Hardik Pandya: జట్టుతో ప్రయాణం చేయని హార్దిక్.. ముంబై ఇండియన్స్‌లో ఏం జరుగుతోంది?
Hardik Pandya: ఎంఐ కెప్టెన్ హార్దిక్ పాండ్య జట్టుతో కలిసి ప్రయాణం చేయకపోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.
Hardik Pandya: జట్టుతో ప్రయాణం చేయని హార్దిక్.. ముంబై ఇండియన్స్‌లో ఏం జరుగుతోంది?
Hardik Pandya: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ (ఎంఐ) పరిస్థితి దారుణంగా ఉంది. వరుస ఓటములు ఓవైపైతే.. జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్య తాజా మ్యాచ్‌లకు దూరంగా ఉండడం, జట్టుతో కలిసి ప్రయాణం చేయకపోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇప్పటికే లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌కు బ్యాక్ స్పాసమ్స్ (వెన్నునొప్పి) కారణంగా హార్దిక్ దూరమయ్యాడు. తదుపరి మ్యాచ్ కోసం ముంబై జట్టు రాయిపూర్‌కు బయలుదేరినప్పటికీ.. ఎయిర్‌పోర్ట్‌లో అతడు కనిపించకపోవడం పలు సందేహాలకు తావిస్తోంది.
ముంబై ఇండియన్స్ అధికారికంగా హార్దిక్ పాండ్య అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలిపింది. లక్నో మ్యాచ్‌లో కెప్టెన్సీ బాధ్యతలను సూర్యకుమార్ యాదవ్ చేపట్టాడు. హార్దిక్ త్వరగా కోలుకుని తిరిగి జట్టులో చేరుతాడని భావించినప్పటికీ.. జట్టుతో ప్రయాణం చేయకపోవడంతో మరింత ఊహాగానాలు మొదలయ్యాయి. ముంబై ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ కూడా హార్దిక్ గాయంపై స్పష్టమైన సమాచారం లేదని తెలిపాడు. అతను ఎప్పుడు తిరిగి వస్తాడో తెలియదని, పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో కూడా తెలియదని చెప్పాడు. దీంతో హార్దిక్ గైర్హాజరీ వెనుక నిజమైన కారణం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ సీజన్‌లో హార్దిక్ పాండ్య ప్రదర్శన కూడా ఆశించిన స్థాయిలో లేదు. 8 మ్యాచ్‌లలో కేవలం 146 పరుగులు మాత్రమే చేశాడు, అటు బౌలింగ్‌లో కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. హార్దిక్ ఫామ్ లేమి జట్టు ఫలితాలపై ప్రభావం చూపింది. ముంబై ఇండియన్స్ ప్రస్తుత సీజన్‌లో తీవ్రంగా నిరాశపరిచింది. 10 మ్యాచ్‌లలో కేవలం 3 విజయాలతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. ఐదు సార్లు ఛాంపియన్ అయిన ఎంఐకి ఇది అస్సలు జీర్ణించుకోలేని విషయం.
ముంబై పరిస్థితికి ప్రధాన కారణంగా కెప్టెన్సీ మార్పు అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. రోహిత్ శర్మ నుంచి నాయకత్వాన్ని తీసుకుని హార్దిక్ పాండ్యకు ఇవ్వడం కొత్త దశను ప్రారంభించాలనే ఉద్దేశంతో ప్రాంచైజీ చేసిన నిర్ణయం. కానీ అది జట్టు స్థిరత్వాన్ని దెబ్బతీసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హార్దిక్ సారథ్యంలో ఆడడం చాలామందికి ఇష్టం లేదని సమాచారం. అందుకే వారు సరిగా ఆడడం లేదని అంటున్నారు. ముంబై ఇండియన్స్‌లో ఏం జరుగుతోందో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. హార్దిక్ గైర్హాజరీ, అతని ఫామ్ లేమి, జట్టు అంతర్గత మార్పులు.. అన్ని ముంబై ఇండియన్స్‌కు కష్టకాలాన్ని తెచ్చాయి.




