Sunrisers Hyderabad: సన్‌రైజర్స్‌ ఓటమితో మారిన ప్లేఆఫ్స్‌ లెక్కలు

Sunrisers Hyderabad: అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో సన్‌రైజర్స్‌పై భారీ విజయం సాధించింది.

Naresh.k
Published on: 13 May 2026 7:28 AM IST
Sunrisers Hyderabad
X

Sunrisers Hyderabad: సన్‌రైజర్స్‌ ఓటమితో మారిన ప్లేఆఫ్స్‌ లెక్కలు

GT vs SRH : అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ పోరులో గుజరాత్ టైటాన్స్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై ఘోర విజయాన్ని నమోదు చేసింది. అటు బౌలింగ్‌లోనూ, ఇటు బ్యాటింగ్‌లోనూ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన హైదరాబాద్‌, 82 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లడమే కాకుండా, ప్లేఆఫ్స్ బెర్త్‌ను దాదాపుగా ఖాయం చేసుకుంది.

టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో మొదట బ్యాటింగ్ చేపట్టిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్ తమ అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించారు. సాయి సుదర్శన్ 44 బంతుల్లో 61 పరుగులు చేసి ఆకట్టుకోగా, వాషింగ్టన్ సుందర్ 33 బంతుల్లో 50 పరుగులతో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. యువ బ్యాటర్ నితీష్ సింధూ కూడా కీలకమైన 22 పరుగులు జోడించాడు. హైదరాబాద్ బౌలర్లలో ప్రఫుల్ హింగే, షకీబ్ హుస్సేన్ రెండేసి వికెట్లు తీసి రాణించగా, కెప్టెన్ పాట్ కమిన్స్ పొదుపుగా బౌలింగ్ చేస్తూ ఒక వికెట్ దక్కించుకున్నాడు.

అనంతరం 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ మొదటి నుంచీ పేకమేడలా కూలిపోయింది. గుజరాత్ బౌలర్ల ధాటికి హైదరాబాద్ బ్యాటర్లు ఏ దశలోనూ నిలదొక్కుకోలేకపోయారు. ట్రావిస్ హెడ్ డకౌట్ కాగా, అభిషేక్ శర్మ తక్కువ పరుగులకే వెనుదిరిగాడు. ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ వంటి కీలక ఆటగాళ్లు కూడా చేతులెత్తేయడంతో 14.5 ఓవర్లకే హైదరాబాద్ కేవలం 86 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. విశేషమేమిటంటే, ఆ జట్టులో ఏ ఒక్క బ్యాటర్ కూడా 20 పరుగుల మార్కును దాటలేకపోయాడు. చివర్లో కెప్టెన్ పాట్ కమిన్స్ చేసిన 19 పరుగులే జట్టులో అత్యధిక స్కోరుగా నిలిచింది.

గుజరాత్ బౌలర్లలో కగిసో రబడా, జేసన్ హోల్డర్ నిప్పులు చెరిగే బంతులతో హైదరాబాద్ నడ్డి విరిచారు. రబడా, హోల్డర్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా, ప్రసిద్ధ్ కృష్ణ రెండు వికెట్లు సాధించాడు. మహ్మద్ సిరాజ్ తొలి ఓవర్‌లోనే వికెట్ తీసి సన్‌రైజర్స్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. రషీద్ ఖాన్ సైతం ఒక వికెట్ సాధించి తన వంతు సహకారాన్ని అందించాడు.

ఈ ఓటమి సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్ అవకాశాలను క్లిష్టతరం చేసింది. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ 7 విజయాలతో మూడో స్థానంలో ఉంది. మరోవైపు, వరుసగా ఐదో విజయాన్ని అందుకున్న గుజరాత్ టైటాన్స్ 16 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా నిలిచి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. సన్‌రైజర్స్ తన తదుపరి మ్యాచ్‌ల్లో బ్యాటింగ్ లోపాలను సరిదిద్దుకుంటేనే ప్లేఆఫ్స్ రేసులో పటిష్టంగా నిలవగలదు.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story