Hardik Pandya: హార్దిక్ పాండ్య ట్రేడ్‌కు భారీ డిమాండ్.. సీఎస్‌కే, కేకేఆర్ సహా 7 జట్లు పోటీ!

Hardik Pandya: Hardik Pandya's IPL Trade. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య ట్రేడ్‌కు భారీ డిమాండ్ నెలకొంది.

Rishvik
Published on: 1 July 2026 9:15 PM IST
Hardik Pandya
X

Hardik Pandya: హార్దిక్ పాండ్య ట్రేడ్‌కు భారీ డిమాండ్.. సీఎస్‌కే, కేకేఆర్ సహా 7 జట్లు పోటీ!

Hardik Pandya: ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య వచ్చే ఐపీఎల్ సీజన్‌కు ముందు జట్టును వీడే అవకాశాలు ఉన్నట్లు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హార్దిక్ ట్రేడ్‌కు భారీ డిమాండ్ నెలకొంది. హార్దిక్‌ను తీసుకోవడానికి ఏకంగా ఏడు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపుతున్నట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే), కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) హార్దిక్‌ను సొంతం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

ఏడు జట్ల మధ్య పోటీ:

టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. హార్దిక్ పాండ్య కోసం మొత్తం ఏడు ఫ్రాంచైజీలు పోటీలో ఉన్నాయి. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) మాత్రమే హార్దిక్‌ను తీసుకోవడంపై ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. మరోవైపు సీఎస్‌కే ప్రస్తుతం ఈ రేసులో ముందంజలో ఉండగా.. కేకేఆర్ గట్టి పోటీ ఇస్తోందని సమాచారం. అలాగే రాజస్థాన్ రాయల్స్ కూడా హార్దిక్‌ను ట్రేడ్ ద్వారా దక్కించుకోవాలని సీరియస్‌గా ప్రయత్నిస్తున్నట్లు ఓ నివేదిక పేర్కొంది.

ముంబైతో హార్దిక్ ప్రయాణం:

హార్దిక్ పాండ్య 2015లో ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. 2021 వరకు ఎంఐ జట్టుకే ఆడిన అతడిని కొత్త ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ తమ తొలి సీజన్‌కు ముందు కెప్టెన్‌గా నియమించింది. రెండు సీజన్ల పాటు గుజరాత్‌కు నాయకత్వం వహించిన హార్దిక్.. ఆ తర్వాత మళ్లీ ముంబై ఇండియన్స్‌కు తిరిగి వచ్చి కెప్టెన్ బాధ్యతలు చేపట్టాడు.

అయితే హార్దిక్ నాయకత్వంలో ముంబై గత మూడు సీజన్లలో వరుసగా 10వ స్థానం, మూడో స్థానం, 9వ స్థానంలో నిలిచింది. దాంతో హార్దిక్ నాయకత్వంపై మేనేజ్మెంట్ సంతృప్తిగా లేదట. ఈ విషయం తెలిసిన అతడు జట్టును వీడేందుకు సిద్ధమయ్యాడని తెలుస్తోంది.

బెంగళూరుకు మకాం మార్చిన హార్దిక్:

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను తన శాశ్వత శిక్షణ కేంద్రంగా మార్చుకునే ఉద్దేశంతో హార్దిక్ పాండ్య బెంగళూరుకు మకాం మార్చినట్లు పీటీఐ వెల్లడించింది. సాధారణంగా భారత జట్టు ఆటగాళ్లు గాయాల చికిత్స, ఫిట్‌నెస్ పరీక్షలు లేదా జాతీయ శిబిరాల కోసం మాత్రమే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను సందర్శిస్తారు. కానీ హార్దిక్ మాత్రం తన కెరీర్ మిగతా కాలమంతా ఇదే శిక్షణ కేంద్రంగా ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

సీఓఈ సమీపంలో కొత్త నివాసం:

బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం.. హార్దిక్ ఇప్పటికే బెంగళూరు శివార్లలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. ప్రస్తుతం క్వాడ్రిసెప్స్ గాయం నుంచి కోలుకుంటున్న అతడు గత ఆరు నెలలుగా ఎక్కువ సమయం సీఓఈలోనే గడుపుతున్నాడు. 'ముంబైలోని తన నివాసం నుంచి ప్రతిరోజూ శిక్షణకు వెళ్లడం కష్టంగా మారడంతో హార్దిక్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.

కేంద్ర ఒప్పందం ఉన్న ఆటగాడిగా సీఓఈలోని అన్ని సదుపాయాలను ఉపయోగించుకునే అవకాశం అతడికి ఉంది. గాయాల నిర్వహణ నుంచి నైపుణ్యాభివృద్ధి వరకు అన్ని సౌకర్యాలు అక్కడే అందుబాటులో ఉంటాయి. ఐపీఎల్, రాష్ట్ర లేదా జాతీయ జట్టు విధులు లేని సమయంలో సీఓఈనే తన శాశ్వత శిక్షణ కేంద్రంగా ఉపయోగించనున్నాడు' అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story