Dinesh Karthik: ఆండీ ఫ్లవర్ కష్టమే.. ఇంగ్లండ్ ఆశలు వదులుకోవాల్సిందే!
Dinesh Karthik on England's Test coach role. ఇంగ్లండ్ టెస్టు జట్టుకు కొత్త హెడ్ కోచ్ ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఎవరిని నియమిస్తారన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Dinesh Karthik: ఆండీ ఫ్లవర్ కష్టమే.. ఇంగ్లండ్ ఆశలు వదులుకోవాల్సిందే!
Dinesh Karthik: ఇంగ్లండ్ టెస్టు జట్టుకు కొత్త హెడ్ కోచ్ ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. నాలుగేళ్ల పాటు జట్టును విజయవంతంగా నడిపించిన న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ టెస్టు కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో ఎవరిని నియమిస్తారన్నది ఇప్పుడు ఇంగ్లండ్ క్రికెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో ఐపీఎల్ 2026 ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ పేరు బలంగా వినిపిస్తోంది. అయితే ఆండీ ఫ్లవర్ ఇంగ్లండ్ బాధ్యతలు చేపట్టే అవకాశాలపై భారత మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఆండీ ఫ్లవర్ అత్యుత్తమ కోచ్‌లలో ఒకడని, ఇంగ్లండ్ తప్పకుండా పరిశీలించాల్సిన అభ్యర్థి అని ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్ దినేశ్ కార్తీక్ పేర్కొన్నాడు. అయితే ప్రస్తుతం ఆర్సీబీతో ఉన్న ఒప్పందం, ఏడాది పొడవునా పలు టీ20 లీగ్‌ల్లో కోచింగ్ బాధ్యతలు నిర్వహించడం వల్ల ఇంగ్లండ్ టెస్టు జట్టుకు పూర్తి సమయం కేటాయించడం అతనికి కష్టమేనని అభిప్రాయపడ్డాడు. స్కై స్పోర్ట్స్‌లో డీకే మాట్లాడుతూ.. 'ఆండీ ఫ్లవర్ ఇంగ్లండ్ హెడ్ కోచ్ బాధ్యతకు అర్హుడే. ప్రపంచంలో అత్యుత్తమ కోచ్‌లలో ఆయన ఒకరు. కానీ ఆయన ఈ పదవిని స్వీకరిస్తే నేను ముందుగా ఆశ్చర్యపోతాను. ఎందుకంటే ఇప్పటికే ఆర్సీబీతో ఒప్పందం ఉంది. ఐపీఎల్ సమయంలో ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్‌లు జరిగితే ఆయన అందుబాటులో ఉండరు. అలాంటి పరిస్థితిని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అంగీకరిస్తుందా? అనేదే అసలు ప్రశ్న' అని చెప్పాడు.
'వచ్చే ఏడాది మేలో బంగ్లాదేశ్‌తో ఇంగ్లండ్ టెస్టు సిరీస్ ఉండే అవకాశం ఉంది. అదే సమయంలో ఐపీఎల్ 2027 కూడా జరుగుతుంది. ఒకవేళ ఆండీ ఫ్లవర్ ఆర్సీబీతో ఉంటే.. ఆ టెస్టు మ్యాచ్‌లకు దూరమయ్యే పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా యాషెస్ వంటి కీలక సిరీస్‌కు ముందు కోచ్ అందుబాటులో లేకపోవడం జట్టుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇటీవల జాకబ్ బెతెల్ తొలి టెస్టుకు అందుబాటులో లేకపోవడం, జోఫ్రా ఆర్చర్ కూడా కొన్ని మ్యాచ్‌లకు దూరమవడం పెద్ద చర్చకు దారితీసింది. అలాంటిది ఏకంగా కోచ్ అందుబాటులో లేకపోతే విమర్శలు ఏ లెవల్లో ఉంటాయో ఓసారి మీరే ఊహించుకోండి' అని దినేశ్ కార్తీక్ పేర్కొన్నాడు. ఆండీ ఫ్లవర్ ఇంగ్లండ్ టెస్టు కోచ్‌గా వస్తాడా? లేదా ఐపీఎల్ కమిట్‌మెంట్‌ల కారణంగా ఆ అవకాశాన్ని వదులుకుంటాడా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఇటీవల బ్రెండన్ మెకల్లమ్ టెస్టు కోచ్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. అయితే ఆయన వన్డే, టీ20 జట్ల ఖేడ్ కోచ్‌గా మాత్రం కొనసాగనున్నాడు. న్యూజిలాండ్‌తో ఇటీవల జరిగిన టెస్టు సిరీస్‌లో 1-2తో ఓటమి చవిచూడటంతో ఈ మార్పు చోటుచేసుకుంది. ఇక పాకిస్థాన్‌తో జరగనున్న మూడు టెస్టుల సిరీస్‌కు కొత్త కోచ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ గౌల్డ్ మాట్లాడుతూ.. 'బ్రెండన్ మెకల్లమ్ ఇంగ్లండ్ టెస్టు జట్టుకు కొత్త ఊపిరి పోశాడు. ఆయన నాయకత్వంలో జట్టు ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించింది. ఇప్పుడు యాషెస్ లక్ష్యంగా కొత్త దిశగా ముందుకు సాగాల్సిన సమయం వచ్చింది' అని పేర్కొన్నారు.




