క్రికెట్ ఆటగాళ్లకు షాక్.. ఇకపై ఏదీ కుదరదు.. కొత్త మార్గదర్శకాలు ఇవే!
ఇంగ్లండ్ క్రికెట్‌లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈసీబీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ECB Issues New Alcohol Guidelines for England Players After Ben Stokes Retirement
ఇంగ్లండ్ క్రికెట్‌లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జాతీయ జట్టు ఆటగాళ్ల మద్యపానంపై కొత్త మార్గదర్శకాలను ఈసీబీ జారీ చేసినట్లు ఓ అంతర్జాతీయ మీడియా తమ నివేదికలో పేర్కొంది. గతంలో మద్యం కారణంగా పలుమార్లు వివాదాలు తలెత్తిన నేపథ్యంలో ఆటగాళ్ల పట్ల మరింత కఠినంగా వ్యవహరించాలని ఈసీబీ నిర్ణయించినట్లు సమాచారం. ఇంగ్లండ్ ఆటగాళ్లకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
మ్యాచ్ ప్రారంభానికి ముందు రోజు నుంచి మ్యాచ్ ముగిసిన తర్వాతి రోజు వరకు ప్లేయర్స్ మద్యం సేవించకూడదని ఈసీబీ మార్గదర్శకాలు జారీ చేసింది. అలాగే స్వదేశీ సిరీస్‌లు, విదేశీ పర్యటనల సమయంలో అర్ధరాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఆటగాళ్లు బహిరంగ ప్రదేశాల్లో మద్యం మత్తులో కనిపించకూడదని, సోషల్ మీడియాలో మద్యానికి సంబంధించిన పోస్టులు షేర్ చేయకూడదని ఈసీబీ నిబంధనలు రూపొందించినట్లు ‘ది టెలిగ్రాఫ్’ పేర్కొంది. రాత్రి 10 గంటల తర్వాత ఆటగాళ్లు టీమ్ హోటల్ బయట ఉంటే.. ఆ విషయాన్ని జట్టు మేనేజ్‌మెంట్ లేదా సెక్యూరిటీ సిబ్బందికి తప్పనిసరిగా తెలియజేయాలని కొత్త మార్గదర్శకాల్లో పేర్కొన్నట్లు సమాచారం.
ముందుగా చెప్పిన ప్రణాళికల్లో ఏమైనా మార్పులు ఉంటే.. ప్లేయర్స్ వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ప్రత్యేక పరిస్థితుల్లో హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్, ఇంగ్లండ్ క్రికెట్ డైరెక్టర్ రాబ్ కీ అనుమతితో కొన్ని నిబంధనల్లో సడలింపు లభించే అవకాశం ఉంది. ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఈ కొత్త మార్గదర్శకాలు చర్చనీయాంశంగా మారాయి. న్యూజిలాండ్‌తో ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన మూడో టెస్టు నాలుగో రోజు స్టోక్స్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాడు. తొలి టెస్టు విజయం అనంతరం జరిగిన అర్ధరాత్రి వేడుకలు, ఆ తర్వాత రెండో టెస్టుకు స్టోక్స్ దూరం కావడం వంటి పరిణామాలతో అతడి రిటైర్మెంట్‌కు సంబంధం ఉందనే చర్చ జరిగింది. అయితే స్టోక్స్, ఈసీబీ మాత్రం అలాంటి కారణాన్ని అధికారికంగా పేర్కొనలేదు.
తన రిటైర్మెంట్ నిర్ణయం వెనుక 2025లో ఆస్ట్రేలియా చేతిలో 4-1తో ఎదురైన యాషెస్ సిరీస్ పరాజయం నుంచి ఎన్నో అనేక కారణాలు ఉన్నాయని స్టోక్స్ వెల్లడించాడు. లార్డ్స్ టెస్టు తన కెరీర్‌కు సంబంధించిన ప్రతికూల భావాలను మళ్లీ గుర్తుచేసిందని చెప్పాడు. పరిస్థితులను చక్కదిద్దేందుకు ఎంతో కష్టపడ్డానని, కానీ ఆ ప్రయత్నంలో మానసికంగా, శారీరకంగా పూర్తిగా అలసిపోయానని పేర్కొన్నాడు. తనను రిటైర్మెంట్ తీసుకోవాలని ఈసీబీ బలవంతం చేయలేదని స్టోక్స్ స్పష్టం చేశాడు. అయితే ఇటీవల చోటుచేసుకున్న నైట్‌క్లబ్ వివాదం పరిస్థితులను మరింత క్లిష్టంగా మార్చిందని అంగీకరించాడు. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల క్రమశిక్షణ, మద్యపానం విషయంలో ఈసీబీ కొత్త మార్గదర్శకాలు తీసుకురావడం ఇంగ్లండ్ క్రికెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.




