Mumbai Indians: ముంబై ఇండియన్స్‌లో ముసలం.. బుమ్రా, సూర్య కుమార్ యాదవ్‌పై వేటు..?

Mumbai Indians: ఐదుసార్లు ఛాంపియన్.. ఐపీఎల్‌లోనే అత్యంత విజయవంతమైన జట్టు.. కానీ ఇప్పుడు పాయింట్ల పట్టికలో అట్టడుగున కొట్టుమిట్టాడుతోంది.

Naresh.k
Published on: 25 April 2026 9:06 AM IST
Mumbai Indians
X

Mumbai Indians: ముంబై ఇండియన్స్‌లో ముసలం.. బుమ్రా, సూర్య కుమార్ యాదవ్‌పై వేటు..?

Hardik Pandya: ఐదుసార్లు ఛాంపియన్.. ఐపీఎల్‌లోనే అత్యంత విజయవంతమైన జట్టు.. కానీ ఇప్పుడు పాయింట్ల పట్టికలో అట్టడుగున కొట్టుమిట్టాడుతోంది. ముంబై ఇండియన్స్ పాలిట 2026 సీజన్ ఒక పీడకలలా మారుతోంది. ముఖ్యంగా చిరకాల ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎదురైన ఘోర పరాజయం జట్టులోని లోపాలను ఎత్తిచూపడమే కాకుండా, కెప్టెన్ హార్దిక్ పాండ్యా కఠిన నిర్ణయాల దిశగా అడుగులు వేసేలా చేసింది.

ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతు?

సొంత మైదానం వాంఖడేలో జరిగిన 33వ మ్యాచ్‌లో ముంబై ప్రదర్శన అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై, సంజూ శాంసన్ (101) మెరుపు సెంచరీతో 207 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే, లక్ష్య ఛేదనలో ముంబై బ్యాటర్లు పేకమేడలా కూలిపోయారు. కేవలం 104 పరుగులకే ఆలౌట్ అయి, 103 పరుగుల భారీ తేడాతో ఓటమిని చవిచూశారు. ఆడిన ఏడు మ్యాచ్‌లలో ఐదు ఓటములతో ముంబై ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలిచింది.

జట్టులో పెను మార్పులు?

మ్యాచ్ అనంతరం హార్దిక్ చేసిన వ్యాఖ్యలు జట్టులో తుఫానుకు సంకేతాలు ఇచ్చాయి. మేం చేసిన తప్పులను సమీక్షించుకోవాలి. భవిష్యత్తు ప్రణాళికలపై కసరత్తు చేస్తాం. జట్టు ప్రయోజనం కోసం ఎలాంటి కఠిన నిర్ణయాలకైనా వెనకాడబోం అని హార్దిక్ స్పష్టం చేశాడు. నేరుగా ఎవరి పేరు చెప్పకపోయినా, కీలక ఆటగాళ్ల వైఫల్యంపై హార్దిక్ అసహనంగా ఉన్నట్లు అర్థమవుతోంది.

బుమ్రా, సూర్య ఏమయ్యారు?

భారత జట్టును ప్రపంచకప్ విజేతగా నిలిపిన వీరులు ఇప్పుడు ఐపీఎల్‌లో నీడలా మిగిలిపోయారు.ప్రపంచ అత్యుత్తమ బౌలర్ అని పేరున్న బుమ్రా, ఈ సీజన్‌లో తన పదును కోల్పోయినట్లు కనిపిస్తోంది. ఏడు మ్యాచ్‌లలో బుమ్రా ఖాతాలో ఉన్నవి కేవలం 2 వికెట్లు మాత్రమే. గత ఐదు మ్యాచ్‌లలో అతను దాదాపు వికెట్లే తీయలేకపోయాడు.టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ సూర్య సైతం తనదైన శైలిలో ఆడలేకపోతున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు అతను చేసిన పరుగులు కేవలం 156. మిడిల్ ఆర్డర్‌లో సూర్య విఫలం కావడం ముంబైకి పెద్ద మైనస్‌గా మారింది.

ముందున్నది జీవన్మరణ పోరాటమే

ముంబై ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఇక మిగిలిన ఏడు మ్యాచ్‌లలో కనీసం ఆరింటిలో విజయం సాధించాల్సి ఉంటుంది. కేవలం గెలవడమే కాదు, రన్ రేట్‌ను కూడా మెరుగుపరుచుకోవాలి. ఏప్రిల్ 29న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగబోయే పోరు ముంబైకి అత్యంత కీలకం. ఈ మ్యాచ్‌లో బుమ్రా, సూర్య వంటి సీనియర్లకు విశ్రాంతి ఇచ్చి, కొత్త రక్తాన్ని జట్టులోకి తీసుకుంటారా? లేక అదే జట్టుతో అదృష్టాన్ని పరీక్షించుకుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story