Harmanpreet: ప్రపంచ కప్‌కు ముందే అరుదైన ఘనతను సొంతం చేసుకున్న టీమిండియా కెప్టెన్‌!

Harmanpreet: దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్‌కు వరుస పరాజయాలు ఎదురైనా హర్మన్‌ప్రీత్ కౌర్ మహిళల టీ20ల్లో అత్యధిక పరుగుల రికార్డును సాధించింది.

Ramya Thota
Published on: 23 April 2026 7:13 PM IST
Harmanpreet
X

Harmanpreet: ప్రపంచ కప్‌కు ముందే అరుదైన ఘనతను సొంతం చేసుకున్న టీమిండియా కెప్టెన్‌!

Womens T20I: ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ పర్యటనలో ఉన్న భారత మహిళల జట్టుకు, మొదటి మూడు మ్యాచ్‌లలోనూ ఘోర పరాజయాలు ఎదురైన సంగతి తెలిసిందే. అయితే, జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో జరిగిన మూడో మ్యాచ్‌లో 66 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఒక అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 192 పరుగులు చేయగా, ఆఫ్రికా జట్టు కేవలం ఒక వికెట్ నష్టానికి 16.3 ఓవర్లలోనే ఆ లక్ష్యాన్ని చేరుకుంది.

ఆ ఘనత సాధించిన క్రీడాకారిణిగా..

భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఇప్పుడు మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా నిలిచింది. ఇంతకుముందు ఈ స్థానంలో శ్రీలంక మహిళల జట్టు కెప్టెన్ చమరి అటపట్టు ఉండగా, ఇప్పుడు హర్మన్‌ప్రీత్ కౌర్ ఆమెను అధిగమించింది. మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో కెప్టెన్‌గా 138 మ్యాచ్‌లు ఆడిన హర్మన్‌ప్రీత్ కౌర్, 125 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసి 32.79 సగటుతో మొత్తం 3,017 పరుగులు సాధించింది.

ఈ కాలంలో ఆమె ఒక సెంచరీ, 14 హాఫ్ సెంచరీలు నమోదు చేసింది. ప్రస్తుతం ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న శ్రీలంక కెప్టెన్ చమరి అటపట్టు 3,016 పరుగులు చేసింది. మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో కెప్టెన్‌గా 3,000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన రెండో క్రీడాకారిణిగా హర్మన్‌ప్రీత్ కౌర్ నిలిచింది.

కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారుణులు..

హర్మన్‌ప్రీత్ కౌర్ (భారతదేశం) – 3017 పరుగులు

చమరి అటపట్టు (శ్రీలంక) - 3016 పరుగులు

మెగ్ లానింగ్ (ఆస్ట్రేలియా) – 2619 పరుగులు

షార్లెట్ ఎడ్వర్డ్స్ (ఇంగ్లాండ్) - 2529 పరుగులు

సుజీ బేట్స్ (న్యూజిలాండ్) - 2236 పరుగులు

భారత జట్టుకు ప్రమాద ఘంటికలు

ఈ ఏడాది మహిళల టీ20 ప్రపంచ కప్ ఇంగ్లాండ్‌లో జరుగుతోంది, ఈ టోర్నమెంట్ జూన్ 12న ప్రారంభం కానుంది. అందువల్ల, తమ సన్నాహాలను పటిష్టం చేసుకోవడానికి టీమ్ ఇండియాకు ఎక్కువ సమయం లేదు. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లలోనూ బౌలర్ల పేలవ ప్రదర్శన టీమ్ ఇండియాకు పెద్ద ఎదురు దెబ్బలాగానే ఉంది మరి.

Ramya Thota

Ramya Thota

రమ్య జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు.

Next Story