Gurnoor Brar: కెరీర్ ఆరంభంలోనే గుర్నూర్ బ్రార్ చెత్త రికార్డు.. మరీ ఇంత దారుణమా!
Gurnoor Brar: India pacer Gurnoor Brar conceded 97 runs in 10 overs. 10 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా తీయకుండా 97 పరుగులు సమర్పించుకున్న మూడో బౌలర్‌గా గుర్నూర్ బ్రార్ నిలిచాడు.
Gurnoor Brar: కెరీర్ ఆరంభంలోనే గుర్నూర్ బ్రార్ చెత్త రికార్డు.. మరీ ఇంత దారుణమా!
Gurnoor Brar: లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. నిర్ణీత 50 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 387 పరుగుల భారీ స్కోరు చేసింది. దీంతో భారత్ ముందు 388 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. వన్డేల్లో భారత్‌పై ఇంగ్లండ్ సాధించిన అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం. అంతేకాదు లార్డ్స్ మైదానంలో వన్డే చరిత్రలో కూడా ఇదే అత్యధిక టీమ్ స్కోరుగా నమోదైంది.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ బెన్ డకెట్ భారీ శతకంతో (141) చెలరేగాడు. మరో ఓపెనర్ జాకబ్ బెతెల్ 91 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. జో రూట్ కూడా తన ఫామ్ కంటిన్యు చేస్తూ.. 74 పరుగులు చేశాడు. చివర్లో జోస్ బట్లర్ కేవలం 13 బంతుల్లో 41 పరుగులు చేసి భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ నలుగురు బ్యాటర్లు టీమిండియా బౌలింగ్‌ను చీల్చి చెందడంతో ఇంగ్లండ్ భారీ స్కోరు నమోదు చేసింది. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ రెండు వికెట్లు పడగొట్టగా.. ప్రిన్స్ యాదవ్ ఒక వికెట్ తీశాడు. మిగతా బౌలర్లు ఇంగ్లండ్ బ్యాటర్ల దూకుడును అడ్డుకోలేకపోయారు.
ఈ మ్యాచ్‌లో భారత యువ పేసర్ గుర్నూర్ బ్రార్ పేరిట ఓ చెత్త రికార్డు నమోదైంది. తన 10 ఓవర్ల కోటాలో ఒక్క వికెట్ కూడా తీయకుండా 97 పరుగులు సమర్పించుకున్నాడు. దాంతో వన్డేల్లో అతడిక రన్స్ ఇచ్చిన భారత మూడో బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఈ జాబితాలో స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ మొదటి స్థానంలో ఉన్నాడు. 2015లో వాంఖడేలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భువి 10 ఓవర్లలో 106 పరుగులు ఇచ్చాడు. 2013లో ఆస్ట్రేలియాపై బెంగళూరులో మాజీ పేసర్ వినయ్ కుమార్ 9 ఓవర్లలో 102 పరుగులు ఇచ్చి రెండో స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు గుర్నూర్ బ్రార్ 97 పరుగులు ఇచ్చి ఆ జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు.
అంతేకాదు లార్డ్స్ మైదానంలో వన్డే చరిత్రలో అత్యంత చెత్త బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా కూడా గుర్నూర్ బ్రార్ నిలిచాడు. 1975లో ఇంగ్లండ్‌పై భారత మాజీ బౌలర్ కర్సన్ ఘావ్రీ 11 ఓవర్లలో 81 పరుగులు ఇవ్వగా.. దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత ఆ రికార్డును గుర్నూర్ బ్రార్ చెరిపేశాడు. లార్డ్స్ వంటి ప్రతిష్ఠాత్మక వేదికపై, అందులోనూ కెరీర్ ఆరంభంలోనే ఈ చెత్త రికార్డు నమోదవడం అతనికి నిరాశ కలిగించే అంశం. ఇక ఇప్పుడు 388 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలంటే భారత బ్యాటర్లు అసాధారణ ప్రదర్శన చేయాల్సి ఉంది.
వన్డేలో అత్యధిక రన్స్ ఇచ్చిన భారత బౌలర్ లిస్ట్:
1/106 (10) భువనేశ్వర్ కుమార్ vs దక్షిణాఫ్రికా, వాంఖడే 2015
1/102 (9) వినయ్ కుమార్ vs ఆస్ట్రేలియా, బెంగళూరు 2013
0/97 (10) గుర్నూర్ బ్రార్ vs ఇంగ్లాండ్, లార్డ్స్ 2026
1/92 (10) భువనేశ్వర్ కుమార్ vs న్యూజిలాండ్, కాన్పూర్ 2017




