Harmanpreet Kaur: దేవుడే గొప్ప కథా రచయిత.. లార్డ్స్ చరిత్రాత్మక విజయంపై హర్మన్‌ప్రీత్ భావోద్వేగం!

Harmanpreet Kaur React on India Historic Test Win At Lord's. లార్డ్స్ మైదానంలో భారత మహిళల జట్టు చిరస్మరణీయ విజయానంతరం కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ భావోద్వేగం చెందింది.

Rishvik
Published on: 13 July 2026 8:29 PM IST
Harmanpreet Kaur
X

Harmanpreet Kaur: దేవుడే గొప్ప కథా రచయిత.. లార్డ్స్ చరిత్రాత్మక విజయంపై హర్మన్‌ప్రీత్ భావోద్వేగం!

Harmanpreet Kaur: క్రికెట్‌కు పుట్టినిల్లుగా పేరొందిన లార్డ్స్ మైదానంలో ఆతిథ్య ఇంగ్లండ్‌ను 270 పరుగుల భారీ తేడాతో ఓడించిన భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. ఈ చిరస్మరణీయ విజయానంతరం కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ భావోద్వేగం చెందింది. తాము ఇంతకంటే గొప్ప కథను రాసుకోలేమని.. 'దేవుడే గొప్ప రచయిత.. ఈ విజయాన్ని ఆయన అద్భుతంగా రాశాడు' అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. లార్డ్స్‌లో టెస్టు గెలిచిన తొలి భారత మహిళల కెప్టెన్‌గా చరిత్రలో నిలిచిన హర్మన్‌ప్రీత్.. ఈ విజయం జట్టు సమిష్టి కృషి వల్లే సాధ్యం ఆయిందని పేర్కొంది.

'ఈ టెస్ట్ మ్యాచ్‌లో ఓపెనర్లు అందించిన ఆరంభమే విజయానికి బలమైన పునాది వేసింది. ఓపెనింగ్ జోడీ బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేసి జట్టుపై ఉన్న ఒత్తిడిని తగ్గించింది. ప్రతి మ్యాచ్‌లోనూ బాధ్యత తీసుకుని మిగతా బ్యాటర్లపై ఉండే ఒత్తిడిని తగ్గిస్తారు. ఈ టెస్టులో కూడా వారు ఆడిన తీరు చూడటానికి ఎంతో ప్రత్యేకంగా అనిపించింది. తక్కువ టెస్టులు ఆడుతున్నప్పటికీ భారత జట్టు వరుస విజయాలు సాధించడంలో సహాయక సిబ్బంది పాత్ర ఎంతో ఉంది. కోచ్ అమోల్ ముజుందార్‌తో పాటు మొత్తం సపోర్ట్ స్టాఫ్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. టెస్టు క్రికెట్‌పై వారికి ఉన్న అనుభవం, మ్యాచ్‌లో ప్రతి దశలో ఇచ్చిన సూచనలు జట్టుకు ఎంతో ఉపయోగపడ్డాయి. ఇంగ్లండ్ పర్యటనలో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆశించిన విధంగా సాగకపోయినా.. జట్టును ఒక్కటిగా ఉంచడంలో కోచింగ్ సిబ్బంది కీలక పాత్ర పోషించారు' అని హర్మన్‌ప్రీత్ కొనియాడింది.

'యస్తిక భాటియా గొప్ప బ్యాటర్. అందుకే పూర్తి నమ్మకంతో ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు కల్పించాము. ఆ నమ్మకాన్ని యస్తిక శతకంతో నిలబెట్టింది. రిచా ఘోష్ అందుకున్న అద్భుత క్యాచ్‌తో పాటు మొత్తం జట్టు ఫీల్డింగ్ అత్యున్నత స్థాయిలో ఉంది. గత కొన్నేళ్లుగా ఫీల్డింగ్‌పై ప్రత్యేకంగా శ్రమిస్తున్నాము. ఆ కష్టానికి ఈ మ్యాచ్‌లో ఫలితం కనిపించింది. ఇంగ్లండ్ పర్యటనను లార్డ్స్‌లో చారిత్రాత్మక విజయంతో ముగించడం ఎంతో ప్రత్యేకకం. లార్డ్స్‌లో మహిళల టెస్టు నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్న నిర్వాహకులకు కృతజ్ఞతలు. భవిష్యత్తులో ఇలాంటి టెస్టులు నిర్వహించాలని కోరుకుంటున్నా. ఇలాంటి మ్యాచ్‌లు మహిళల క్రికెట్‌కు మరింత ఆదరణ, ఉత్సాహాన్ని తీసుకొస్తాయి. భవిష్యత్తులో మరిన్ని టెస్టులు ఆడే అవకాశం వస్తే ఇలాగే అద్భుత ప్రదర్శన కొనసాగిస్తాము' అని హర్మన్‌ప్రీత్ కౌర్ ధీమా వ్యక్తం చేసింది.

తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 285 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ 170కి ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 341/7 స్కోరు వద్ద డిక్లేర్డ్‌ చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ఇంగ్లండ్ ముందు 457 పరుగుల లక్ష్యంను భారత్ ఉంచింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లీష్ జట్టు 186 పరుగులకే ఆలౌటైంది. ఈ టెస్టు మ్యాచ్‌లో యస్తికా భాటియా (113) సెంచరీ చేయగా.. స్మృతి మంధాన రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ హాఫ్ సెంచరీలు చేసింది. బౌలర్‌ క్రాంతి గౌడ్ లార్డ్స్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్స్, రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్స్ పడగొట్టి.. ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది. సెంచరీ చేసిన యస్తికా, ఐదు వికెట్స్ తీసిన క్రాంతిలు లార్డ్స్‌ ఆనర్స్‌ బోర్డులో తమ పేరును పేరు లిఖించుకున్నారు.


Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story