టీమిండియా @ 300.. టీ20ల్లో టార్గెట్ స్కోర్ ఫిక్స్ చేసిన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్..!
T20 cricket records: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పొట్టి క్రికెట్‌లో సరికొత్త లక్ష్యాన్ని నిర్దేశించారు.
టీమిండియా @ 300.. టీ20ల్లో టార్గెట్ స్కోర్ ఫిక్స్ చేసిన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్..!
T20 cricket records: అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో సరికొత్త రికార్డులను సృష్టించేందుకు భారత క్రికెట్ జట్టు (Indian Cricket Team) సిద్ధమవుతోంది. ఇప్పటివరకు టీమిండియా అత్యధికంగా 297 పరుగులు సాధించిన రికార్డు ఉంది. గత 2024 సంవత్సరంలో బంగ్లాదేశ్ (Bangladesh) జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఈ స్కోరు నమోదైంది. అదే ఏడాది సౌతాఫ్రికా (South Africa) గడ్డపై కూడా ఒక వికెట్ నష్టపోయి 283 పరుగుల భారీ స్కోరును సాధించారు. గురువారం రోజున అఫ్గానిస్తాన్ (Afghanistan) జట్టుతో జరిగిన ఆఖరి టీ20 పోరులో అభిషేక్ శర్మ (Abhishek Sharma) కేవలం 30 బంతుల్లోనే శతకం సాధించడంపై కోచ్ గంభీర్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవర్ ప్లే లోనే వంద పరుగులు సాధించడం తమ కోచింగ్ కాలంలోనే ఇదే తొలిసారని, ఇది అతిపెద్ద సానుకూల పరిణామమని పేర్కొన్నారు. ఆటగాళ్లు దూకుడుగా ఆడుతుంటే అదే జోరును కొనసాగించాలనే స్పష్టమైన సందేశాన్ని డ్రెస్సింగ్ రూమ్‌కు ఇచ్చామని ఆయన వెల్లడించారు.
డ్రెస్సింగ్ రూమ్‌లో వ్యక్తిగత మైలురాళ్ల కంటే మ్యాచ్ పై చూపే ప్రభావానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని గంభీర్ స్పష్టం చేశారు. కేవలం పరుగులు లేదా వికెట్ల గురించి ఆలోచించకుండా మ్యాచ్ ఫలితాన్ని ఎంతవరకు ప్రభావితం చేయవచ్చనేదే తమ ప్రధాన తత్వమని ఆయన తెలిపారు. గత రెండేళ్లుగా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నామని పేర్కొన్నారు. అఫ్గానిస్తాన్ మ్యాచ్‌లో అద్భుతమైన ఆరంభం లభించినప్పటికీ ఆఖరి ఐదు ఓవర్లలో తడబడి 221 పరుగులకే పరిమితం కావాల్సి వచ్చిందని గుర్తుచేశారు. జట్టులో ఉన్న ఆటగాళ్ల సత్తాకు తగ్గట్టుగా భవిష్యత్తులో 300 పరుగుల మార్క్‌ను తాకడమే తమ తదుపరి టార్గెట్ అని ఆయన స్పష్టం చేశారు.




