IPL: హార్దిక్ రాక పంజాబ్ జట్టుకు పెద్ద బూస్టప్ లాంటిది.. రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు

IPL: హార్దిక్ రాకతో పంజాబ్ కింగ్స్ జట్టు సమతూకం మెరుగైందని కోచ్ రికీ పాంటింగ్ ధీమా వ్యక్తం చేశాడు.

Ravi
By Ravi
Published on: 21 Nov 2026 8:23 PM IST
IPL
X

IPL: హార్దిక్ రాక పంజాబ్ జట్టుకు పెద్ద బూస్టప్ లాంటిది.. రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు

IPL: ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందే పంజాబ్ కింగ్స్ తమ జట్టును బలోపేతం చేసుకునే దిశగా కీలక అడుగు వేసింది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను ట్రేడింగ్ ద్వారా జట్టులోకి తీసుకోవడంతో టీమ్ సమతూకం మెరుగైందని ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ ధీమా వ్యక్తం చేశాడు. అర్ష్‌దీప్ సింగ్‌ను వదులుకుని హార్దిక్‌ను తీసుకోవడం చర్చనీయాంశంగా మారినా, పేస్‌తో పాటు స్పిన్ విభాగాల్లోనూ ఆల్‌రౌండర్ల ఎంపికలు పెరగడం తమకు కలిసొస్తుందని వివరించాడు. "హార్దిక్ పాండ్యాను ట్రేడ్ ద్వారా తీసుకుని, అర్ష్‌దీప్ సింగ్‌ను ఇచ్చాం. మా జట్టు చాలా సమతూకంగా ఉంది" అని పాంటింగ్ జియోస్టార్‌తో చెప్పాడు. ఈ ట్రేడ్‌పై నవంబర్ 7న తొలిసారి వార్తలు వచ్చాయి. నవంబర్ 11న ఐపీఎల్ అధికారికంగా ప్రకటించింది. హార్దిక్ రూ. 18 కోట్లకు పంజాబ్ కింగ్స్‌కు వచ్చాడు. అర్ష్‌దీప్ 2019 నుంచి పంజాబ్‌కే ఆడగా, ఇప్పుడు తొలిసారి ముంబై ఇండియన్స్‌కు వెళ్లాడు. హార్దిక్ 2024లో గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబైకి వచ్చి కెప్టెన్ అయ్యాడు. అతని నాయకత్వంలో ముంబై 2024లో చివరి స్థానంలో నిలిచింది. 2025లో ప్లేఆఫ్స్‌కు చేరి క్వాలిఫయర్ 2లో పంజాబ్ చేతిలో ఓడింది. 2026లో 9వ స్థానానికి పరిమితమైంది.

వచ్చే సీజన్ కోసం పంజాబ్ కింగ్స్ మొత్తం 19 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకుని, ఆరుగురిని విడుదల చేసినట్లు పాంటింగ్ వెల్లడించాడు. హార్దిక్‌తో పాటు మార్కో జాన్సెన్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా, శశాంక్, సూర్యాంశ్ షెడ్గే, కూపర్ కానోలీ వంటి ఆల్‌రౌండర్లు జట్టులో ఉండటం అదనపు బలమని చెప్పాడు. డిసెంబర్ 16న గోవాలో జరిగే వేలంలో మిగిలిన ఖాళీలను భర్తీ చేయడంతో పాటు, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రతిభావంతులైన యువ భారత ఆటగాళ్లను ఎంపిక చేయడమే లక్ష్యమని స్పష్టం చేశాడు.

మరోవైపు రాజస్థాన్ రాయల్స్ కూడా ట్రేడింగ్‌లో కీలక మార్పులు చేసింది. లక్నో సూపర్ జెయింట్స్ నుంచి వెటరన్ పేసర్ మహమ్మద్ షమీని తీసుకుంది. సంజూ శాంసన్ జట్టును వీడటంతో ఏర్పడిన లోటును భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని హెడ్ కోచ్ కుమార్ సంగక్కర తెలిపాడు. ఇప్పటికే రవీంద్ర జడేజా, సామ్ కరన్, డొనొవన్ ఫెరీరాలను ట్రేడింగ్ ద్వారా తీసుకున్నట్లు గుర్తుచేశాడు. షిమ్రాన్ హెట్‌మయర్‌ను విడుదల చేయడంపై కూడా వివరణ ఇచ్చాడు. అతను భిన్నమైన బ్యాటింగ్ స్థానం కోరడంతో పాటు, వేలంలో పర్స్ విలువను పెంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాడు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.