బలంగా తాకిన బంతి.. మైదానంలో కిందపడిపోయిన అంపైర్.. ఐసీయూలో చేరిక!
DPL 2026 Umpire Injured: ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (డీపీఎల్) 2026లో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఊహించని ఘటన చోటుచేసుకుంది.
బలంగా తాకిన బంతి.. మైదానంలో కిందపడిపోయిన అంపైర్.. ఐసీయూలో చేరిక!
DPL 2026 Umpire Injured: ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (డీపీఎల్) 2026లో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. న్యూఢిల్లీ టైగర్స్, ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ మధ్య ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో అంపైర్ ధర్మేష్ భరద్వాజ్ ఒక్కసారిగా కిందపడిపోయాడు. న్యూఢిల్లీ టైగర్స్ బ్యాటర్ లక్ష్య్ థరేజా కొట్టిన షాట్ నేరుగా అంపైర్ ధర్మేష్ ముఖానికి తగలడంతో.. ఆయనకు తీవ్ర గాయం అయింది. వెంటనే అతడిని ఐసీయూలో చేర్చి చికిత్స అందించారు. గాయానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
న్యూఢిల్లీ టైగర్స్ ఛేజింగ్ సందర్భంగా ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో ఈ ఘటన జరిగింది. ఆషిష్ మీనా వేసిన బంతిని లక్ష్య్ థరేజా స్ట్రయిట్ డ్రైవ్ ఆడాడు. వేగంగా దూసుకొచ్చిన బంతి అంపైర్ ధర్మేష్ భరద్వాజ్ ముఖం పక్క భాగానికి బలంగా తగిలింది. అతడికి తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. బాధతో అంపైర్ విలవిలాడిపోయారు. ఈ ఊహించని ఘటనతో బ్యాటర్ థరేజా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. మైదానంలో ఉన్న ఆటగాళ్లు వెంటనే అంపైర్ వద్దకు చేరుకుని పరిస్థితిని గమనించారు. వెంటనే అతడిని మైదానం నుంచి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆయనను ఐసీయూలో ఉంచి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు ఓ నివేదిక పేర్కొంది. భరద్వాజ్‌కు ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లోనే గతంలోనూ గాయం కావడం గమనార్హం. అంతకుముందు జరిగిన ఓ మ్యాచ్‌లో ఆయన భుజానికి బంతి తగిలింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఓపెనర్లు వంశ్ మెహ్రా, అర్పిత్ రాణా తొలి వికెట్‌కు 5.4 ఓవర్లలో 62 పరుగులు జోడించి జట్టుకు శుభారంభం అందించారు. మెహ్రా 21 బంతుల్లో 35 పరుగులు చేయగా.. అర్పిత్ రాణా 22 బంతుల్లో 33 పరుగులు చేశాడు. ఆ తర్వాత మయాంక్ రావత్, సూర్యాన్ష్ రైనా మెరిశారు. మయాంక్ 23 బంతుల్లో నాలుగు సిక్సర్లతో 40 పరుగులు చేయగా.. సూర్యాన్ష్ 21 బంతుల్లో 33 పరుగులు చేశాడు. దీంతో రైడర్స్ 192 పరుగుల భారీ స్కోరు సాధించింది.
193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూఢిల్లీ టైగర్స్‌కు ఆరంభంలో మంచి స్టార్ట్ లభించినప్పటికీ.. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. 10.2 ఓవర్లకు 94/4తో ఒత్తిడిలో పడింది. కెప్టెన్ హిమ్మత్ సింగ్, లక్ష్య్ థరేజా కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 48 పరుగులు జోడించారు. అయితే హిమ్మత్ 20 బంతుల్లో 31 చేసి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత న్యూఢిల్లీ బ్యాటింగ్ పూర్తిగా గాడితప్పింది. చివరకు 156 పరుగులకు ఆలౌట్ కావడంతో ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ 36 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ తరఫున ఆషిష్ మీనా అద్భుతంగా బౌలింగ్ చేసి నాలుగు ఓవర్లలో 32 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. మయాంక్ యాదవ్ కూడా మూడు ఓవర్లలో కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్‌లో మంచి స్కోరు సాధించి.. ఆ తర్వాత బౌలింగ్‌లోనూ కట్టుదిట్టంగా రాణించిన ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ 36 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. అయితే మ్యాచ్ ఫలితం కంటే అంపైర్‌కు బంతి తగిలిన ఘటననే ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో ఎక్కువగా చర్చనీయాంశంగా మారింది.




