బ్యాటింగ్‌లో తుస్సు.. డీఆర్‌ఎస్‌లో తోపు.. బుడ్డోడి దెబ్బకు తెలుగబ్బాయ్ టీం ఫసక్..!

Duleep Trophy Final: దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో వైభవ్‌ సూర్యవంశీ తన కెప్టెన్సీ తెలివితో ఆకట్టుకున్నాడు. రికీ భుయ్‌, స్మరణ్‌ రవిచంద్రన్‌ వికెట్లలో అతడి DRS నిర్ణయాలు కీలకమయ్యాయి.

Venkat
Published on: 8 Sept 2026 7:53 PM IST
Duleep Trophy Final
X

బ్యాటింగ్‌లో తుస్సు.. డీఆర్‌ఎస్‌లో తోపు.. బుడ్డోడి దెబ్బకు తెలుగబ్బాయ్ టీం ఫసక్..!

Duleep Trophy Final: దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్‌ జోన్‌ భారీ స్కోరు సాధించిన తర్వాత బంతితోనూ ఆధిపత్యం చూపించింది. 15 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ బ్యాటింగ్‌లో పెద్దగా రాణించకపోయినా, కీలక DRS నిర్ణయాలతో జట్టుకు ఉపయోగపడ్డాడు. రికీ భుయ్‌ క్యాచ్‌-బిహైండ్‌, స్మరణ్‌ రవిచంద్రన్‌ వికెట్లలో అతడి నిర్ణయాలు కీలకమయ్యాయి. అతడి వ్యూహాత్మక ఆలోచనకు తోడు మహ్మద్‌ షమీ కూడా కీలక సమయంలో వికెట్‌ తీసి సౌత్‌ జోన్‌పై ఒత్తిడి పెంచాడు.

DRSతో వైభవ్‌ మాస్టర్‌ ప్లాన్..

దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్‌ జోన్‌ భారీ స్కోరు తర్వాత సౌత్‌ జోన్‌పై పట్టు బిగిస్తోంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో 15 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ బ్యాట్‌తో పెద్దగా ప్రభావం చూపకపోయినా, వైస్ కెప్టెన్‌గా తన వ్యూహాత్మక ఆలోచనతో కీలకంగా మారాడు. రికీ భుయ్‌, స్మరణ్‌ రవిచంద్రన్‌ వికెట్లలో అతడి సూచనలు ఉపయోగపడ్డాయి.

భుయ్‌ విషయంలో సరైన నిర్ణయం..

ఈస్ట్‌ జోన్‌ 708 పరుగుల భారీ స్కోరు సాధించిన తర్వాత సౌత్‌ జోన్‌ తొలి ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగింది. ముకేశ్‌ కుమార్‌ బౌలింగ్‌లో భుయ్‌ షాట్‌ ఆడే ప్రయత్నంలో బంతి బ్యాట్‌కు తగిలిందని ఈస్ట్‌ జోన్‌ అప్పీల్‌ చేసింది. అంపైర్‌ నాటౌట్‌ ఇవ్వడంతో వైభవ్‌ రివ్యూ తీసుకోవాలని కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ను కోరాడు. అల్ట్రా ఎడ్జ్‌లో స్పైక్‌ కనిపించడంతో నిర్ణయం మారింది. కుమార్‌ కుషాగ్ర క్యాచ్‌ పట్టడంతో భుయ్‌ వెనుదిరిగాడు.

షమీకి బంతి.. కీలక వికెట్‌

టీకి ముందు సౌత్‌ జోన్‌ 174/4తో ఉన్న సమయంలో ఇషాన్‌ కిషన్‌ కొద్దిసేపు మైదానం వీడడంతో వైభవ్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ సమయంలో మహ్మద్‌ షమీని మళ్లీ బౌలింగ్‌కు తీసుకొచ్చాడు. షమీ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ స్మరణ్‌ రవిచంద్రన్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఆఫ్‌ స్టంప్‌ బయట బంతిని డ్రైవ్‌ చేయబోయిన రవిచంద్రన్‌ ఎడ్జ్‌ ఇచ్చాడు. అంపైర్‌ స్పందించకపోవడంతో కుషాగ్ర సూచనతో రివ్యూ తీసుకోగా అల్ట్రా ఎడ్జ్‌లో స్పైక్‌ కనిపించింది.

ఈస్ట్‌ జోన్‌ భారీ స్కోరు..

ఈస్ట్‌ జోన్‌ 708 పరుగులు చేయడంలో కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ 270 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. కుమార్‌ కుషాగ్ర 101, శిఖర్‌ మోహన్‌ 85, అభిమన్యు ఈశ్వరన్‌ 72 పరుగులతో అతడికి మంచి సహకారం అందించారు. దీంతో ఈస్ట్‌ జోన్‌ భారీ ఆధిక్యానికి బాట వేసింది.

6 వికెట్లకు 242 పరుగులు..

మూడో రోజు ఆట ముగిసే సరికి సౌత్ జోన్ జట్టు 242/6తో నిలిచింది. భారీ 708 పరుగుల తర్వాత ఈస్ట్‌ జోన్‌ మ్యాచ్‌పై గట్టి పట్టు సాధించే దిశగా సాగుతోంది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story