Harbhajan Singh Biopic: బయోపిక్‌కు గ్రీన్ సిగ్నల్.. అదే టైటిల్, ఆ హీరోనే కావాలంటున్న హర్భజన్!

Harbhajan Singh Biopic. టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన బయోపిక్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

Rishvik
Published on: 14 Aug 2026 6:32 PM IST
Harbhajan Singh Biopic
X

Harbhajan Singh Biopic: బయోపిక్‌కు గ్రీన్ సిగ్నల్.. అదే టైటిల్, ఆ హీరోనే కావాలంటున్న హర్భజన్!

Harbhajan Singh Biopic: టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన బయోపిక్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. తన జీవిత కథ ఆధారంగా బయోపిక్ తెరకెక్కితే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపాడు. అంతేకాదు తన పాత్రను బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ పోషిస్తేనే బాగుంటుందని మనసులోని మాటను సూటిగా వెల్లడించాడు. తన బయోపిక్‌కు ‘జజ్బా’ (Passion) అనే టైటిల్ కూడా పెట్టాలని హర్భజన్ సూచించాడు. రెండు దశాబ్దాలకు పైగా సాగిన క్రికెట్ ప్రయాణం, కుటుంబం చేసిన త్యాగాలు, మైదానంలో దూకుడు, వ్యక్తిగత జీవితంలోని అనుభవాలు వెండితెరపైకి వస్తే.. హర్భజన్ బయోపిక్ ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది.

క్రికెట్ కెరీర్‌లో హర్భజన్ సింగ్ ఎన్నో అరుదైన ఘనతలు సాధించాడు. భారత్ తరఫున 100 టెస్టులు ఆడిన క్రికెటర్లలో ఒకడిగా ఉన్న భజ్జీ.. టెస్టుల్లో 400కు పైగా వికెట్లు తీసుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో భారత్ తరఫున హ్యాట్రిక్ సాధించిన తొలి బౌలర్‌గా కూడా రికార్డు సృష్టించాడు. అయితే తన విజయాలన్నింటినీ వ్యక్తిగత ప్రతిభగా భావించనని హర్భజన్ చెప్పాడు. ‘జీవితంలో మనం ఏదైనా సాధించినప్పుడు.. అది మన వల్లే జరిగిందని అనుకుంటాం. కానీ ప్రతి విషయం భగవంతుడి అనుగ్రహంతోనే జరుగుతుంది. ఆయన అనుమతి లేకుండా ఒక ఆకు కూడా కదలదు’ అని హర్భజన్ పేర్కొన్నాడు. తన జీవితంపై తనకు ఉన్న దృక్పథాన్ని ప్రతిబింబించేలా తాను రాసుకున్న ఓ ఉర్దూ కవితను కూడా ఈ సందర్భంగా వెల్లడించాడు.

తన క్రికెట్ కెరీర్‌లో సాధించిన విజయాల వెనుక తల్లిదండ్రులు, సోదరీమణుల త్యాగాలు ఎంతో ఉన్నాయని హర్భజన్ గుర్తు చేసుకున్నాడు. 'నా తండ్రి సర్దార్ సర్దేవ్ సింగ్ చిన్న వ్యాపారం చేసేవారు. 2000లో ఆయన మరణించారు. మా అమ్మ అవ్తార్ కౌర్ కుటుంబాన్ని చూసుకోవడంతో పాటు నా క్రికెట్ కలను నెరవేర్చేందుకు ఎంతో కష్టపడ్డారు. నా ఐదుగురు సోదరీమణులు చేసిన త్యాగాలు ఎన్నో ఉన్నాయి' అని హర్భజన్ ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నాడు. క్రికెట్ మైదానంలో దూకుడుగా వ్యవహరించే ఆటగాడిగా హర్భజన్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రత్యర్థులతో మాటకు మాట, ఆటకు ఆట అంటూ పోరాడే స్వభావం అతడిది. అయితే మైదానం బయట మాత్రం సంబంధాలను కాపాడుకోవడానికి.. అవసరమైతే ఓడిపోవడానికి కూడా సిద్ధంగా ఉంటానని భజ్జీ చెప్పాడు. ఒక బంధాన్ని కాపాడుకోవడానికి కొన్నిసార్లు వాదనలో ఓడిపోవడమే అసలైన గెలుపు అని పేర్కొన్నాడు.

'మైదానంలో కనిపించిన ఆ దూకుడైన హర్భజనే నా అసలైన వ్యక్తిత్వం. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత నా భార్య, పిల్లలతో జీవితాన్ని ఆస్వాదిస్తున్నా. క్రికెట్ నాకు ఎన్నో విషయాలు నేర్పింది. జీవితంలో వినయంగా ఉండటం ఎంతో ముఖ్యం. నన్ను కేవలం క్రికెట్ రికార్డుల ఆధారంగా ఎవరూ అంచనా వేయకూడదు. నేను మంచి మనిషిగా ఉండలేకపోతే నా జీవితానికి అర్థం లేదు. ఎన్ని వికెట్లు తీశాడన్నది కాదు.. మంచి వ్యక్తిగా జీవించాడని అందరూ చెప్పాలి. అదే నా కోరిక' అని భజ్జీ తెలిపాడు. హర్భజన్ టెస్టు క్రికెట్‌లో 103 మ్యాచ్‌లు ఆడి 417 వికెట్లు సాధించాడు.

'నా జీవితంపై బయోపిక్ తెరకెక్కితే బాగుంటుంది. నా పాత్రను పోషించేందుకు బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ సరైన వ్యక్తి. విక్కీ పంజాబీ నేపథ్యానికి చెందినవాడు. హోషియార్‌పూర్ ప్రాంతంతో అతడికి సంబంధం ఉంది. అదీకాకుండా విక్కీ అద్భుతమైన నటుడు. నా బయోపిక్‌కు జజ్బా అని పేరు పెడితే బాగుటుంది. జజ్బా అంటే ఆసక్తి, పట్టుదల, ఉత్సాహం అని అర్థం. ఈ పేరు నా క్రికెట్ ప్రయాణానికి సరిగ్గా సరిపోతుందని చెప్పొచ్చు' అని హర్భజన్ చెప్పాడు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story