Team India: ఐర్లాండ్‌పై చెత్త ప్రదర్శన.. భారత్ ఓటములకు రెండు ప్రధాన కారణాలు ఇవే!
Team India: టీమిండియా ఫలితాలపై భారత క్రికెట్ దిగ్గజం, ప్రముఖ వ్యాఖ్యాత సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు.
Team India: ఐర్లాండ్‌పై చెత్త ప్రదర్శన.. భారత్ ఓటములకు రెండు ప్రధాన కారణాలు ఇవే!
Team India: ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా అనూహ్యంగా 2-0తో క్లీన్ స్వీప్‌కు గురికావడం భారత క్రికెట్‌లో తీవ్ర చర్చకు దారితీసింది. కొత్త టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు ఇదే తొలి సిరీస్ కాగా.. ఆరంభంలోనే పరాజయం ఎదురైంది. ఈ సిరీస్‌కు ముందు వరకు భారత్ ఒక్కసారి కూడా ఐర్లాండ్ చేతిలో టీ20 మ్యాచ్ ఓడిపోలేదు. అయితే వరుసగా రెండు మ్యాచ్‌లు కోల్పోవడంతో పాటు సిరీస్‌ను కూడా చేజార్చుకుంది. ఈ ఫలితాలపై భారత క్రికెట్ దిగ్గజం, ప్రముఖ వ్యాఖ్యాత సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు. భారత క్రికెట్ చరిత్రలో అత్యంత నిరాశకరమైన సందర్భాల్లో ఇదొకటని అభివర్ణించాడు.
అతివిశ్వాసం, నిర్లక్ష్యమే ప్రధాన కారణాలు:
స్పోర్ట్‌స్టార్‌లో రాసిన తన కాలమ్‌లో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. ఐర్లాండ్ అద్భుతమైన క్రికెట్ ఆడిందని కాకుండా, భారత ఆటగాళ్ల అతివిశ్వాసం, నిర్లక్ష్య ధోరణే ఓటమికి కారణమైందని పేర్కొన్నాడు. 'ఒక మ్యాచ్ ఓడిపోవడం వేరు. కానీ ఐర్లాండ్ వంటి పసికూన చేతిలో సిరీస్ కోల్పోవడం దారుణం. భారత క్రికెట్‌లో అత్యంత చెత్త ఫలితాల్లో ఇది ఒకటి. ఐర్లాండ్ అసాధారణంగా ఆడితే బాధ కొంత తగ్గేది. కానీ భారత ఆటగాళ్ల ఓవర్ కాన్ఫిడెన్స్, క్యాజువల్ యాటిట్యూడ్ వల్లే ఈ పరిస్థితి వచ్చింది' అని గవాస్కర్ మండిపడ్డాడు.
1983 వరల్డ్‌కప్ ఫైనల్‌తో పోలిక:
ఈ పరాజయాన్ని 1983 ప్రపంచకప్ ఫైనల్‌లో వెస్టిండీస్ బ్యాటర్ల వైఖరితో గవాస్కర్ పోల్చాడు. ఆ మ్యాచ్‌లో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు కెప్టెన్ కపిల్ దేవ్ అద్భుత క్యాచ్‌తో వివ్ రిచర్డ్స్‌ను ఔట్ చేశారని గుర్తు చేశాడు. వెస్టిండీస్ బ్యాటర్లు అతివిశ్వాసంతో వికెట్లు కోల్పోయినట్లే, ఐర్లాండ్ సిరీస్‌లో భారత బ్యాటర్లు కూడా అదే తప్పు చేశారని సన్నీ అభిప్రాయపడ్డాడు.
పరిస్థితులకు తగ్గట్టుగా ఆడలేకపోయిన బ్యాటర్లు:
రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ లక్ష్య ఛేదనకు దిగింది. తొలి టీ20లో 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 34 పరుగుల తేడాతో ఓడిపోగా, రెండో మ్యాచ్‌లో 155 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో కేవలం ఒక్క పరుగు తేడాతో పరాజయం పాలైంది. ఐర్లాండ్‌లోని పిచ్‌లు అదనపు బౌన్స్, స్వింగ్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ భారత బ్యాటర్లు పరిస్థితులకు అనుగుణంగా తమ ఆటతీరును మార్చుకోలేకపోయారని గవాస్కర్ పేర్కొన్నాడు.
పరిస్థితులకు తగ్గ ఆట అవసరం:
'క్రికెట్‌లో పరిస్థితులను బట్టి ఆడటం అత్యంత కీలకం. కానీ భారత బ్యాటర్లు తమ ఇమేజ్‌కు తగ్గట్టే దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించారు. అదనపు బౌన్స్, స్వింగ్ ఉన్న పిచ్‌లపై ఓర్పుతో బ్యాటింగ్ చేయాల్సిన సమయంలో షాట్లకు వెళ్లి మంచి బౌలింగ్, అద్భుతమైన క్యాచ్‌లకు బలయ్యారు' అని గవాస్కర్ విశ్లేషించాడు. టీ20 ప్రపంచకప్ 2026 విజయానంతరం ఆధిపత్యాన్ని కొనసాగించాలని భావించిన టీమిండియాకు ఐర్లాండ్ పర్యటన భారీ ఎదురుదెబ్బగా మారింది. ఈ సిరీస్ ద్వారా విదేశీ పరిస్థితుల్లో భారత బ్యాటింగ్‌లో ఉన్న లోపాలు మరోసారి బయటపడ్డాయి.




