Faiz Fazal's: దేశవాళీ క్రికెట్‌లో వేలాది పరుగులు.. టీమిండియా డెబ్యూ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ.. పత్తాలేకుండా పోయిన ప్లేయర్!

Faiz Fazal's Incredible India Story. ఎంతో ప్రతిభ ఉన్నా.. మాజీ ఓపెనర్ ఫైజ్ ఫజల్ భారత జట్టుకు మాత్రం కేవలం ఒకే ఒక్క వన్డే మ్యాచ్ మాత్రమే ఆడాడు.

Rishvik
Published on: 5 Aug 2026 6:36 PM IST
Faiz Fazals
X

Faiz Fazal's: దేశవాళీ క్రికెట్‌లో వేలాది పరుగులు.. టీమిండియా డెబ్యూ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ.. పత్తాలేకుండా పోయిన ప్లేయర్!

Faiz Fazal's: భారత క్రికెట్‌లో ప్రతిభకు కొదవలేదు. అదే సమయంలో టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వాలంటే ఎంతో పోటీ ఉంటుంది. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణించినా.. జాతీయ జట్టులో స్థానం దక్కించుకోవడం ఎంతో కష్టమైన పని. అదృష్టం కలిసొచ్చి ఒకసారి అవకాశం వచ్చినా.. దానిని నిలబెట్టుకోవడం మరింత సవాలే అనే చెప్పాలి. టీమిండియాలోకి ఇలా వచ్చి అలా వెళ్లిపోయిన ప్లేయర్స్ ఎందరో ఉన్నారు. ఈ జాబితాలో మాజీ ఓపెనర్ ఫైజ్ ఫజల్ పేరు ముందుంటుంది. దేశవాళీ క్రికెట్‌లో వేలాది పరుగులు చేసినా, టీమిండియా డెబ్యూ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసినా.. అనంతరం పత్తాలేకుండా పోయాడు. ఎంతో ప్రతిభ ఉన్నా.. ఫజల్ భారత జట్టుకు మాత్రం కేవలం ఒకే ఒక్క వన్డే మ్యాచ్ మాత్రమే ఆడాడు.

విదర్భ, రైల్వేస్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన ఫైజ్ ఫజల్ దేశవాళీ క్రికెట్‌లో నిలకడైన ప్రదర్శనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 2015-16 సీజన్‌లో 16 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 44.62 సగటుతో 714 పరుగులు చేసి బీసీసీఐ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఆ సీజన్‌లో మూడు సెంచరీలు నమోదు చేశాడు. మొత్తంగా తన ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో 138 మ్యాచ్‌లు ఆడి 41 సగటుతో 9,184 పరుగులు చేశాడు. దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన ఫలితంగా 2016లో జింబాబ్వే పర్యటనకు భారత జట్టులో అతడికి చోటు దక్కింది. అప్పటికే అతడి వయస్సు 30 ఏళ్లు దాటింది. దీంతో 16 ఏళ్ల తర్వాత ముప్పై ఏళ్లు దాటిన వయస్సులో వన్డే అరంగేట్రం చేసిన తొలి భారత ఆటగాడిగా ఫజల్ రికార్డుల్లో నిలిచాడు.

2016 జూన్ 15న హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఫైజ్ ఫజల్ తన వన్డే అరంగేట్రం చేశాడు. భారత్ 126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగగా.. ఫజల్ 61 బంతుల్లో అజేయంగా 55 పరుగులు చేశాడు. మరో ఎండ్‌లో కేఎల్ రాహుల్ 70 బంతుల్లో అజేయంగా 63 పరుగులు చేసి భారత్‌కు విజయాన్ని అందించాడు. అరంగేట్ర మ్యాచ్‌లో అర్ధ శతకంతో ఆకట్టుకున్నప్పటికీ.. ఆశ్చర్యకరంగా ఆ తర్వాత ఫజల్‌కు మరో వన్డే ఆడే అవకాశం రాలేదు. అద్భుత ఆరంభం చేసినప్పటికీ తీవ్ర పోటీ కారణంగా భారత జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. ఆ సమయంలో శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, అజింక్య రహానే, కేఎల్ రాహుల్ వంటి ఓపెనర్లు బలమైన పోటీ ఇవ్వడంతో.. ఫజల్ మళ్లీ జాతీయ జట్టులోకి రాలేదు.

చివరికి 2021 ఫిబ్రవరిలో ఫైజ్ ఫజల్ ప్రొఫెషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తన వీడ్కోలు సందర్భంగా సోషల్ మీడియాలో భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నాడు. 21 ఏళ్ల క్రితం ప్రారంభమైన తన ఫస్ట్‌క్లాస్ ప్రయాణం ముగుస్తోందని.. భారత జట్టు, విదర్భ తరఫున ప్రాతినిధ్యం వహించడం జీవితంలో అత్యంత గర్వకారణమని పేర్కొన్నాడు. తాను ధరించిన 24వ నంబర్ జెర్సీని ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పాడు. క్రికెట్ జీవితానికి వీడ్కోలు పలుకుతున్నా.. కొత్త ప్రయాణం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నానని భావోద్వేగంగా వెల్లడించాడు. భారత క్రికెట్‌లో ప్రతిభ ఒక్కటే సరిపోదని.. అవకాశాలు, తీవ్రమైన పోటీ కూడా ఆటగాడి అంతర్జాతీయ కెరీర్‌ను నిర్ణయిస్తాయని ఫైజ్ ఫజల్ స్టోరీ మనకు తెలియజేస్తుంది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story