వీళ్ల ఐపీఎల్ కెరీర్ ఖతం.. వచ్చే సీజన్‌లో కనిపించని ఐదుగురు స్టార్ క్రికెటర్లు?
Last Match in IPL 2026: ఈ సీజన్‌లో కొందరు ఆటగాళ్లు తమ ముద్ర వేయగా, భారీ అంచనాలతో బరిలోకి దిగిన పలువురు అనుభవజ్ఞులైన సీనియర్లు ఘోరంగా విఫలమయ్యారు.
వీళ్ల ఐపీఎల్ కెరీర్ ఖతం.. వచ్చే సీజన్‌లో కనిపించని ఐదుగురు స్టార్ క్రికెటర్లు?
Last Match in IPL 2026: ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవాలతో అట్టహాసంగా ముగిసింది. ఎందరో యువ ఆటగాళ్లకు ఈ టోర్నీ లైఫ్ ఇస్తే, కొందరు సీనియర్ స్టార్లకు మాత్రం ఇది చేదు జ్ఞాపకంగా మిగిలింది. పేలవ ఫామ్, వయసు భారం కారణంగా ఈ ఐదుగురు క్రికెటర్లకు ఇదే చివరి ఐపీఎల్ మ్యాచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఐపీఎల్ 2026 ముగింపు.. కొందరికి ఆనందం, మరికొందరికి ఆవేదన..
ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన లీగ్ ఐపీఎల్ 2026 సీజన్ అభిమానులకు అంతులేని వినోదాన్ని అందిస్తూ ఘనంగా తెరపడింది. ఈ ఏడాది ఆర్సీబీ రెండోసారి ట్రోఫీని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించగా, పది ఫ్రాంచైజీల ఆటగాళ్లు మైదానంలో ఎన్నో అద్భుతమైన క్షణాలను మిగిల్చారు. అయితే, క్రికెట్ ప్రపంచంలో ఒకరి ఫాం.. మరొకరి శాపంగా మారుతుందనేది అక్షర సత్యం. ఈ సీజన్‌లో కొందరు ఆటగాళ్లు తమ ముద్ర వేయగా, భారీ అంచనాలతో బరిలోకి దిగిన పలువురు అనుభవజ్ఞులైన సీనియర్లు ఘోరంగా విఫలమయ్యారు. ఆటతీరు నిరాశాజనకంగా ఉండటంతో రాబోయే వేలంలో వీరికి పలికే ధర దేవుడెరుగు, కనీసం కొనేవారే కరువయ్యే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో, తమ ఐపీఎల్ ప్రయాణానికి దాదాపు ముగింపు పలికిన ఆ ఐదుగురు ప్రముఖ ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం..
1. కరుణ్ నాయర్ (ఢిల్లీ క్యాపిటల్స్)
గత సీజన్ ప్రదర్శనను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం రూ. 50 లక్షలు వెచ్చించి కరుణ్ నాయర్‌ను జట్టులోకి తీసుకుంది. మిడిలార్డర్‌లో తన అనుభవంతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతాడని భావిస్తే, ఈ 34 ఏళ్ల బ్యాటర్ ఆశలపై నీళ్లు చల్లాడు. ఈ సీజన్‌లో ఆడిన రెండు ఇన్నింగ్స్‌లలో కేవలం 18 పరుగులు మాత్రమే చేసి పూర్తిగా నిరాశపరిచాడు. బ్యాటింగ్‌లోనే కాకుండా ఫీల్డింగ్‌లోనూ ఘోరమైన తప్పిదాలు చేస్తూ విమర్శల పాలయ్యాడు. వచ్చే ఏడాది నాటికి 35 ఏళ్లకు చేరుకోనున్న నాయర్ వైపు ఫ్రాంచైజీలు చూసే అవకాశం లేదు. ఆధునిక టీ20 క్రికెట్ ఆశించే మెరుపు బ్యాటింగ్ అతడిలో లోపించడంతో, చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ అతడి ఐపీఎల్ కెరీర్‌లో ఆఖరిదిగా మిగిలిపోయే ప్రమాదం ఉంది.
2. టి. నటరాజన్ (ఢిల్లీ క్యాపిటల్స్)
భారత యార్కర్ కింగ్‌గా పేరొందిన ఎడమచేతి వాటం పేసర్ టి. నటరాజన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ ఏకంగా రూ. 10.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. కానీ, ఈ సీజన్ నటరాజన్ కెరీర్‌లోనే ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది. ఆరంభంలో ఫర్వాలేదనిపించినా, టోర్నీ సాగుతున్న కొద్దీ లయ తప్పాడు. 10 ఇన్నింగ్స్‌లలో కేవలం 5 వికెట్లు మాత్రమే తీసి, ఓవర్‌కు 11.18 పరుగుల భారీ ఎకానమీతో పరుగులను సమర్పించుకున్నాడు. వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడంతో ఢిల్లీ అతడిని తుది జట్టు నుంచి తప్పించాల్సి వచ్చింది. వచ్చే ఏడాది 36వ పడిలోకి అడుగుపెట్టనుండటం, తరచూ గాయాల బారిన పడటం నటరాజన్ కెరీర్‌కు ప్రతిబంధకంగా మారాయి. ఢిల్లీ జట్టు అతడిని వదిలేస్తే, తదుపరి వేలంలో అతడు అమ్ముడుపోవడం దాదాపు అసాధ్యమే.
