Gurnoor Brar: చెడు సోపతులకు దూరంగా ఉండేదుకు 17 ఏళ్లకు బంతి పట్టాడు.. అప్పుడే టీమిండియాకు ఎంపికయ్యాడు!

Gurnoor Brar's Inspiring Journey. భారత క్రికెట్‌లో మరో ఆసక్తికరమైన విజయగాథ వెలుగులోకి వచ్చింది.

Rishvik
Published on: 10 Jun 2026 7:46 PM IST
Gurnoor Brars Inspiring Journey: Started Cricket at 17, Earns India Call-Up at 26
X

Gurnoor Brar: చెడు సోపతులకు దూరంగా ఉండేదుకు 17 ఏళ్లకు బంతి పట్టాడు.. అప్పుడే టీమిండియాకు ఎంపికయ్యాడు!

Gurnoor Brar: భారత క్రికెట్‌లో మరో ఆసక్తికరమైన విజయగాథ వెలుగులోకి వచ్చింది. సాధారణంగా 9 లేదా 10 ఏళ్ల వయసులోనే చాలా మంది క్రికెట్ అకాడమీల్లో చేరి కెరీర్ ప్రారంభిస్తారు. అయితే 17 ఏళ్ల వయసులో క్రికెట్‌ను మొదలుపెట్టి.. కేవలం తొమ్మిదేళ్లలోనే భారత జాతీయ జట్టు ఎంపిక దాకా వచ్చాడు. అతడే.. పేసర్ గుర్నూర్ బ్రార్. క్రికెట్ ఆడడం తన కల కాదు.. చెడు సోపతులకు దూరంగా ఉండేదుకు తండ్రి చెప్పిన మాటకు విలువిచ్చి 17 ఏళ్లకు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. గుర్నూర్ బ్రార్ స్టోరీ ఏంటో ఓసారి తెలుసుకుందాం.

పంజాబ్‌లోని చండీగఢ్‌కు చెందిన గుర్నూర్ బ్రార్ తండ్రి సుఖ్‌బీర్ సింగ్ బ్రార్ పంజాబ్ పోలీస్ విభాగంలో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఎస్ఐ). తన కుమారుడు యుక్త వయసులోకి అడుగుపెడుతున్న సమయంలో చదువుతో పాటు ఏదైనా క్రీడలో పాల్గొంటే చెడు స్నేహితుల ప్రభావం నుంచి దూరంగా ఉంటాడని భావించారు. ఈ క్రమంలోనే గుర్నూర్‌ను క్రికెట్‌లో చేరేలా ప్రోత్సహించారు. 11వ తరగతి చదువుతున్న సమయంలో గుర్నూర్ క్రికెట్‌ను సీరియస్‌గా తీసుకున్నాడు. చాంప్స్ అకాడమీలో కోచ్ రవి మార్గదర్శకత్వంలో శిక్షణ ప్రారంభించిన తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. ప్రస్తుతం 26 ఏళ్ల వయసులో భారత టెస్ట్, వన్డే జట్లలో చోటు సంపాదించాడు. ఇక అంతర్జాతీయ అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నాడు.

గుర్నూర్ బ్రార్ ఎంపిక వార్తతో అతడి కుటుంబం భావోద్వేగానికి గురైంది. అఫ్గానిస్థాన్ సిరీస్‌కు భారత జట్టు ప్రకటించిన రోజు కుటుంబ సభ్యులు స్వగ్రామంలో ఉన్నారు. తల్లి ఫోన్ చేసి జట్టు ప్రకటన గురించి అడగగా.. 'అవును అమ్మా.. నేను ఎంపికయ్యాను' అని సాదాసీదాగా చెప్పి ఫోన్ పెట్టేశాడని తండ్రి సుఖ్‌బీర్ గుర్తు చేసుకున్నారు. తన కుమారుడు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే వ్యక్తి అని, ఎలాంటి విషయాన్నీ అతిగా సంబరపడకుండా సాదాసీదా స్వభావం కలవాడని చెప్పారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. గుర్నూర్ బ్రార్ మొదట బాస్కెట్‌బాల్ ఆడేందుకు ప్రయత్నించాడు. పొడవైన శరీరాకృతి ఉండటంతో తండ్రి తనలాగే బాస్కెట్‌బాల్‌లో రాణించాలని భావించారు. అయితే కొన్ని వారాల తర్వాత తనకు ఆ ఆటపై ఆసక్తి లేదని చెప్పడంతో క్రికెట్ వైపు వచ్చాడు. డీఏవీ కాలేజీ తరఫున అంతర్ కళాశాల టోర్నీలో అద్భుత ప్రదర్శనతో గుర్నూర్‌కు తొలి గుర్తింపు వచ్చింది. సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకుని.. అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత పంజాబ్ క్రికెట్‌లో అవకాశాలు అందిపుచ్చుకుంటూ ఎదిగాడు.

6 అడుగుల 5 అంగుళాల ఎత్తు, వేగంతో పాటు అదనపు బౌన్స్ రాబట్టే సామర్థ్యం గుర్నూర్ ప్రత్యేకత. బంగ్లాదేశ్ పేసర్ నాహిద్ రాణా బౌలింగ్‌ శైలిని పోలి ఉండడంతో.. భారత జట్టు నెట్స్‌లో మొదట అతడికి అవకాశం వచ్చింది. అనంతరం ఆస్ట్రేలియా-ఏ, దక్షిణాఫ్రికా-ఏ జట్లపై అద్భుత ప్రదర్శనలతో జాతీయ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఐపీఎల్‌లో పెద్దగా మ్యాచ్‌లు ఆడకపోయినా.. గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా తనకు ఎంతో మద్దతు ఇచ్చారని గుర్నూర్ కుటుంబం తెలిపింది. కగిసో రబడా, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి అంతర్జాతీయ స్థాయి బౌలర్ల నుంచి నేర్చుకోవాలని నెహ్రా ఎప్పుడూ ప్రోత్సహించేవాడని చెప్పారు.

ఐపీఎల్ ద్వారా వచ్చిన డబ్బు కూడా గుర్నూర్ వ్యక్తిత్వాన్ని మార్చలేదని అతడి తండ్రి గర్వంగా చెబుతున్నారు. పంజాబ్ కింగ్స్ నుంచి రూ.20 లక్షలు అందుకున్న తర్వాత 'నాన్నా, నేను కారు కొనొచ్చా?' అని అడిగాడని, తన సంపాదన కావడంతో స్వేచ్ఛగా కొనమని చెప్పానని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం గుర్నూర్ బ్రార్ భారత్-ఏ జట్టుతో కలిసి శ్రీలంక పర్యటనకు వెళ్లాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టకముందే తన క్రమశిక్షణ, వినయంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన ఈ యువ పేసర్.. భవిష్యత్తులో భారత జట్టుకు కీలక ఆయుధంగా మారే అవకాశాలు లేకపోలేదు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story