Hardik Pandya: ఐపీఎల్ 2026లో ఫ్లాప్ షో.. హార్దిక్ పాండ్యా షాకింగ్ నిర్ణయం!
Hardik Pandya: ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు.
Hardik Pandya: ఐపీఎల్ 2026లో ఫ్లాప్ షో.. హార్దిక్ పాండ్యా షాకింగ్ నిర్ణయం!
Hardik Pandya: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ పూర్తిగా నిరాశపర్చింది. ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై.. ఈసారి పాయింట్ల పట్టికలో 9వ స్థానంతో టోర్నీని ముగించింది. లెగ్ దశలో 14 మ్యాచ్‌లలో కేవలం నాలుగు విజయాలు మాత్రమే సాధించింది. కనీసం ప్లేఆఫ్స్‌కు కూడా అర్హత సాధించలేకపోవడంతో అభిమానులను తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ నిరాశకర సీజన్ అనంతరం ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. హార్దిక్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను డిలీట్ చేశాడు. ఈ ఘటన అభిమానులను షాక్‌కు గురి చేసింది. ముంబై సారథి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.
బుధవారం సాయంత్రం నుంచి హార్దిక్ పాండ్యా ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ ఓపెన్ అవ్వడం లేదు. 'Sorry, this page isn't available' అనే మెసేజ్ కనిపిస్తోంది. కోట్లాది ఫాలోవర్లు ఉన్న హార్దిక్ అకౌంట్ అకస్మాత్తుగా కనిపించకపోవడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ ఘోర ప్రదర్శన తర్వాతే ఈ పరిణామం చోటుచేసుకోవడం మరింత చర్చనీయాంశంగా మారింది. విమర్శల ఒత్తిడితోనే హార్దిక్ ఈ నిర్ణయం తీసుకున్నాడని కొందరు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇది తాత్కాలికంగా అకౌంట్ డియాక్టివేట్ చేసి ఉండొచ్చని మరికొందరు భావిస్తున్నారు.
వ్యక్తిగతంగా కూడా హార్దిక్ పాండ్యాకు ఈ సీజన్ అంతగా కలిసి రాలేదు. ఎనిమిది ఇన్నింగ్స్‌లలో కేవలం 146 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లో కూడా పేలవ ప్రదర్శనతో మూడు వికెట్లు మాత్రమే తీశాడు. కొన్ని మ్యాచ్‌లలో ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నాడు. సారథిగా మైదానంలో హుందాగా వ్యవహరించాల్సింది పోయి.. ఆటగాళ్లపై అరిచాడు. అతడి ముఖంలో నిరాశ స్పష్టంగా కనిపించింది. కెప్టెన్‌గా జట్టును విజయవంతంగా నడిపించలేకపోవడంతో పాటు వ్యక్తిగత ప్రదర్శనలోనూ విఫలమవడంతో హార్దిక్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. అభిమానులు సహా మాజీలు కూడా మండిపడ్డారు. గత సీజన్ నుంచే ముంబై అభిమానుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటున్న హార్దిక్‌కు ఈ సీజన్ మరింత కఠినంగా మారింది.
మాజీ భారత క్రికెటర్ వసీం జాఫర్ కూడా హార్దిక్ కెప్టెన్సీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే సీజన్‌లో హార్దిక్‌ను కెప్టెన్‌గా కొనసాగించకూడదని, అయితే జట్టులో మాత్రం తప్పకుండా ఉంచాలని అభిప్రాయపడ్డారు. ‘హార్దిక్‌ను నేను కెప్టెన్‌గా కొనసాగించను. కానీ అతడిని తప్పకుండా రిటైన్ చేయాలి. అతడు పూర్తిగా తన ఆటపై దృష్టి పెట్టేలా అవకాశం ఇవ్వాలి. అప్పుడే అతడి నుంచి బెస్ట్ బయటకు వస్తుంది’ అని జాఫర్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నాడు. హార్దిక్‌కు బదులుగా ముంబై కొత్త కెప్టెన్ ఎవరనే ప్రశ్నకు కూడా జాఫర్ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఆ స్థానానికి సరైన ఎంపికను చెప్పడం కష్టమన్నారు. మరోవైపు రోహిత్ శర్మను మళ్లీ కెప్టెన్‌గా తీసుకురావాలన్న డిమాండ్ కూడా సోషల్ మీడియాలో పెరుగుతోంది. 2013 నుంచి 2023 వరకు ముంబై ఇండియన్స్‌ను ఐదు టైటిళ్ల దిశగా నడిపించిన రోహిత్ స్థానంలో హార్దిక్‌ను కెప్టెన్‌గా నియమించిన తర్వాత జట్టు పూర్తిగా తడబడుతోంది.
ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో చివరి లీగ్ మ్యాచ్‌లో 30 పరుగుల తేడాతో ఓడిపోయిన ముంబై ఇండియన్స్.. టోర్నీని 10 ఓటములతో ముగించింది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన ముంబై.. ఇలా పతనం కావడం అభిమానులను కలవరపెడుతోంది. ఇప్పుడు హార్దిక్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ కావడం మరింత చర్చకు దారితీసింది. వచ్చే సీజన్‌కు ముందు ముంబై ఎలాంటి మార్పులు చేస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది.