3. అన్రిచ్ నోర్ట్జే (లక్నో సూపర్ జాయింట్స్)
దక్షిణాఫ్రికా స్పీడ్‌స్టర్ అన్రిచ్ నోర్ట్జేను లక్నో సూపర్ జాయింట్స్ రూ. 2 కోట్లకు దక్కించుకుంది. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరే ఈ పేసర్‌కు గాయాల బెడద మళ్లీ శాపంగా మారింది. ఈ సీజన్‌లో కేవలం ఒకే ఒక మ్యాచ్ ఆడి, వికెట్ ఏమీ తీయకుండానే గాయం కారణంగా టోర్నీ మధ్యలోనే స్వదేశానికి పయనమయ్యాడు. అంతకుముందు సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడినప్పుడు కూడా కేవలం రెండు మ్యాచ్‌లకే పరిమితమయ్యాడు. విదేశీ ఆటగాళ్లపై కోట్లు కుమ్మరించే ఫ్రాంచైజీలు వారి లభ్యతను ముఖ్యంగా చూస్తాయి. నిరంతరం గాయాలపాలవుతున్న నోర్ట్జే స్థానంలో సరికొత్త యువ విదేశీ బౌలర్లను వెతుక్కోవడానికి లక్నో సిద్ధమవుతోంది. దీంతో అతడి ఐపీఎల్ ప్రయాణానికి తెరపడినట్లే భావించవచ్చు.
4. ట్రెంట్ బౌల్ట్ (ముంబై ఇండియన్స్)
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన విదేశీ ఫాస్ట్ బౌలర్లలో న్యూజిలాండ్ స్టార్ ట్రెంట్ బౌల్ట్ ఒకడు. ఈ అనుభవజ్ఞుడిని ముంబై ఇండియన్స్ రూ. 12.50 కోట్ల భారీ బడ్జెట్‌తో సొంతం చేసుకుంది. అయితే, ఈ సీజన్ బౌల్ట్ ఆశించిన రీతిలో సాగలేదు. ఆడిన 5 మ్యాచ్‌ల్లో కేవలం 2 వికెట్లు మాత్రమే తీసి పరుగులను నియంత్రించడంలో విఫలమయ్యాడు. ముంబై ఇండియన్స్ జట్టు వ్యూహాత్మక మార్పుల్లో భాగంగా అతడిని బెంచ్‌కే పరిమితం చేసింది. ప్రస్తుతం 36 ఏళ్ల వయసున్న బౌల్ట్ స్థానంలో ముంబై జట్టు భవిష్యత్తు కోసం యువ బౌలర్లపై పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. ఫ్రాంచైజీల దీర్ఘకాలిక ప్రణాళికల దృష్ట్యా బౌల్ట్‌ను వేలంలోకి వదిలేస్తే, అతడిని దక్కించుకోవడానికి మిగతా జట్లు ఆసక్తి చూపకపోవచ్చు.
5. హర్షల్ పటేల్ (సన్‌రైజర్స్ హైదరాబాద్)
పర్పుల్ క్యాప్ విజేతగా ఐపీఎల్‌లో అద్భుత రికార్డులు ఉన్న హర్షల్ పటేల్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ. 8 కోట్లకు రీటెయిన్ చేసుకుంది. కానీ, ఈ సీజన్ అతడికి ఒక పీడకలలా మారింది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు సరికదా.. 10.82 ఎకానమీతో భారీగా పరుగులు ఇచ్చుకున్నాడు. హైదరాబాద్ జట్టు డెత్ ఓవర్ల సమస్యలకు హర్షల్ పేలవ ఫామ్ మరింత కారణమైంది. దీంతో జట్టు మేనేజ్‌మెంట్ అతడిని పక్కనపెట్టింది. వచ్చే సీజన్ నాటికి 35 ఏళ్లు నిండనున్న హర్షల్‌ను వదిలించుకుని, సన్‌రైజర్స్ సరికొత్త బౌలింగ్ విభాగాన్ని నిర్మించాలని చూస్తోంది. ప్రస్తుత ఫామ్ క్షీణించడంతో రాబోయే రోజుల్లో హర్షల్‌కు మరో ఐపీఎల్ కాంట్రాక్ట్ దక్కడం కష్టమే.
ఐపీఎల్ ఎవరికైనా ఫామ్, ఫిట్‌నెస్ ఉన్నంతవరకే అవకాశాలు ఇస్తుంది. వయసు పైబడటం, దానికి తోడు ప్రదర్శన గ్రాఫ్ పడిపోవడంతో ఈ ఐదుగురు స్టార్ క్రికెటర్ల ఐపీఎల్ అధ్యాయం ముగిసినట్లే కనిపిస్తోంది. ఆటగాళ్లుగా మైదానంలో ఎన్నో అద్భుత విజయాలు అందించిన వీరు, లీగ్ నుంచి నిష్క్రమించక తప్పని పరిస్థితి రావడం క్రీడాభిమానులకు కాస్త బాధాకరమైన విషయమే అయినా క్రికెట్‌లో ఇది సహజం.




