Viral Video: అర్జున్ టెండూల్కర్-శివమ్ దూబే మధ్య గొడవ.. ఆపకుంటే పొట్టుపొట్టు కొట్టుకునే వారే!

Viral Video: అర్జున్ టెండూల్కర్, శివమ్ దూబేలు ఘర్షణ పడ్డారంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయింది.

Rishvik
Published on: 14 Jun 2026 7:35 PM IST
Viral Video
X

Viral Video: అర్జున్ టెండూల్కర్-శివమ్ దూబే మధ్య గొడవ.. ఆపకుంటే పొట్టుపొట్టు కొట్టుకునే వారే!

Viral Video: టీ20 ముంబై లీగ్ 2026 ఫైనల్ సందర్భంగా భారత ఆటగాళ్లు అర్జున్ టెండూల్కర్, శివమ్ దూబేలు బౌండరీ లైన్ వద్ద ఘర్షణ పడ్డారంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయింది. ఆటగాళ్లు మధ్యలో కలగజేసుకోకుంటే.. ఇద్దరు పొట్టుపొట్టు కొట్టుకునే వారు అని నెటిజెన్స్ కామెంట్ల వర్షం కురిపించారు. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని ఫ్యాక్ట్ చెక్‌లో తేలింది. వాస్తవానికి ఈ ఇద్దరు క్రికెటర్ల మధ్య ఎలాంటి గొడవ జరగలేదని, వైరల్ అవుతున్న వీడియో పూర్తిగా తప్పుదారి పట్టించే ప్రయత్నం అని వెల్లడైంది.

డగౌట్ వద్దకు వివాదం:

జూన్ 13న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన టీ20 ముంబై లీగ్ 2026 ఫైనల్లో ఎంఎస్‌సీ మరాఠా రాయల్స్, ఆర్క్స్ అంధేరి జట్లు తలపడ్డాయి. మ్యాచ్ చివరి దశలో జరిగిన ఓ ఉద్రిక్త ఘటనను కొందరు తప్పుగా ప్రచారం చేశారు. దాంతో అర్జున్ టెండూల్కర్, శివమ్ దూబే పేర్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. అసలు ఘటన 19వ ఓవర్‌లో చోటుచేసుకుంది. ఆర్క్స్ అంధేరి బ్యాటర్ గౌరవ్ జాథర్ ఎల్బీడబ్ల్యూగా ఔటైన తర్వాత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీంతో అతనికి ఎంఎస్‌సీ మరాఠా రాయల్స్ పేసర్, తాత్కాలిక కెప్టెన్ తుషార్ దేశ్‌పాండేతో వాగ్వాదం జరిగింది. ఈ వివాదం క్రమంగా డగౌట్ వద్దకు చేరుకుని.. ఇరు జట్ల ఆటగాళ్లు, సహాయక సిబ్బంది మధ్య మాటల యుద్ధానికి దారితీసింది.

గొడవను ఆపే ప్రయత్నం:

ఈ పరిస్థితుల్లో ఆర్క్స్ అంధేరి కెప్టెన్ శివమ్ దూబే జోక్యం చేసుకున్నాడు. ఉద్రిక్తత మరింత పెరగకుండా ఆటగాళ్లను విడదీసి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించాడు. మైదానంలో ప్రశాంత స్వభావానికి పేరుగాంచిన దూబే.. గొడవను ఆపే ప్రయత్నమే చేశాడే తప్ప ఎలాంటి ఘర్షణలో పాల్గొనలేదని స్పష్టమైంది. మరోవైపు అర్జున్ టెండూల్కర్ ఈ ఘటనలో నేరుగా పాల్గొన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవు. మ్యాచ్‌లో ఆర్క్స్ అంధేరి తరఫున ఆడిన అర్జున్.. దివ్యాంశ్ సక్సేనాతో కలిసి జట్టుకు కీలక భాగస్వామ్యం అందించాడు. వైరల్ పోస్టుల్లో పేర్కొన్నట్లుగా శివమ్ దూబేతో అతనికి ఎలాంటి వివాదం జరగలేదు.

ఇద్దరూ ఒకే జట్టుకు ప్రాతినిథ్యం:

అంతేకాకుండా శివమ్ దూబే, అర్జున్ టెండూల్కర్ ఇద్దరూ ఒకే జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. 2026 సీజన్ మొత్తం ఆర్క్స్ అంధేరి జట్టుకు దూబే కెప్టెన్‌గా వ్యవహరించగా.. అర్జున్ టెండూల్కర్ కీలక ఆల్‌రౌండర్‌గా సేవలందించాడు. ఒకే జట్టు విజయానికి పోరాడుతున్న ఈ ఇద్దరు ఆటగాళ్ల మధ్య గొడవ జరిగిందన్న ప్రచారం వాస్తవాలకు పూర్తిగా విరుద్ధమని ఫ్యాక్ట్ చెక్‌లో తేలింది. ఇక ఫైనల్ మ్యాచ్ విషయానికి వస్తే.. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఎంఎస్‌సీ మరాఠా రాయల్స్ 8 పరుగుల తేడాతో ఆర్క్స్ అంధేరిని ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. దీంతో టీ20 ముంబై లీగ్ 2026 సీజన్ విజయవంతంగా ముగిసింది.


Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story