World Cup 2026: అమెరికా విడిచి వెళ్లమన్నారు, మేం అత్యంత అణచివేతకు గురవుతున్నాం.. ఇరాన్ కోచ్

World Cup 2026: ఫిఫా ప్రపంచకప్‌ 2026లో పాల్గొంటున్న ఇరాన్ జట్టుకు మరో షాక్ తగిలింది.

Rishvik
Published on: 16 Jun 2026 6:25 PM IST
World Cup 2026
X

World Cup 2026: అమెరికా విడిచి వెళ్లమన్నారు, మేం అత్యంత అణచివేతకు గురవుతున్నాం.. ఇరాన్ కోచ్

World Cup 2026: ఫిఫా ప్రపంచకప్‌ 2026లో పాల్గొంటున్న ఇరాన్ జట్టుకు మరో షాక్ తగిలింది. సోమవారం రాత్రి లాస్ ఏంజెలెస్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం విశ్రాంతి తీసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా.. అమెరికా నుంచి వెంటనే వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ విషయాన్ని ఇరాన్ ప్రధాన కోచ్ అమీర్ ఘలేనోయి తెలిపారు. ఈ నిర్ణయం జట్టు సన్నాహకాలను దెబ్బతీసిందని, ఆటగాళ్ల రికవరీపై ప్రతికూల ప్రభావం చూపిందని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టోర్నీలో మేం అత్యంత అణచివేతకు గురవుతున్నాం అని అమీర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌ను ఇరాన్ 2-2తో డ్రాగా చేసుకుంది. సాధారణంగా జట్లు మ్యాచ్ జరిగిన నగరంలోనే రాత్రి బస చేసి విశ్రాంతి తీసుకుంటాయి. అయితే ఇరాన్ జట్టుకు మాత్రం మ్యాచ్ ముగిసిన వెంటనే కాలిఫోర్నియా నుంచి మెక్సికోలోని టిజువానాలో ఉన్న తమ శిక్షణ శిబిరానికి తిరిగి వెళ్లాలని సూచించినట్లు అమీర్ ఘలేనోయి వెల్లడించారు. భారత కాలమానం ప్రకారం.. లాస్‌ ఏంజెలెస్‌లోనే ఇరాన్ తదుపరి మ్యాచ్‌ను బెల్జియంతో ఆడాల్సి ఉంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి ఫిఫా ప్రపంచకప్‌లో ఇరాన్ ఆడుతుందా? లేదా అనే అనుమానాలు ఉన్నాయి. తమ గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లను అమెరికా బయట నిర్వహించాలన్న అభ్యర్థనను ఫిఫా తిరస్కరించింది. దాంతో ఇక చేసేది లేక వరల్డ్ కప్‌లో పాల్గొనాలని ఇరాన్ నిర్ణయించుకుంది.

'మ్యాచ్ ముగిసిన వెంటనే అమెరికా నుంచి వెళ్లాలని మాకు చెప్పారు. ఆటగాళ్లకు విశ్రాంతి తీసుకునే సమయం కూడా ఇవ్వలేదు. రికవరీ ప్రక్రియ చాలా ముఖ్యమైనది. కానీ మేము వెంటనే విమానం ఎక్కి టిజువానాకు వెళ్లాల్సి వచ్చింది. ఇది మాకు చాలా ఇబ్బందికరంగా మారింది' అని అమీర్ ఘలేనోయి చెప్పారు. ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారనే విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పకపోయినా.. తమ జట్టుకు సంబంధించిన నిర్ణయాలు ఎక్కడో ఎవరో తీసుకుంటున్నారనే భావన కలుగుతోందని అన్నారు. 'మేము మ్యాచ్‌కు రెండు రోజుల ముందే రావాల్సి ఉంది. మ్యాచ్ తర్వాత ఇక్కడే ఉండి మరుసటి రోజు మధ్యాహ్నం వెళ్లాల్సిన ఉంది. కానీ ఎందుకు ఇలా మా ప్రయాణ షెడ్యూల్ మార్చారో మాకు తెలియదు. ఇది చాలా విచిత్రంగా ఉంది' అని పేర్కొన్నారు.

అమెరికా, ఇజ్రాయెల్‌లతో ఇరాన్‌కు కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో జట్టు ఇప్పటికే అనేక సమస్యలను ఎదుర్కొంటోందని ఘలేనోయి తెలిపారు. ఇరాన్ కెప్టెన్ మెహ్దీ తారెమీ కూడా జట్టు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా వీసాలు లభించకపోవడంతో ఇరాన్ ఫుట్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడు, కోచింగ్ సిబ్బంది, మీడియా అధికారులతో పాటు పలువురు కీలక సిబ్బంది జట్టుతో చేరలేకపోయారని చెప్పారు. 'మేము ఇప్పుడు వెంటనే లాస్ ఏంజెల్స్‌ను విడిచి వెళ్లాలి. ఇది మాకు ఏమాత్రం అనుకూలంగా లేదు. ఫిఫా మాకు మరింత సహాయం చేయాలి. ప్రస్తుతం పరిస్థితులన్నీ ఒక విపత్తులా అనిపిస్తున్నాయి' అని తారెమీ చెప్పాడు.

న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇరాన్ రెండు సార్లు వెనుకబడినా తిరిగి పోరాడి డ్రా చేసుకుంది. మహమ్మద్ మొహెబ్బీ 64వ నిమిషంలో గోల్ నమోదు చేసి జట్టును ఓటమి నుంచి కాపాడాడు. కాలిఫోర్నియాలో జరిగిన ఈ మ్యాచ్‌కు పెద్ద సంఖ్యలో ఇరాన్ అభిమానులు హాజరయ్యారు. అయితే ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపిన ఇరానియన్-అమెరికన్ అభిమానులు కూడా స్టేడియంలో కనిపించారు. ఇక ఇరాన్ తన తదుపరి గ్రూప్ మ్యాచ్‌ను ఆదివారం బెల్జియంతో ఆడనుంది. అదే సోఫై స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌కు ముందు జట్టు సన్నాహకాలు, ప్రయాణ ఏర్పాట్లు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story