Hardik Pandya: పాండ్యపై కన్నేసిన రెండు ఐపీఎల్ టీమ్స్.. కళ్లుచెదిరే ప్రైజ్ ఆఫర్!

Hardik Pandya: హార్దిక్ పాండ్య మరోసారి ఐపీఎల్ ట్రేడ్ మార్కెట్‌లో హాట్ టాపిక్‌గా మారాడు.

Rishvik
Published on: 23 Jun 2026 7:43 PM IST
Hardik Pandya
X

Hardik Pandya: పాండ్యపై కన్నేసిన రెండు ఐపీఎల్ టీమ్స్.. కళ్లుచెదిరే ప్రైజ్ ఆఫర్!

Hardik Pandya Trade Deal: భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య మరోసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ట్రేడ్ మార్కెట్‌లో హాట్ టాపిక్‌గా మారాడు. ముంబై ఇండియన్స్ (ఎంఐ) కెప్టెన్‌గా కొనసాగుతున్న పాండ్య భవిష్యత్తుపై ఊహాగానాలు జోరందుకున్నాయి. తాజా నివేదికల ప్రకారం.. ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు పాండ్యను దక్కించుకోవడానికి రెండు ప్రముఖ ఫ్రాంచైజీలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. షారుఖ్ ఖాన్ సహ యాజమాన్యంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), అలాగే మాజీ ఛాంపియన్ రాజస్థాన్ రాయల్స్ (ఆర్‌ఆర్) పాండ్యను తమ జట్టులోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్‌కు తిరిగి వచ్చిన తర్వాత హార్దిక్ పాండ్య కెరీర్ ఆశించిన స్థాయిలో సాగలేదు. అతడి నాయకత్వంలో మూడు సీజన్లలో ముంబై ఒక్కసారి మాత్రమే ప్లేఆఫ్స్‌కు చేరుకోగలిగింది. దీంతో జట్టు భవిష్యత్ ప్రణాళికలపై చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో కేకేఆర్ యాజమాన్యం గత సీజన్ ముగిసిన వెంటనే ముంబై యాజమాన్యాన్ని సంప్రదించినట్లు సమాచారం. అయితే ఆ సమయంలో రిలయన్స్ వార్షిక సమావేశాలు ఉండటంతో ట్రేడ్ చర్చలు పెద్దగా ముందుకు సాగలేదని తెలుస్తోంది. అయితే ఇప్పుడు మళ్లీ కేకేఆర్, ముంబై మధ్య పలు దఫాల చర్చలు జరిగినట్లు ఐపీఎల్ వర్గాలు చెబుతున్నాయి. కళ్లుచెదిరే ప్రైజ్ ఆఫర్ కూడా దక్కనుందట.

ప్రస్తుతం కేకేఆర్ కెప్టెన్‌గా ఉన్న అజింక్య రహానే తాత్కాలిక ఎంపిక మాత్రమేనని, భవిష్యత్ నాయకుడిగా హార్దిక్ పాండ్యను చూడాలని కోల్‌కతా నైట్ రైడర్స్ యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ ట్రేడ్ జరిగితే కేకేఆర్ కెప్టెన్సీ బాధ్యతలు కూడా హార్దిక్‌కే దక్కే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ కూడా పాండ్యపై ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. యశస్వి జైస్వాల్‌ను ముంబై ఇండియన్స్‌కు పంపి.. బదులుగా హార్దిక్ పాండ్యను తీసుకురావాలనే ట్రేడ్ ప్రతిపాదనపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. అయితే రాజస్థాన్ ఇప్పటికే రియాన్ పరాగ్‌ను భవిష్యత్ కెప్టెన్‌గా తీర్చిదిద్దే ప్రణాళికలో ఉండటంతో.. అక్కడ హార్దిక్‌కు నాయకత్వ అవకాశం లభించడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఐపీఎల్ ట్రేడ్ నిబంధనల ప్రకారం.. ఓ ఆటగాడు నేరుగా మరో ఫ్రాంచైజీతో చర్చలు జరపకూడదు. ఫ్రాంచైజీల మధ్యే చర్చలు జరగాలి. అలాగే ఆటగాడి అనుమతి లేకుండా ఎలాంటి ట్రేడ్ జరగదు. ఒకవేళ ఆటగాడు అంగీకరించకపోతే.. అతడిని వేలం జాబితాలోకి విడుదల చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే.. హార్దిక్ పాండ్యకు కేకేఆర్ అత్యంత అనుకూలమైన జట్టుగా కనిపిస్తోంది. కెప్టెన్సీ అవకాశం, జట్టు నిర్మాణం, భవిష్యత్ ప్రణాళికలు అన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే.. కోల్‌కతాకు అతడు మారే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ భారీ ట్రేడ్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story