులో అశ్విన్ 99 పరుగుల వద్ద ఉండగా.. 15 బంతులు ఎదుర్కొని, చివరకు రోస్టన్ చేజ్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి సెంచరీ పూర్తి చేశాడు. ఈ జాబితాలో మాజీ ఓపెనర్ మురళీ విజయ్ రెండో స్థానంలో ఉన్నాడు. 2014లో ఇంగ్లండ్‌తో ట్రెంట్ బ్రిడ్జ్‌లో జరిగిన టెస్టులో 99 పరుగుల వద్ద 14 బంతులు ఎదుర్కొన్నాడు. తాజాగా జురెల్ 13 బంతులు తీసుకుని.. శతకాన్ని పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచాడు.

ఈ జాబితాలో భారత మాజీ దిగ్గజాలు వీవీఎస్ లక్ష్మణ్, సచిన్ టెండూల్కర్ కూడా ఉన్నారు. 2008లో ఆస్ట్రేలియాపై ఢిల్లీలో జరిగిన టెస్టులో హైదరాబాద్ సొగసరి లక్ష్మణ్ 99 నుంచి 100కు చేరేందుకు 12 బంతులు తీసుకున్నాడు. అదే ఏడాది నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియాపైనే సచిన్ కూడా 99 నుంచి సెంచరీకి చేరుకునేందుకు 12 బంతులు తీసుకున్నాడు. ఈ జాబితాలో 'ది వాల్' రాహుల్ ద్రవిడ్ పేరు లేకపోవడం విశేషం. నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించే ద్రవిడ్.. సెంచరీ చేసే సమయంలో మాత్రం దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. దాంతో ఏమయ్యా 'జురెల్.. సెంచరీకి మరి ఇన్ని బంతులా?', 'ద్రవిడ్ కూడా ఇన్ని బాల్స్ ఆడలేదు' అంటూ సరదాగా కామెంట్స్ చేశారు.

ధ్రువ్ జురెల్ మాత్రం 99 పరుగుల వద్ద కాస్త నెమ్మదించినప్పటికీ.. చివరకు తన శతకాన్ని పూర్తి చేసి భారత డ్రెస్సింగ్ రూమ్‌లో ఆనందం నింపాడు. ఈ ఇన్నింగ్స్‌తో శ్రీలంక గడ్డపై టెస్టుల్లో ఏడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్‌గా కూడా జురెల్ ఓ అరుదైన ఘనత సాధించాడు. అతడి అద్భుతమైన బ్యాటింగ్ కారణంగానే భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 503/9 వద్ద డిక్లేర్ చేసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 8 పరుగులు చేసింది. భారత్ కంటే శ్రీలంక ఇంకా 495 పరుగులు వెనుకబడి ఉంది. భారత బౌలర్లు ఆరంభంలోనే రెండు వికెట్లు పడగొట్టడంతో లంకపై భారీ ఒత్తిడి నెలకొంది. వర్షం, మేఘావృతమైన వాతావరణం మధ్య రెండో రోజు ఆట కాస్త ముందగానే ముగిసింది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story