Gautam Gambhir: సంజు శాంసన్‌ను అందుకే తప్పించాం.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన గంభీర్!

Gautam Gambhir: Gautam Gambhir React on Sanju Samson Dropped. సంజును భారత జట్టు నుంచి తప్పించడంపై వచ్చిన విమర్శలపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ స్పందించాడు.

Rishvik
Published on: 8 July 2026 9:23 PM IST
Gautam Gambhir
X

Gautam Gambhir: సంజు శాంసన్‌ను అందుకే తప్పించాం.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన గంభీర్!

Gautam Gambhir: టీ20 ప్రపంచ కప్ హీరో సంజు శాంసన్‌ను జింబాంబ్వే సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టు నుంచి బీసీసీఐ తప్పించిన విషయం తెలిసిందే. సంజు స్థానంలో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అవకాశం సెలెక్టర్లు అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న టీ20 సిరీసులో కూడా సంజును పక్కన పెట్టి బుడ్డోడికి అవకాశం ఇచ్చింది. టీమిండియాకు వరల్డ్ కప్ అందించిన సంజును జట్టు నుంచి తప్పించడంతో సోషల్ మీడియాలో బీసీసీఐ, టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గౌతీ స్పందించాడు.

ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ 125 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. మ్యాచ్ అనంతరం గౌతమ్ గంభీర్ మీడియా సమావేశంలో పాల్గొనగా.. సంజును ఎందుకు తపించారు అనే ప్రశ్న గంభీర్‌కు ఎదురైంది. ఇందుకు గౌతీ స్పందిస్తూ.. సంజు, తనకు మధ్య పెద్ద చర్చ జరిగిందని చెప్పాడు. అయితే ఆ సంభాషణను బహిరంగంగా చెప్పలేనని గంభీర్ స్పష్టం చేశాడు. శాంసన్‌కు తన పాత్రపై పూర్తి స్పష్టత ఇచ్చామని వెల్లడించాడు. 'సంజుకు నా వైపు నుంచి పూర్తి క్లారిటీ ఇచ్చాను. ఓ ప్లేయర్, హెడ్ కోచ్ మధ్య జరిగిన వ్యక్తిగత సంభాషణ అది. ఆ విషయాన్ని బయటకు చెప్పడం సరికాదు. సంజు భారత జట్టుకు చేసిన సేవలు అద్భుతం. అయితే ప్రస్తుత ఫామ్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది' అని గంభీర్ వివరించాడు.

ఇటీవల ఐర్లాండ్‌తో రెండు టీ20లు, తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో సంజు శాంసన్ విఫలమయ్యాడు. దీంతో అతని స్థానంలో వైభవ్ సూర్యవంశీకి జట్టు యాజమాన్యం అవకాశం కల్పించింది. అయితే తాము తీసుకున్న నిర్ణయం తాత్కాలికమే అని గంభీర్ స్పష్టం చేశాడు. 'సంజు తిరిగి ఈ సిరీస్‌లోనే జట్టులోకి రావచ్చు. అతడికి ఎలాంటి అడ్డంకి లేదు. అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రతి ఆటగాడు తన స్థానాన్ని ప్రదర్శనతో కాపాడుకోవాలి. మంచి ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం సహజం. జట్టులో చోటు కోల్పోవడం, తిరిగి రావడం ఆటలో బాగమే' అని గౌతీ చెప్పాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో వ్యక్తుల కంటే జట్టు కాంబినేషన్ చాలా ముఖ్యమని గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు. 'అభిషేక్ శర్మతో కలిసి వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్ చేయడం జట్టుకు సరైన కాంబినేషన్‌గా భావించాం. అందుకే సంజుకు చోటు దక్కలేదు. అయితే వరుస ఓటములకు ఒక్క వైభవ్‌ను మాత్రమే బాధ్యుడిని చేయడం సరికాదు. మొత్తం టీమ్ ఆశించిన స్థాయిలో రాణించలేదు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఫలితాలే ముఖ్యం. అందుకే విజయాన్ని అందించే మంచి కాంబినేషన్‌తోనే మేము బరిలోకి దిగుతున్నాం. కానీ ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో పరిస్థితులకు తగ్గట్టుగా మేము ఆడలేకపోయాం. ఇది వాస్తవం. అక్కడి పరిస్థితులకు త్వరగా అలవాటు పడి ఉంటే వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోయే వాళ్లం కాదు' అని గంభీర్ చెప్పుకొచ్చాడు. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో తప్పులను సరిదిద్దుకుని విజయాలు సాధిస్తామని గౌతీ ఆశాభావం వ్యక్తం చేశాడు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story