Glenn Maxwell: అంతర్జాతీయ క్రికెట్‌కు గ్లెన్ మాక్స్వెల్ గుడ్‌బై.. 14 ఏళ్ల సుదీర్ఘ 'బిగ్ షో' కెరీర్‌కు తెర!
Glenn Maxwell: ఆస్ట్రేలియా విధ్వంసకర ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు.
Glenn Maxwell: అంతర్జాతీయ క్రికెట్‌కు గ్లెన్ మాక్స్వెల్ గుడ్‌బై.. 14 ఏళ్ల సుదీర్ఘ 'బిగ్ షో' కెరీర్‌కు తెర!
Glenn Maxwell Retirement: ఆస్ట్రేలియా విధ్వంసకర ఆల్‌రౌండర్, 'బిగ్ షో' గ్లెన్ మాక్స్వెల్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. మైదానంలో తన ధనాధన్ బ్యాటింగ్, మెరుపు ఫీల్డింగ్, అవసరమైన సమయాల్లో వికెట్లు తీసే స్పిన్ బౌలింగ్‌తో కోట్లాదిమంది అభిమానులను అలరించిన మాక్స్వెల్, తన 14 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌కు తెరదించారు. ఫైనల్ వర్డ్ అనే ప్రముఖ స్పోర్ట్స్ పాడ్‌కాస్ట్‌లో ఆయన స్వయంగా ఈ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించారు. అంతర్జాతీయ పోటీలతో పాటు విక్టోరియా జట్టు తరఫున ఆడే దేశవాళీ 50 ఓవర్లు మరియు నాలుగు రోజుల రెడ్ బాల్ మ్యాచ్‌ల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు తెలిపారు.
మాక్స్వెల్ అంతర్జాతీయ కెరీర్
ఆస్ట్రేలియా తరఫున మొత్తం 286 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన మాక్స్వెల్ 7,226 పరుగులు చేయడంతో పాటు 136 వికెట్లు పడగొట్టారు.
వన్డేలు : 149 మ్యాచ్‌లలో 3,990 పరుగులు.
టీ20లు : 130 మ్యాచ్‌లలో 2,897 పరుగులు.
టెస్టులు : 7 మ్యాచ్‌లు ఆడి ఒక శతకం సాధించారు.
ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో మూడు అతిపెద్ద ప్రపంచకప్ విజయాల్లో 2015 వన్డే వరల్డ్ కప్, 2021 టీ20 వరల్డ్ కప్ , 2023 వన్డే వరల్డ్ కప్‌లలో గ్లెన్ మాక్స్వెల్ కీలక పాత్ర పోషించి ఆస్ట్రేలియాను విశ్వవిజేతగా నిలిపారు. మాక్స్వెల్ కెరీర్లో అత్యంత చిరస్మరణీయమైన ఘట్టం 2023 వన్డే ప్రపంచకప్‌లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆఫ్ఘనిస్థాన్‌పై ఆడిన చారిత్రాత్మక ఇన్నింగ్స్. 292 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. ఆ సమయంలో తీవ్రమైన కండరాల నొప్పులతో బాధపడుతూ, సరిగ్గా నిలబడలేని స్థితిలో కూడా మాక్స్వెల్ మైదానంలో పోరాడి 128 బంతుల్లో 201 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. అందులో 21 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి.
నాయకుడు ప్యాట్ కమిన్స్‌తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 202 పరుగుల అద్భుత రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఆస్ట్రేలియాకు ఊహించని విజయాన్ని అందించారు. ఈ ఇన్నింగ్స్ వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఒకటిగా నిలిచిపోయింది. 2025లోనే వన్డేలకు వీడ్కోలు పలికిన మాక్స్వెల్, 2026 ప్రారంభంలో జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా తరఫున తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నప్పటికీ.. ఐపీఎల్ సహా ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ ఫ్రాంచైజ్ టీ20 లీగ్‌లలో మాత్రం ఆయన తన ధనాధన్ బ్యాటింగ్‌తో అలరించడం కొనసాగించనున్నారు.




