England-ICC: ఇంగ్లండ్‌కు భారీ షాక్.. ఏకంగా 12 పాయింట్లు కోత, జరిమానా కూడా!
England-ICC: డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్‌లో ఇంగ్లండ్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.
England-ICC: ఇంగ్లండ్‌కు భారీ షాక్.. ఏకంగా 12 పాయింట్లు కోత, జరిమానా కూడా!
England-ICC: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27 సైకిల్‌లో ఇంగ్లండ్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. న్యూజిలాండ్‌తో ది ఓవల్ వేదికగా జరిగిన రెండో టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా ఇంగ్లండ్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కఠిన చర్యలు తీసుకుంది. ఇంగ్లండ్ జట్టుకు ఏకంగా 12 డబ్ల్యూటీసీ పాయింట్లు కోత విధించడంతో పాటు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా కూడా విధించింది. ఐసీసీ కొరడాతో ఇంగ్లీష్ జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు మరింత సంక్లిష్టంగా మారాయి.
ఐసీసీ నిబంధనల ప్రకారం.. టెస్టు మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో వేయాల్సిన ఓవర్ల కంటే తక్కువ ఓవర్లు వేసిన జట్టుకు ప్రతి ఓవర్‌కు ఒక డబ్ల్యూటీసీ పాయింట్ కోత విధిస్తారు. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ 12 ఓవర్లు తక్కువగా వేసినట్లు తేలడంతో 12 పాయింట్లు కోల్పోయింది. ఐసీసీ భారీ షాక్తో లార్డ్స్‌లో జరిగిన తొలి టెస్టు విజయంతో సంపాదించిన 12 పాయింట్లు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. అంతేకాకుండా ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం.. ప్రతి ఓవర్‌కు మ్యాచ్ ఫీజులో 5 శాతం జరిమానా విధించాల్సి ఉంటుంది. అయితే గరిష్టంగా 50 శాతం వరకు మాత్రమే జరిమానా విధించే అవకాశం ఉండటంతో ఇంగ్లండ్ ఆటగాళ్లపై.. గరిష్ట శిక్ష (50 శాతం) అమలైంది.
స్లో ఓవర్ రేట్ తప్పిదంను ఆన్-ఫీల్డ్ అంపైర్లు అడ్రియన్ హోల్డ్‌స్టాక్, నితిన్ మీనన్, థర్డ్ అంపైర్ రాడ్ టక్కర్, ఫోర్త్ అంపైర్ గ్రాహం లాయిడ్ నమోదు చేశారు. రెగ్యులర్ కెప్టెన్ బెన్ స్టోక్స్ గైర్హాజరీలో జట్టును నడిపించిన జో రూట్.. తన తప్పును అంగీకరించడంతో విచారణ అవసరం లేకుండానే మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ జరిమానాను విధించారు. ఇది ఇంగ్లండ్‌కు మరింత నిరాశను మిగిల్చింది. ఎందుకంటే ఓవల్ టెస్టులో న్యూజిలాండ్ చేతిలో ఇంగ్లండ్ 253 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. ఆ పరాజయంతో మూడు టెస్టుల సిరీస్ 1-1తో సమమైంది. ఇప్పుడు 12 పాయింట్ల కోత కారణంగా డబ్ల్యూటీసీ పట్టికలో ఇంగ్లండ్ పరిస్థితి మరింత దెబ్బతింది.
ప్రస్తుతం 12 టెస్టుల్లో 38 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచిన ఇంగ్లండ్ పాయింట్ల శాతం 26.39కి పడిపోయింది. రెండో టెస్టు మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్ ఖాతాలో 50 పాయింట్లు ఉన్నాయి. ఈ టెస్టులో ఏకంగా 12 పాయింట్లను కోల్పోవాల్సి వచ్చింది. దీంతో పాయింట్ల సంఖ్య 50 నుంచి 38కి తగ్గింది. డబ్ల్యూటీసీ పట్టికలో పర్సంటేజీ 34.72 నుంచి 26.38 శాతానికి పడిపోయింది. ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్‌లో ఇంగ్లండ్ రెండోసారి ఓవర్ రేట్ నమోదు చేసింది. 2025లో భారత్‌పై లార్డ్స్ టెస్టులో 22 పరుగుల తేడాతో గెలిచిన మ్యాచ్ అనంతరం కూడా రెండు పాయింట్లు కోల్పోయింది. గత డబ్ల్యూటీసీ సైకిల్‌లో కూడా ఇలాంటి నిబంధనల ఉల్లంఘనల కారణంగా ఇంగ్లండ్ మొత్తం 22 పాయింట్లు కోల్పోయి ఐదో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఇక ఇంగ్లండ్ దృష్టి ఇప్పుడు నిర్ణయాత్మక మూడో టెస్టుపై ఉంది. నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా గురువారం నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్టులో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌కు రెగ్యులర్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తిరిగి జట్టులోకి రానుండగా.. పేసర్ గస్ అట్కిన్సన్ కూడా అందుబాటులోకి వచ్చాడు. ఓవల్ టెస్టుకు ముందు జరిగిన నైట్‌క్లబ్ వివాదం కారణంగా వీరిద్దరూ రెండో టెస్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే పరాజయం, ఇప్పుడు పాయింట్ల కోతతో ఇంగ్లండ్ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలకు గట్టి దెబ్బ తగిలింది. ఇకపై ప్రతి మ్యాచ్‌లోనూ ఫలితాలతో పాటు ఓవర్ రేట్‌పైనా ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.




