దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఇషాన్ కిషన్ ఊచకోత.. 270 పరుగులతో సరికొత్త రికార్డులు..!

Ishan Kishan 270 Runs: దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్ పోరులో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ 270 పరుగులతో చెలరేగి సరికొత్త చరిత్ర సృష్టించాడు. కుశాగ్ర శతకంతో సహకరించగా సౌత్ జోన్ బౌలర్లను చిత్తు చేస్తూ ఈస్ట్ జోన్ భారీ స్కోరు సాధించింది.

Venkat
Published on: 7 Sept 2026 5:47 PM IST
Ishan Kishan 270 Runs
X

దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఇషాన్ కిషన్ ఊచకోత.. 270 పరుగులతో సరికొత్త రికార్డులు..!

Ishan Kishan 270 Runs: చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ విశ్వరూపం ప్రదర్శించాడు. సౌత్ జోన్ బౌలర్లను నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తూ 334 బంతుల్లో ఏకంగా 270 పరుగులు సాధించి సరికొత్త చరిత్ర లిఖించాడు. టోర్నీ ఫైనల్ చరిత్రలో ద్విశతకం సాధించిన ఏడో బ్యాటర్‌గా నిలవడమే కాకుండా, అన్షుమన్ గైక్వాడ్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో కెప్టెన్‌గా రికార్డు పుటల్లోకెక్కాడు.

కెప్టెన్ ఇన్నింగ్స్: తిరుగులేని ఆధిపత్యం

తొలి రోజు 147/3 వద్ద క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ జట్టు భారాన్ని తన భుజాలపై వేసుకున్నాడు. ఏకంగా 89 శాతం నియంత్రణతో క్లాసిక్ షాట్లతో ప్రత్యర్థి బౌలింగ్‌ను కకావికలం చేశాడు. 250 పరుగుల మార్కు దాటిన తర్వాత అసౌకర్యంతో మైదానం వీడినా, అనంతరం మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చి జట్టు స్కోరును 700 పరుగులు దాటించడంలో కీలక పాత్ర పోషించాడు. గతంలో దినేష్ కార్తీక్ పేరిట ఉన్న వికెట్ కీపర్ అత్యధిక స్కోరు రికార్డును సైతం ఇషాన్ బద్దలు కొట్టాడు.

కుశాగ్ర శతకం.. భాగస్వామ్యాల హోరు

మరో ఎండ్‌లో జార్ఖండ్ సహచరుడు కుమార్ కుశాగ్ర అద్భుత శతకంతో (101) ఆకట్టుకున్నాడు. వీరిద్దరూ కలిసి ఐదో వికెట్‌కు ఏకంగా 230 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నిర్మించారు. అంతకుముందు శిఖర్ మోహన్ 120 బంతుల్లో 85 పరుగులు చేసి కిషన్‌తో 94 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా, ఆ తర్వాత అనుకుల్ రాయ్‌తో మరో 140 పరుగుల విలువైన భాగస్వామ్యం నమోదైంది.

ఓపెనర్ల శుభారంభం.. పట్టుబిగించిన ఈస్ట్ జోన్

టాప్ ఆర్డర్‌లో అభిమన్యు ఈశ్వరన్, వైభవ్ సూర్యవంశీ సైతం దూకుడైన ఆటతీరుతో జట్టుకు మంచి పునాది అందించారు. సౌత్ జోన్ స్టార్ బౌలర్లు మహమ్మద్ సిరాజ్, శ్రేయస్ గోపాల్‌లను పూర్తి ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటూ ఈస్ట్ జోన్ బ్యాటర్లు చెన్నై పిచ్‌పై పూర్తి ఆధిపత్యాన్ని చెలాయించారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఈస్ట్ జోన్ మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించింది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story