RCB vs GT: ఐపీఎల్‌లో ఘోర తప్పిదం.. మండిపడుతున్న అభిమానులు
RCB vs GT: ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్-1 మ్యాచ్ సందర్భంగా ధర్మశాల స్టేడియం లేజర్ షోలో భారత మ్యాప్ వివాదం రేగింది.
RCB vs GT: ఐపీఎల్‌లో ఘోర తప్పిదం.. మండిపడుతున్న అభిమానులు
Ipl : ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించి డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య మంగళవారం రాత్రి జరిగిన క్వాలిఫైయర్-1 హై-వోల్టేజ్ పోరుకు ధర్మశాల స్టేడియం వేదికైంది. మైదానంలో ఆటగాళ్ల సిక్సర్లు, వికెట్లతో మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంటే.. ఇన్నింగ్స్ బ్రేక్‌లో నిర్వాహకులు చేసిన ఒక బ్లింక్ అండ్ మిస్ పొరపాటు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. తొలి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత స్టేడియంలోని ప్రేక్షకులను అలరించడానికి భారీ ఎత్తున లేజర్ అండ్ లైట్ షో నిర్వహించారు. అయితే, ఆ కాంతుల వెలుగుల్లో నిర్వాహకులు చేసిన ఒక ఘోర తప్పిదం.. క్రికెట్ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది.
అసలేం జరిగిందంటే..?
షో ఉత్సాహంగా సాగుతున్న సమయంలో స్టేడియం స్క్రీన్‌లపై భారతదేశ భౌగోళిక మ్యాప్‌ను లేజర్ కాంతులతో ప్రదర్శించారు. అయితే, ఆ విజువల్స్‌లో దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను దెబ్బతీసేలా ఉన్న పెద్ద లోపాన్ని నెటిజన్లు ఇట్టే పసిగట్టేశారు. ఆ లేజర్ షోలో ప్రదర్శించిన మ్యాప్‌లో ఉత్తరాఖండ్‌తో పాటు కాశ్మీర్, ఈశాన్య భారత రాష్ట్రాలను పూర్తిగా విస్మరించారు. కేవలం సగం మ్యాప్‌ను మాత్రమే స్క్రీన్‌పై చూపించారు. స్టేడియంలోని కొందరు అభిమానులు ఈ దృశ్యాలను తమ ఫోన్లలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో, క్షణాల్లోనే ఈ ఉదంతం దేశవ్యాప్తంగా వైరల్‌గా మారింది. ధర్మశాల స్టేడియం నిర్వాహకులు, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ లక్ష్యంగా నెటిజన్లు, క్రికెట్ ప్రేమికులు సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన, ప్రతిష్టాత్మకమైన క్రికెట్ బోర్డు బీసీసీఐ. అలాంటి బోర్డు పర్యవేక్షణలో.. అది కూడా ఐపీఎల్ ఫైనల్స్ రేసును నిర్ణయించే ఇంతటి కీలకమైన నాకౌట్ మ్యాచ్‌లో ఇంతటి బాధ్యతారహితమైన పొరపాటు ఎలా జరుగుతుంది? అని అభిమానులు తీవ్రస్థాయిలో నిలదీస్తున్నారు. దేశ భౌగోళిక సరిహద్దుల విషయంలో ఇంతటి అజాగ్రత్త వహించడం క్షమించరాని నేరమని, గ్రాఫిక్స్ డిజైన్ చేసిన వారిపై, దాన్ని స్క్రీనింగ్‌కు అనుమతించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.




